పప్పు అంటూ కేటీఆర్ ట్వీట్.. సోషల్ మీడియాలో రచ్చ
posted on Jul 25, 2021 @ 12:22PM
తెలంగాణ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు పుట్టిన రోజు సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా గులాబీ లీడర్లు, కార్యకర్తలు హంగామా చేశారు. గ్రీన్ ఛాలెంజ్ లో భాగంగా కోటి వృక్షార్చన పేరుతో భారీగా మొక్కలు నాటి కేటీఆర్ కు శుభాకాంక్షలు చెప్పారు. టీఆర్ఎస్ నేతలతో పాటు వివిధ పార్టీల నేతలు కూడా కేటీఆర్ కు విషెష్ చెబుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. జాతీయ స్థాయిలోని ప్రముఖులు కూడా కేటీఆర్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పారు.
కేటీఆర్ బర్త్ డే రోజున ఓ ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. థ్యాంక్యూ పప్పు అంటూ కేటీఆర్ చేసిన ట్వీట్ వైరల్ గా మారింది. రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారి తీసింది. దేశ రాజకీయాలతో పాటు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో పప్పు అన్న పదానికి చాలా స్టోరీ ఉంది. కాంగ్రెస్ యువ నేత రాహుల్ గాంధీని విపక్ష నేతలు పప్పు అని ఆరోపణలు చేస్తూ ఉంటారు. తెలుగు రాష్ట్రాలకు వస్తే.. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ను వైసీపీ నేతలు లోకేష్ అని కామెంట్ చేస్తుంటారు. దీంతో కేటీఆర్ పప్పు అని చేసిన కామెంట్ ఆసక్తి రేపింది.
అయితే కేటీఆర్ చేసిన పప్పు ట్వీట్ వెనుక అసలు విషయంలోకి వెళితే.. ఎమ్మెల్సీ కవిత తన సోదరుడు కేటీఆర్ కు బర్త్ డే విషెస్ చెప్పారు. ''హ్యాపీ బర్త్ డే అన్నయ్యా.. ఎప్పుడూ ఇలాగే సంతోషంగా ఉండాలి. మరిన్ని విజయాలు సాధించాలి.'' అంటూ కవిత ట్వీట్ చేశారు. సోదరి కవిత ట్వీట్‌కు మంత్రి కేటీఆర్ స్పందించారు. థ్యాంక్యూ పప్పు.. అని రిప్లై ఇచ్చారు. దీనిపై టీఆర్ఎస్ నేతలతో పాటు సామాన్య జనాలు కూడా వెరైటీగా స్పందించారు. నెటిజన్లు సరదా కామెంట్లు పెట్టారు. మరికొందరు సెటైర్లు వేశారు. కవితను మీరు పప్పు అని పిలుస్తారా? అని నెటిజన్లు కేటీఆర్ ను ప్రశ్నించారు. మొత్తానికి కవిత నిక్ నేమ్ తొలిసారి బయటపెట్టారు అంటూ సరదాగా ట్వీట్స్ చేస్తున్నారు. కేటీఆర్ ట్వీట్ తో ఇంట్లో కవితను పప్పు అనే ముద్దు పేరు ఉందనే విషయం బయటకు వచ్చింది. చిన్నప్పుడు కవితను పప్పు అన్న పేరుతోనే అందరూ పిలిచేవారని చెబుతున్నారు.