హైదరాబాద్ లెమన్‌ట్రీ హోటల్‌లో ..లవర్ గొంతుకోసి, ప్రియుడి ఆత్మహత్య..
posted on Jul 30, 2021 @ 10:12AM
ఓపెన్ చేస్తే.. సాయంత్రం అది హైదరాబాద్. మాదాపూర్. లెమన్‌ట్రీ హోటల్. అక్కడక్కడా కొంత రద్దీగా ఉంది. మూడవ అంతస్తులో ఉన్న 317 రూమ్ లో గొడవ పడుతున్నారు. అటువైపు వెళ్తున్న రూమ్ బాయ్ లోపలి నుంచి వస్తున్న అరుపులు వినిపించాయి. అతను కంగారు పడ్డాడు. వెంటనే సిబ్బందికి చెప్పాడు. ఏమైందో ఏమో కొద్దీసేపటి వరకు రూము నుంచి ఎలాంటి మాటలు వినిపించలేదు.. అంత సైలెంట్ గా మారింది ఆ వాతావరణం. హోటల్ సిబ్బంది కి అనుమానం వచ్చింది. వెంటనే మారుతాళంతో గది తలుపులు తెరిచి చూశారు. ఫ్యానుకి వేలాడుతున్న మృతదేహాన్ని చూసి షాక్ తిన్నారు. అతనితో ఒక అమ్మాయి కూడా ఉండాలి కదా అని సిబ్బందికి అనుమానం వచ్చింది. సిబ్బందిలో ఒకరు బాత్ రూమ్ వైపు నడిచాడు. అక్కడ ఆ మహిళా మృతదేహం కనిపించింది.. ఒక్కసారిగా వాళ్లందరికీ చెమటలు పట్టాయి.. ఏం చెయ్యాలో అర్థం కాలేదు. చివరికి హోటల్ సిబ్బంది సమాచారంతో హోటల్‌కు చేరుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు.
పోలీసుల కథనం ప్రకారం.. సంతోషి ప్రభుత్వ ఉద్యోగం కోసం సిద్ధమవుతుండగా, రాములు రెండు కార్లు కొనుక్కుని హైదరాబాద్‌లో ట్రావెల్స్ వ్యాపారం చేస్తున్నాడు. లాక్‌డౌన్ సమయంలో స్వగ్రామానికి వెళ్లిన రాములుకు సంతోషితో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. బుధవారం వీరిద్దరూ నగరానికి వచ్చి లెమన్‌ట్రీ హోటల్‌లోని మూడో అంతస్తులో ఉన్న 317 నంబరు గదిలో దిగారు. నిజానికి వీరు గురువారం మధ్యాహ్నం గదిని ఖాళీ చేయాల్సి ఉండగా, మరో రోజుకు పొడిగించారు. అయితే, గురువారం సాయంత్రం వారి మధ్య గొడవ జరిగినట్టు తెలుస్తోంది.
బాత్రూములో సంతోషి మృతదేహం నగ్నంగా పడి ఉంది. రాములు ఆమె మెడను బ్లేడుతో కోసి హతమార్చినట్టు పోలీసులు గుర్తించారు. అనంతరం ఆమె చున్నీతో రూములోని ఫ్యాన్‌కు రాములు ఉరివేసుకున్నట్టు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. అంతకుముందు వీరిద్దరి మధ్య గొడవ జరిగి ఉంటుందని, విచక్షణ కోల్పోయి రాములు ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటాడని పోలీసులు చెబుతున్నారు. హత్యకు ఉపయోగించిన బ్లేడ్, ఇతర ఆధారాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సంతోషికి చెందిన వివిధ పోటీ పరీక్షలకు చెందిన పుస్తకాలు, ఓ ప్రైవేటు ఈఎన్‌టీ ఆసుపత్రికి సంబంధించిన ఫైల్, ఆధార్ కార్డులు లభించాయి. నిజానికి వీరిద్దరూ గతంలో ప్రేమ పెళ్లి చేసుకున్నారని, పెద్దలు అంగీకరించకపోవడంతో విడిగా ఉంటున్నట్టు తెలుస్తోంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.