పావురాలగుట్టలో ఆ రోజు అసలేం జరిగింది..? మిస్టరీనా? క్లారిటీనా?
posted on Sep 2, 2021 @ 11:40AM
సెప్టెంబర్ 2, 2009. చిత్తూరు జిల్లాలో రచ్చబండ కార్యక్రమానికి హైదరాబాద్ నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరారు సీఎం రాజశేఖరరెడ్డి. ఉదయం గం.9.35 నిమిషాలకు హెలికాప్టరుతో సంబంధాలు తెగిపోయాయి. అంతే. ఒక్కసారిగా అంతా ఉలిక్కిపడ్డారు. మొదట అదేదో టెక్నికల్ ప్రాబ్లమ్ అనుకున్నారు. సమయం గడుస్తున్నా.. హెలికాప్టర్‌తో కాంటాక్ట్ దొరక్కపోవడంతో అనుమానం మొదలైంది. అంతలోనే అది ఆందోళనకు దారి తీసింది. దేశమంతా ఒక్కసారిగా బిత్తరపోయింది. కేంద్ర ప్రభుత్వమూ వెంటనే స్పందించింది. స్థానిక పోలీసులు, అధికారులతో పాటు ఆర్మీ సిబ్బంది కూడా రంగంలోకి దిగారు. గంటల తరబడి సెర్చ్ ఆపరేషన్ జరిపారు.
ముఖ్యమంత్రి వైఎస్సార్ ఆచూకీ కోసం గాలించగా 25 గంటల తరువాత ప్రమాదానికి గురైన హెలికాప్టర్ ఆనవాళ్లు లభించాయి. ప్రమాదస్థలం రుద్రకొండ కర్నూలు-ప్రకాశం జిల్లా సరిహద్దులో ఆత్మకూరు - వెలుగోడుకు సమీపంలోని నల్లమల అడవుల్లో ఉంది. హెలికాప్టర్ కూలిన ప్రాంతం కర్నూలు జిల్లా ఆత్మకూరు నుంచి 8 కిలోమీటర్ల దూరంలోని నల్లకాలువ గ్రామం మీదుగా 16 కిలోమీటర్ల దూరంలోని రుద్రకోడూరు గ్రామానికి దట్టమైన అటవీ మార్గంలో ప్రమాద స్థలి మరో 16 కిలోమీటర్లు దూరం ఉంది. ఆ ప్రాంతం పావురాలగుట్ట. హెలికాప్టర్ కూలిన ప్రమాదంలో నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డితో సహా మొత్తం ఐదుగురు మరణించారు.
వైఎస్ మరణం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. హెలికాప్టర్ ప్రమాదంలో ఆయన మృతిచెందడంపై ఎన్నో అనుమానాలు రేకెత్తాయి. యాక్సిడెంటల్‌గా జరిగిందా? లేదంటే ఎవరిదైనా హస్తముందా? జాతీయ స్థాయి కుట్ర దాగుందా? ఇలా అనేక ప్రశ్నలు. కేంద్ర ప్రభుత్వం విచారణ సంఘాన్ని నియమించింది. పవన్‌హన్స్ హెలికాప్టర్ లిమిటెడ్ యజమాని ఆర్.కె.త్యాగి ఈ విచారణ కమిటీకి నేతృత్వం వహించారు. సీబీఐ సైతం వైఎస్సార్ మరణంపై విచారణ జరిపింది. అయితే వైఎస్‌ఆర్ మృతిపై దర్యాప్తు సంస్థలు మాత్రం ఒకే మాటకు కట్టుబడి ఉన్నాయి. డీజీసీఏ, సీబీఐతో పాటు మరో రెండు దర్యాప్తు సంస్థలు ఒకే విషయం వెల్లడించాయి. అప్పటి సీబీఐ జాయింట్ డైరెక్టర్‌గా ఆ హెలికాప్టర్ ప్రమాదంపై ఇన్వెస్టిగేషన్ చేసిన జేడీ లక్ష్మినారాయణ.. ఆ తర్వాత పలు ఇంటర్వ్యూలలో చేసిన వ్యాఖ్యలు వైఎస్ మరణంపై క్లారిటీ ఇచ్చాయి. ఇక, విచారణ సంస్థలన్నీ అది ప్రమాదమేనని.. ఎలాంటి కుట్ర లేకపోవచ్చని నివేదికలు ఇచ్చాయి.
ఇక జేడీ లక్ష్మినారాయణ ఏమన్నారంటే.. అందరిలాగే తమకు కూడా కేసు దర్యాప్తులో ఎన్నో అనుమానాలు వచ్చాయని.. ఆ ప్రమాదం యాక్సిడెంటల్‌గా జరిగిందా.. లేదంటే ఎవరైనా చేయించారా అనే కోణంలో ఇన్వెస్టిగేషన్ చేశామని తెలిపారు. ఆడియో విజువల్స్‌తో కూడిన ఓ రిపోర్ట్ రూపొందించి రిలీజ్ చేశామన్నారు. అది పూర్తిగా యాక్సిడెంటల్‌గా జరిగిందనే విషయం అందులో ప్రెజెంట్ చేశామని తెలిపారు.
ఆ రోజు వాతావరణం సరిగా లేదన్నారు జేడీ. క్యుములో నింబస్ మేఘాలే వైఎస్ ప్రయాణించిన హెలికాప్టర్ ప్రమాదానికి కారణమని వివరించారు. ఆ మేఘాల్లో వాక్యూమ్ నిండి ఉంటుందని.. అవి హెలికాప్టర్‌ను లాగేస్తుంటాయని తెలిపారు. ఆ క్రమంలో మేఘాల్లోకి హెలికాప్టర్ ప్రవేశించిందని.. దాంతో హెలికాప్టర్ యాక్సిడెంటల్‌గా కూలిపోయిందని జేడీ లక్ష్మినారాయణ వివరించారు.
ప్రమాదం జరిగిన స్థలాన్ని పూర్తిస్థాయిలో పరిశీలించామని.. బ్లాక్ బాక్స్‌లో రికార్డయిన సంభాషణలు విన్నామని.. అటు వాతావరణ శాఖ, సివిల్ ఏవియేషన్ నిపుణుల సాయంతో రిపోర్ట్ రూపొందించామని గతంలో జేడీ చెప్పారు. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ కూడా యాక్సిడెంటల్‌గా జరిగిన ప్రమాదమని తేల్చిందని గుర్తు చేశారు. వైఎస్ హెలికాప్టర్ ప్రమాద సమయంలో కో పైలెట్ కెప్టెన్ ఎంఎస్ రెడ్డి 'గో అరౌండ్' అంటూ బిగ్గరగా అరిచినట్లు బ్లాక్ బాక్స్‌లో రికార్డయిందని గుర్తు చేశారు జేడీ. గో అరౌండ్ అనేది ఎమర్జెన్సీ సమయంలో వాడే ఒక బటన్ అని.. అది నొక్కితే సడెన్‌గా హెలికాప్టర్ పైకి లేస్తుందని వివరించారు. క్యుములో నింబస్ మేఘాల కారణంగా హెలికాప్టర్‌లో వాడే ఫ్యూయల్, లూబ్రికెంట్స్ వాడకం ఒక్కసారిగా పెరిగి రెడ్ లైట్ వస్తుందని తెలిపారు. ఆ సమయంలో ఆయన గో అరౌండ్ అని అరిచారని.. ఆ ఎమర్జెన్సీ బటన్ నొక్కితే హెలికాప్టర్ పైకి లేస్తుందని అలా చెప్పి ఉంటారని అన్నారు. ఒక్కోసారి హెలికాప్టర్లు ల్యాండయ్యే సమయంలో గేదెలు తదితర జంతువులు అడ్డొస్తే గో అరౌండ్ బటన్ నొక్కుతారని.. దాంతో హెలికాప్టర్ సడెన్‌గా దానంతట అదే పైకి వెళుతుందని చెప్పుకొచ్చారు.
వైఎస్ఆర్ హెలికాప్టర్ ప్రమాదంపై అనుమానాలు వ్యక్తమైనప్పటికీ.. జరిగింది మాత్రం కేవలం ప్రమాదమేనని అన్ని దర్యాప్తు సంస్థలు పూర్తిస్థాయి దర్యాప్తు తర్వాత వెల్లడించిన విషయం. అయితే, వైఎస్సార్ మరణాన్ని కొందరు రాజకీయ ఎదుగుదలకు వాడుకునే ప్రయత్నం చేయడం అప్పట్లో తీవ్ర వివాదాస్పదమైంది. ఆ తర్వాత కాలంలో వైఎస్సార్ మరణం.. పావురాలగుట్ట హెలికాప్టర్ ప్రమాదంపై వచ్చిన అనుమానాలన్నీ క్రమక్రమంగా కనుమరుగయ్యాయి. వైఎస్సార్ మరణించి 12 ఏళ్లు గడుస్తోంది.