రేసుగుర్రంలా కొవిడ్.. పైపైకి ఆర్-ఫ్యాక్టర్.. థర్డ్ వేవ్ సిగ్నల్స్..
posted on Jul 30, 2021 @ 10:58AM
తగ్గినట్టే తగ్గింది. హమ్మయ్యా అనిపించింది. కాస్త రిలీఫ్ ఇచ్చింది. కొన్నాళ్లు హ్యాపీ అనుకున్నారంతా. మళ్లీ పోలోమంటూ రోడ్డెక్కేసారు జనాలంతా. అదే ఇప్పుడు కొంప ముంచుతోంది. కరోనా కేసులు తగ్గుముఖం పట్టడం.. వ్యాప్తి మందగించడం.. ఆంక్షలు తొలగిపోవడంతో.. వైరస్‌ను లైట్ తీసుకుంటున్నారు. గతంలో మాదిరే విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నారు. ఇదే అదనుగా మళ్లీ పంజా విసురుతోంది కొవిడ్. తగ్గేదే లే అన్నట్టు మునుపటిలా వేగంగా వ్యాప్తిస్తోంది. ముందు కేరళతో మొదలుపెట్టింది. ఈశాన్య రాష్ట్రాల్లో చెలరేగుతోంది. హైదరాబాద్‌లో భారీగా కేసులు వస్తున్నాయి. తూర్పుగోదావరిలోనైతే అసలు బ్రేకే ఇవ్వలేదు కరోనా. ఇదంతో మూడో ముప్పునకు సంకేతమని.. ఈసారి మరింత కల్లోలం తప్పదని హెచ్చరిస్తున్నారు వైద్య నిపుణులు. అందుకే కాబోలు.. 100 పడకలున్న ప్రతీ ఆసుపత్రిలో ఆక్సిజన్ ప్లాంట్ తప్పనిసరి అని ఆదేశాలు ఇస్తున్నాయి ప్రభుత్వాలు. పిల్లల కోసమూ ప్రత్యేక వార్డులు రెడీ చేస్తున్నాయి.
కొవిడ్ ఇన్‌ఫెక్షన్ వ్యాప్తి వేగాన్ని ఆర్-ఫ్యాక్టర్ (రీ ప్రొడక్షన్ రేట్) తో కొలుస్తారు. ఈ రేషియో దేశంలో క్రమేపీ పెరుగుతోంది. ఆర్-ఫ్యాక్టర్ 1కి చేరువవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. కేరళతో పాటు పలు ఈశాన్య రాష్ట్రాల్లో పరిస్థితి తీవ్రంగా ఉంది. మెట్రో నగరాలైన పుణె, దిల్లీల్లోనూ ఆర్-ఫ్యాక్టర్ పెరుగుతున్నట్లు చెన్నైలోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మ్యాథమెటికల్ సైన్సెస్ పరిశోధకులు తెలిపారు.
దేశంలో కొవిడ్ రెండో ఉద్ధృతి అత్యంత తీవ్రదశలో ఉన్నప్పుడు ఆర్-ఫ్యాక్టర్ 1.37గా ఉండేది. ఆ తర్వాత తగ్గుతూ వచ్చి 0.78కి చేరింది. జులైలో మళ్లీ పెరుగుదల మొదలైంది. జులై 3 - 22 మధ్య ఇది ఏకంగా 0.95కి పెరగడం ఆందోళనకరం.
కొవిడ్ బారిన పడిన వారి నుంచి వైరస్ ఇతరులకు సంక్రమించే తీరును ఆర్-ఫ్యాక్టర్ తెలుపుతుంది. ఉదాహరణకు ఇది 0.95 ఉందంటే.. కొవిడ్ సోకిన ప్రతి 100 మంది ద్వారా ఇన్‌ఫెక్షన్ మరో 95 మందికి సోకుతుందని అర్థం. అదే 1 దాటితే పరిస్థితి తీవ్రమవుతుంది. కేరళలో ఆర్-ఫ్యాక్టర్ ఏకంగా 1.11 ఉంది. ఈశాన్య రాష్ట్రాల్లో త్రిపుర, మణిపుర్ మినహా మిగిలిన అన్నిచోట్ల 1 దాటింది. మణిపుర్‌లో కూడా 1కి చేరువగా ఉంది.
దేశంలో కొవిడ్ రోజువారీ కేసుల సంఖ్య గురువారం 43 వేలు దాటింది. వరుసగా రెండో రోజు క్రియాశీలక కేసుల సంఖ్యలో పెరుగుదల నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. గడిచిన 24 గంటల్లో 43,509 కొత్త కేసులు రాగా.. 640 మంది కొవిడ్‌తో చనిపోయారు. వ్యాక్సినేషన్ జోరుగా సాగుతున్నా.. పాజిటివ్ కేసులు పెరుగుతుండటం ప్రమాదకరంగా మారుతోంది. వ్యాక్సిన్‌కు విరుగుడుగా వైరస్ రూపాంతరం చెంది మరింత బలపడుతోందా? అనే దిశగా పరిశోధనలు జరుగుతున్నాయి.