కాంగ్రెస్ గూటికి పీకే .. ఇక మోడీకి మూడినట్లేనా?
posted on Jul 30, 2021 @ 2:55PM
ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత కిశోర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారా? ప్రతి పక్షాలను ఏకంచేసి కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవం తెచ్చేందుకు నడుం బిగిస్తున్నారా ? గత కొంత కాలంగా ఆయన కాలికి బలపం కట్టుకుని దేశం చుట్టివస్తున్నది అందుకేనా? అంటే అవుననే అంటున్నారు, కాంగ్రెస్ కీలక నేతలు, మీడియా విశ్లేషకులు. నిజానికి జూలై 13వ తేదీన ప్రశాంత్ కిశోర్ రాహుల్ గాంధీ, ప్రియాంకా వాద్రాతో సమావేశమైన సందర్భంలోనే, ఆయన కాంగ్రెస్ లో చేరుతున్నారనే వార్త మీడియాలో షికార్లు చేసింది. సుమారు మూడు గంటల పాటు రాహుల్ గాంధీ నివాసంలో జరిగిన ఈ సమావేశంలో సోనియా గాంధీ కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. అయితే అప్పట్లో ఇటు కాంగ్రెస్ నాయక త్రయం కానీ అటు పీకే కానీ, దానిపై పెదవి విప్పలేదు. వ్యూహాత్మకంగా ఊహాగానలకు వదిలేశారు.
అయితే, ఇప్పుడు మళ్ళీ రాహుల్ గాంధీ. పీకేని పార్టీలోకి తీసుకునే అంశం పై కాంగ్రెస్ పార్టీ కీలక నేతలు, ఏకే అంటోనీ, మల్లిఖార్జున ఖర్గే, కమల్ నాథ్, అంబికా సోనీ, హరీష్ రావత్, కేసీ వేణుగోపాల్ సహా మరి కొందరితో, సుదీర్ఘంగా చర్చించారు. ఒక విధంగా మేథోమథనం సాగించారన్న వార్త మీడియాలో హాట్ హాట్’గా షికారు చేస్తోంది. అయితే, నిజానికి ఇది కూడా పాచి వార్తే .. ఈ సమావేశం జరిగింది నిన్ననో మొన్ననో కాదు, జూలై 22 న అంటే సుమారు వారం రోజుల క్రితం కీలక నేతల భేటీ జరిగింది. ఈ సమావేశంలో పీకేను పార్టీలోకి తీసుకుంటే వొనగూరే లాభనష్టాలు, ఒక వేళ పీకేను పార్టీలోకి తీసుకుంటే, ఆయనకు ఏ బాధ్యత ఇవ్వాలనే విషయంలో లోతుగా చర్చించినట్లు సమాచారం. ఈ సమావేశంలో పాల్గొన్న పెద్దలంతా సహజంగానే, పీకే పార్టీలో చేరితే పార్టీకి ప్రయోజనం ఉంటుందని, ఆయన వస్తానంటే, వెల్కమ్ చెపుదామని తీర్మానించారు.
ఇందుకు సంబంధించి ఎలాంటి అధికార సమాచారం లేదు. పది రోజుల నాడు జరిగిన సమావేశానికి సంబంధించిన వార్తను మీడియా ఇప్పుడు వండి వార్చి లేదా మళ్ళీ వేడి చేసి వడ్డించింది. అయితే, అప్పుడు ఎందుకు మీటింగ్ వ్యవహారానని, రహస్యంగా ఉంచారు, ఇప్పుడెందుకు లీక్ చేసారు అనేది మనం అడగరాదు. దీన్నేపీకే స్ట్రాటజీ,అంటారు. నిజానికి ప్రశాంత్ కిశోర్ పశ్చిమ బెంగాల్ ఎన్నికల తర్వాత, ఇక ఎలక్షన్ స్ట్రాటజీ ప్రొఫెషన్’కు గుడ్ బై చెప్పేస్తున్నానని చెప్పు కొచ్చారు. అలాగే, రాజకీయాలోకి రానని కూడా అంతే గట్టిగా చెప్పారు. “ఒక సారి జనతాదళ్ (యూ) లో వేలు పెట్టి చేయి కాల్చుకున్నాను, మళ్ళీ మరోమారు అదే తప్పు చేయను. రాజకీయాలకు నేను పనికిరాను” అని పీకే స్వీయ ప్రకటన చేశారు. బెంగాల్ ఎన్నికల తర్వాత ఇచ్చిన ఈ రెండు స్టేట్మెంట్లను,ఇంతలోనే గట్టున పెట్టేశారు. సో .. ఒపీనియన్స్ మార్చుకోలేని వాడు పొలిటీషియన్ కాలేడు, అన్న గిరీశాన్ని ప్రామాణికంగా తీసుకుంటే, పీకే భవిష్యత్’లో ఉత్తమోత్తమ రాజకీయ నాయకుడు అవుతారు.కాలం ఖర్మం కలిసొస్తే, పీకీ ... పీఎం కూడా అవుతారు.
ఇక మోడీని ఓడించడమే ఎజెండాగా సాగే ఏకతా యత్నాల వలన ప్రయోజనం ఉండదని, మోదీ వ్యతిరేకత’ అన్న ఒకే ఒక అంశంతో ప్రతిపక్ష కూటమి సఫలీకృతం కాలేదని కాంగ్రెస్ సీనియర్ నేత వీరప్ప మొయిలీ పెదవి విరిచారు. ప్రతిపక్ష పార్టీలకు కనీస ఉమ్మడి కార్యక్రమం అవసరమని కూడా ఆయన సూచించారు.అలాగే, గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని, అన్నిటికంటే, కుర్చీ ఎవరిదీ? కిస్సా కుర్సీకా? అనేదే అతి పెద్ద సమస్య అని కూడా మొయిలీ ముందుగానే హెచ్చరించారు.అలాగే, మరో సీనియర్ నాయకుడు, ప్రశాంత్ కిశోర్ పిట్ట పిట్ట పోరు పిల్లి తీర్చింది అన్నట్లుగా చివరకు ఆయనే, కుర్చీ ఎక్కుతారేమో ... అన్న చిన్న సందేహాన్ని వ్యక్తపరిచారు. అందుకే విశ్లేషకులు ఏమో చివరకు ఏమవుతుందో .. చూడాలి అంటున్నారు .. చూద్దాం.మొత్తానికి మోడీని ఓడించడమే ఎజెండాగా పీకే దర్శకత్వంలో నడుస్తున్న డ్రామా బానే రక్తి కడుతోంది