జేసీ మొనగాడురా బుజ్జా.. తాడిపత్రిపై మరోసారి టీడీపీ జెండా..
posted on Jul 30, 2021 @ 1:19PM
తొడకొట్టారు. ఇంటిపైకి దాడికొచ్చారు. కేసులతో కుట్రలు చేశారు. బస్తీ మే సవాల్ అంటూ మీసం మెలేశారు. ఇంత ఓవరాక్షన్ చేసినా.. జేసీ బ్రదర్ ముందు వైసీపీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి పప్పులేమీ ఉడకలేదు. తాడిపత్రిలో జేసీ ఫ్యామిలీకి, టీడీపీకి తిరుగులేదని మరోసారి నిరూపించారు. ఉత్కంఠ రేపిన తాడిపత్రి మున్సిపాలిటీ రెండో వైస్ ఛైర్మన్ పదవి కూడా తెలుగుదేశం ఖాతాలోనే పడింది. కౌన్సిల్ హాల్‌కు వెళ్లకుండానే.. ఇంట్లో కూర్చొని చక్రం తిప్పారు జేసీ ప్రభాకర్‌రెడ్డి. తాడిపత్రిలో తనకు తిరుగులేదని మరోసారి నిరూపించారు. వైసీపీ శ్రేణులకు, ఎమ్మెల్యే పెద్దారెడ్డికి దిమ్మతిరిగి మైండ్ బ్లాంక్ అయ్యేలా షాక్ ఇచ్చారు.
ఏపీ వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికలు జరిగితే.. ఒక్క తాడిపత్రిలోనే టీడీపీ జెండా ఎగిరింది. అది జేసీ కుటుంబం సత్తాకి నిదర్శనం. టీడీపీని ఎలాగైనా దెబ్బకొట్టి.. తన పట్టు నిలుపుకోవాలని తెగ ట్రై చేశారు MLA పెద్దారెడ్డి. తాడిపత్రి పీఠం కోల్పోయినప్పటి నుంచీ ధూంధాం చేశారు. ఏకంగా జేసీ ఇంటిపైకే దాడికి వచ్చారు పెద్దారెడ్డి అండ్ గ్యాంగ్. అప్పటి నుంచీ ఆ రెండు వర్గాల మధ్య నువ్వా-నేనా అన్నట్టు పొలిటికల్ వార్ నడుస్తోంది. తాజాగా, తాడిపత్రి మున్సిపాలిటీ రెండో వైస్ చైర్మన్ ఎన్నికలపై ఉత్కంఠ, ఉద్రిక్తత మరింత పెరిగింది. జేసీ ప్రభాకర్‌రెడ్డి వ్యూహాత్మకంగా వ్యవహరించి.. టీడీపీ సభ్యులతో పాటు తనకు మద్దతుగా ఉన్న కమ్యూనిస్టు అభ్యర్థి, ఇండిపెండెంట్ కేండిడేట్‌తో ప్రత్యేక క్యాంప్ ఏర్పాటు చేశారు. ఇక టీడీపీదే విజయమని భావించిన వైసీపీ.. వైస్ ఛైర్మన్ ఎన్నికకు గైర్హాజరు కావడంతో విజయం టీడీపీ ఖాతాలో పడింది.
తాడిపత్రిలో టీడీపీకి 18, వైసీపీకి 16 వార్డులు వచ్చాయి. ఒకరు సీపీఐ నుంచి, మరొకరు ఇండిపెండెంట్‌గా గెలిచారు. వారిద్దరూ TDPకే మద్దతు ఇచ్చారు. దీంతో TDP బలం 20కి పెరిగింది. YCPకి ఇద్దరు ఎక్స్‌అఫిషియో సభ్యులు ఉన్నారు. దాంతో ఆ పార్టీ బలం 18కి చేరింది. వైసీపీ గైర్హాజరుతో ఎలాంటి నెంబర్ గేమ్ లేకుండానే టీడీపీ మద్దతుదారే వైస్ చైర్మన్ అయ్యారు. వైసీపీపై టీడీపీది మరోసారి పైచేయి సాధించింది. తాడిపత్రిలో జేసీ ఫ్యామిలీకి ఎదురులేదని రుజువైంది.