ఏపీ కొత్త సీఎస్ ఎవరో? జగన్ బెయిల్ కేసుతో లింక్?
posted on Sep 1, 2021 @ 4:18PM
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) ఆదిత్యానాథ్ దాస్ పదవీ కాలం సెప్టెంబర్ ఆఖరుకు ముగుస్తుంది. నిజానికి గత జూన్ నెల చివరికే ఆయన రిటైర్ అయ్యారు. అయితే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అభ్యర్ధన మేరకు కేంద్ర ప్రభుత్వం ఆయన పదవీ కాలాన్ని మూడు నెలలు పొడిగించింది. పొడిగించిన పదవీకాలం కూడా సెప్టెంబర్ చివరికి ముగుస్తున్న నేపధ్యంలో కొత్త సీఎస్ ఎవరన్న చర్చ రాజకీయ, మీడియా వర్గాలలో మొదలైంది.
ముఖ్యమంత్రి జగన్ రెడ్డి కావాలనుకుంటే, ఆయన ఆదిత్యానాథ్ దాస్ పదవీ కాలాన్ని మరో మూడు నెలలు పొడిగించమని కేంద్రాన్ని కోరవచ్చును. కేంద్రం కూడా కాదనక పోవచ్చును. ఆవిధంగా ఆదిత్యానాథ్ దాస్ మరో మూడు నెలలు. అంటే డిసెంబర్ చివరి వరకు సీఎస్’గా కొనసాగే అవకాశం ఉంది. అయితే, ముఖ్యమంత్రి జగన్ రెడ్డి కేద్రాన్ని మరో పొడిగింపు అడగక పోవచ్చని, అన్నీ అనుకూలిస్తే, 1988 బ్యాచ్ సీనియర్ ఐఏఎస్ అధికారి వై.శ్రీలక్ష్మికి పదోన్నతి కల్పించే ఆలోచనలో ఆయన ఉన్నారని, అంతర్గత వర్గాల సమాచారం. తెలంగాణ క్యాడర్’కు చెందిన ఆమెను జగన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత కొంచెం చాలా కష్టపడే రాష్ట్రానికి రప్పించుకున్నారు. అలాగే, చకచకా పదోన్నతులు కల్పించారు. ఇప్పుడు శ్రీలక్షి స్పెషల్ చీఫ్ సెక్రటరీ స్థాయికి చేరుకున్నారు. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఆమెకు చురుకైన ఆఫీసర్’గా మంచి పేరుంది. అదే సమయంలో, జగన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో, గాలి జనార్ధన రెడ్డి అక్రమ మైనింగ్ కేసులో ముద్దాయిగా, సీబీఐ విచారణ ఎదుర్కుంటున్నారు. జైలు జీవితం కూడా గడిపారు.
సాధారణ పరిస్థితులలో అయితే జగన్మోహన్ రెడ్డి, ఇలాంటి లీగల్ ఇష్యూస్’ను అంతగా పట్టించుకోకపోవునేమో గానీ, రెబెల్ ఎంపీ రఘురామ కృష్ణం రాజు, అక్రమాస్తుల కేసులకు సంబంధించి జగన్ రెడ్డి బెయిలు రద్దు కోరుతూ దాఖలు చేసిన పిటీషన్లో, తమకు అనుకూలమైన అధికారులను కీలక పదవులలో నియమించుకుని, సాక్షాధారలను తారుమారు చేస్తున్నారన్నది ప్రధాన ఆరోపణగా ఉంది. ఈ కేసు విచారణ పూర్తయింది. సెప్టెంబర్ 15 న తుది తీర్పు వచ్చే వస్తుందని అంటున్నారు. ఈ తీర్పును బట్టి శ్రీ లక్షికి అవకాశం ఇవ్వడమా లేక మరోకరిని సీఎస్’గా తీసుకోవడమా అనే విషయంలో ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఒక నిర్ణయానికి వస్తారని అంటున్నారు.
ప్రస్తుతమున్న ఆంధ్రప్రదేశ్ క్యాడర్ కు చెందిన చీఫ్ సెక్రటరీ ర్యాంక్ ఐఏఎస్ అధికారులలో మాజీ సీఎస్, ప్రస్తుతం రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధానాదికారిగా ఉన్న నీలం సహానీ భర్త., అజయ్ సహానీ, అందరికంటే సీనియర్ అధికారి. ప్రస్తుతం డిపుటేషన్ మీద కేంద్ర సర్వీస్’లో ఉన్న ఆయన సీఎస్ పోస్టు ఇస్తామంటే రాష్ట్రానికి వచ్చేందుకు సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే, ఇటీవలే ముఖ్యమంత్రి అభ్యర్ధన మేరకు స్టేట్ సర్వీస్ కు వచ్చిన 1985 బ్యాచ్’ ఐఏఎస్ ఆఫీసర్ సమీర్ శర్మ, గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో కీలక బాధ్యతలు నిర్వర్తించిన రెడ్డి సుబ్రమణ్యం, సతీష్ చంద్ర కూడా సీనియర్ల జాబితాలో ఉన్నారు. ఎ అందరితో పాటుగా 1987 బ్యాచ్ ఐఏఎస్ అధికారి నీరభ్ కుమార్ ప్రసాద్ పేరు కూడా అధికార వర్గాల్లో వినవస్తోంది. అయితే శ్రీలక్ష్మి పదోన్నతికి అడ్డుగా నిలిచిన లీగల్ అవరోధాలు తొలిగి పోతే, ఆమెకే అవకాశం ఇస్తారు. కాదంటే, నీరభ్ కుమార్ ప్రసాద్ ను అదృష్టం వరించ వచ్చని సమాచారం. అయితే సెప్టెంబర్ 15 న సీబీఐ కోర్టు జగన్ రెడ్డి బెయిల్ రద్దు చేస్తే ..అప్పుడు కథ వేరుగా ఉంటుంది.