వీ వాంట్ గోల్డ్.. టఫ్ ఫైట్‌లో నెగ్గిన సింధు..
posted on Jul 30, 2021 @ 3:14PM
గత ఒలింపిక్స్‌లో వెండి వెలుగులు. ఈసారి ఏకంగా స్వర్ణ 'సింధు'రం సాధ్యం కావొచ్చు. ఒలింపిక్స్‌లో భారత టాప్ షట్లర్ పీవీ సింధు జైత్రయాత్ర కొనసాగుతోంది. క్వార్టర్ ఫైనల్స్‌లో అత్యంత టఫ్ ఫైట్‌ను దాటేసింది. ఉత్కంఠభరితంగా సాగిన ఆ మ్యాచ్‌లో యమగుచిపై గెలిచి.. సెమీస్‌లోకి దూసుకెళ్లింది. ఫైనల్ వరకూ ఈ దూకుడు ఇలానే కంటిన్యూ అయితే.. ఈసారి పీవీ సింధు మెడలో స్వర్ణ పతకం వచ్చి చేరొచ్చు.
తాజాగా ఒలింపిక్స్ బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ విభాగంలోని క్వార్టర్ ఫైనల్స్‌లో పీవీ సింధు జపాన్ క్రీడాకారిణి యమగుచిపై విజయం సాధించింది. మరోసారి భారత్‌కు పతకం దాదాపు ఖాయం చేసింది. తొలి గేమ్‌లో 21-13తో ఆధిపత్యం చెలాయించిన సింధు.. రెండో గేమ్‌లోనూ సత్తా చాటింది. రెండో గేమ్ తొలి విరామానికి సింధు 11-6తో ఆధిపత్యం సాధించింది. విరామం తర్వాత యమగుచి గట్టిపోటీ ఇచ్చింది. ఒక దశలో ఇద్దరి పాయింట్లు సమానంగా నిలిచాయి. ఆఖరి వరకు ఉత్కంఠభరితంగా సాగిన రెండో గేమ్‌లో 22-20తో సింధు నెగ్గింది . వరుస గేమ్‌లలో గెలిచిన సింధు సెమీస్‌కు చేరింది. యమగుచి అడ్డు తొలగిపోవడంతో.. ఇక చైనా షట్లర్లకు చెక్ పెడితే సరి.