వైసీపీకి సీబీఐ ఉచ్చు.. సోషల్‌మీడియా కేసులో అరెస్టులు..
posted on Jul 30, 2021 @ 6:46PM
నోటికొచ్చినట్టు కూశారు. చేతికొచ్చినట్టు రాశారు. అధికారమే మాది.. మమ్మల్ని ఎవరు అడిగేది అనుకున్నారు. పాలకుల సైగతో మరింత రెచ్చిపోయారు. టీడీపీని తిట్టినట్టు.. న్యాయవ్యవస్థపై నోరు పారేసుకున్నారు. జడ్జిమెంట్ జగన్ సర్కారుకు అనుకూలంగా రాలేదనే అక్కసుతో.. న్యాయమూర్తులపై సోషల్ మీడియాలో ఇష్టారీతిన పోస్టులు పెట్టారు. జడ్జిలను కించపరిచారు. జ్యుడీషియల్ సిస్టమ్‌ను బద్నామ్ చేశారు. న్యాయవ్యవస్థ కన్నెర్ర చేయడంతో.. చేసిన తప్పుకు ఇప్పుడు అనుభవిస్తున్నారు. వైసీపీ సోషల్ మీడియా విభాగంపై జరుగుతున్న సీబీఐ దర్యాప్తు మరింత వేగం పుంజుకుంది.
న్యాయమూర్తులు, న్యాయవ్యవస్థను దూషించిన కేసులో సీబీఐ వేగంపెంచింది. ఇప్పటికే పలువురు వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులకు సీబీఐ నోటీసులిచ్చింది. తాజాగా, ఈ కేసులో మరో ఇద్దరిని అరెస్ట్ చేసింది. మరోవైపు విచారణకు రావాలని వైసీపీ సోషల్ మీడియా ఇన్‌చార్జ్ దేవేందర్‌రెడ్డిని సీబీఐ ఆదేశించింది. ఈ దేవేందర్‌రెడ్డినే వైసీపీకి చెందిన అన్ని గ్రూపులను డైరెక్ట్ చేస్తారంటారు. ఆయన కనుసన్నల్లోనే సోషల్ మీడియాలో వైసీపీ శ్రేణులు రెచ్చిపోతుంటాయని చెబుతారు. ఎప్పటికప్పుడు టీడీపీ మీద సెటైర్లు వేయడం.. వాటిని వైరల్ చేయడం ఈ గ్రూపుల పని. చంద్రబాబు, లోకేశ్ టార్గెట్‌గా అభ్యంతకర పోస్టులు పెట్టేదీ వీరే. జగన్‌కు వ్యతిరేకంగా వచ్చే వార్తలను స్క్రుటినీ చేసి అధినేతకు నివేదికలు సమర్పిస్తుంటారు. వీరి ఇన్ఫర్మేషన్ మేరకే ప్రభుత్వ వ్యతిరేక పోస్టులపై కేసులు పెడుతుంటారు. ఆ అలవాటు ప్రకారమే.. ముందు వెనకా ఆలోచించకుండా అప్పట్లో హైకోర్టు తీర్పును తప్పుబడుతూ తెగ పోస్టులు పెట్టారు. జడ్జిలపై నిందారోపణలు చేశారు.
కట్ చేస్తే.. హైకోర్టు, న్యాయమూర్తులపై సోషల్ మీడియాలో కించపర్చే పోస్టులను హైకోర్టు సుమోటోగా తీసుకుంది. కేసు విచారణను ఏకంగా సీబీఐకి అప్పగించడం అప్పట్లో సంచలనం సృష్టించింది. న్యాయమూర్తులపై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో హైకోర్టు ఆదేశాలతో 16 మందిపై సీబీఐ కేసు నమోదు చేసింది. విశాఖలో 12 మంది, ఇతర ప్రాంతాల్లో నలుగురిపై సీబీఐ కేసు పెట్టింది. సీబీఐ తన నివేదికను ఇప్పటికే హైకోర్టుకు సమర్పించింది. తాజాగా, వైసీపీ సోషల్ మీడియా ఇన్‌చార్జ్ దేవేందర్‌రెడ్డిని విచారణకు రావాలని ఆదేశించడం, మరో ఇద్దరిని అరెస్ట్ చేయడంతో సీబీఐ ఉచ్చు బిగుస్తున్నట్టే ఉంది.