జగన్ తర్వాత విజయసాయినే టార్గెట్.. మరో కేసుతో రఘురామ దూకుడు..
posted on Jul 30, 2021 @ 4:16PM
రఘురామ ఫుల్ ఖుషీగా ఉండి ఉంటారు. ఆగస్టు 25 కోసం ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉంటారు. జగన్‌కు గుండె దడ పెరిగి ఉంటుంది. ఆగస్టు 25 వస్తుందంటేనే ఆయనలో ఉత్కంఠ పెరిగిపోతుంటుంది. ఒకే డేట్. ఆ ఇద్దరిలో వేరు వేరు వేరియేషన్స్. జగన్ బెయిల్ రద్దుపై సీబీఐ కోర్టు తీర్పు వెలువరించే రోజు. ఎన్నాళ్లో వేచిన ఆ ఉదయం.. అతి త్వరలోనే ఆవిష్కృతం కాబోతోంది.
ఆర్థిక నేరాలు, అక్రమాస్తుల కేసులో 11 చార్జిషీట్లలో ఏ1 ఉన్న జగన్ బెయిల్‌ను రద్దు చేయాలని కోర్టులో రఘురామ పిటిషన్ దాఖలు చేశారు. జగన్మోహన్‌రెడ్డి సీఎం పదవిని అడ్డుపెట్టుకుని కేసులను నీరుగారుస్తూ, సీబీఐ అధికారులు, సాక్ష్యాలను ప్రలోభాలకు గురిచేస్తూ, నిబంధనలకు విరుద్ధంగా వ్యహరిస్తున్నారని.. అందువల్ల బెయిల్ రద్దు చేయాలని గతంలో హైదరాబాద్ నాంపల్లిలోని సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు రఘురామ. ఈ అనూహ్య పరిణామంతో జగన్ షాక్‌కు గురయ్యారు. రెండేళ్లుగా బిందాస్‌గా ఉన్నా.. సడెన్‌గా తన బెయిల్ రద్దు చేయమంటే ఎలా? అంటూ ఉలిక్కిపడ్డారు.
అటు, రఘురామ చెప్పిన కారణాలు, చూపిస్తున్న సాక్షాలు పక్కాగా ఉండటంతో.. జగన్ ఇరకాటంలో పడ్డారు. అందుకే ఇటు జగన్ తరఫు లాయర్లు.. అటు సీబీఐ న్యాయవాదులు ఎప్పటికప్పుడు వాయిదాలతో రెండు మూడు నెలలు పబ్బం గడుపుకున్నారు. కానీ, ఎన్నిసార్లని వాయిదాలు అడుగుతారు? ఎన్నిసార్లు అని కోర్టు వాయిదాలు వేస్తుంది? జడ్జిమెంట్ ఇచ్చే రోజు రానేవచ్చింది.. ఆగస్టు 25న ముహూర్తం ఫిక్స్ అయింది. బెయిల్ రద్దు నిర్ణయాన్ని సీబీఐ కోర్టుకే వదిలేయడంతో కేసు క్లైమాక్స్‌కు చేరింది. సీబీఐ ఎక్కడా జగన్ బెయిల్ రద్దు చేయవద్దు అని అనలేదు. ఆయన బెయిల్ నిబంధనలను ఉల్లంఘించడం లేదనీ చెప్పలేదు. సో, మౌనం అర్థ అంగీకారం అన్నట్టే అనుకోవాలా? బెయిల్ రద్దుపై సీబీఐ జోక్యం చేసుకోలేదంటే.. కోర్టు విచక్షణకే వదిలేసిందంటే.. జగన్ బెయిల్ రద్దు తప్పదా? మళ్లీ జైలుకు వెళ్లాల్సిందేనా? అనే చర్చ జోరుగా సాగుతోంది.
కేసు వేసిన రఘురామ మాత్రం 100% జగన్ బెయిల్ రద్దు అవుతుందని ధీమాగా ఉన్నారు. జగన్‌రెడ్డి బెయిల్ రద్దు అయి జైలుకెళ్లాక.. ఇక విజయసాయిరెడ్డి పని పడతానంటూ సవాల్ చేస్తున్నారు. విదేశాలకు పారిపోయేందుకు ఏ2 చూస్తున్నారని, మరో 2 రోజుల్లో విజయసాయిరెడ్డి బెయిల్‌ను కూడా రద్దు చేయాలని పిటిషన్ వేస్తానని రఘురామ ప్రకటించి కలకలం రేపారు.
రఘురామ అన్నారంటే అన్నంత పని చేస్తారు. ఇప్పటికే జగన్‌కు చుక్కలు చూపిస్తున్నారు. కోర్టులో గట్టిగా నిలబడి.. త్వరితగతిన విచారణ జరిగేలా చేసి.. ఆగస్టు 25న తీర్పు వచ్చేలా చేశారు. సీఎం హోదాలో ఉన్న జగనే.. రఘురామ దూకుడును తట్టుకోలేకపోతే.. ఇక సాధారణ ఎంపీ అయిన విజయసాయిరెడ్డి.. రఘురామ ముందు ఇంకేం నిలబడతాడు? ఆయన సృష్టించే సునామీలో కొట్టుకుపోవడం ఖాయం అంటున్నారు. జగన్ బెయిల్ రద్దు అయితే.. విజయసాయిని సైతం మళ్లీ జైలుకి సాగనంపితే.. వైసీపీ సర్కారు కుప్పకూలడం తప్పకపోవచ్చని చెబుతున్నారు. మొక్కే కదాని పీకేస్తే.. పీక కోసేలా ఉన్నాడంటూ రఘురామను తలుచుకొని నిద్రలేని రాత్రులు గడుపుతున్నారట జగన్ అండ్ విజయసాయి.