ఎమ్మెల్యేలతో జగన్ ఫేస్ టు ఫేస్.. అందుకోసమేనా?
posted on Sep 1, 2021 @ 10:35AM
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా 27 నెలలు పూర్తి చేసుకున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ప్రభుత్వంలోకి వచ్చి రెండున్నర ఏండ్లు కావస్తున్నా.. పార్టీపై ఆయన ఫోకస్ చేయలేదనే విమర్శలు ఉన్నాయి. ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా జగన్ ను కలవలేకపోతున్నారు. కొందరు మంత్రులకు కూడా సీఎం అపాయింట్ మెంట్ ఇవ్వడం లేదంటే పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. ముఖ్యమంత్రిని కలిసేందుకు తమకు అవకాశం దక్కటం లేదని పలువురు ఎమ్మెల్యేలు అంతర్గత చర్చల్లో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యేలు అడిగిన నిధులను మంజూరు చేసే పరిస్థితి లేకుండా పోయింది. జగన్ తీరుపై పార్టీలో తీవ్ర అసంతృప్తి నెలకొన్నదని తెలుస్తోంది. కొందరు పార్టీ నేతలు బహిరంగంగానే తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యేల్లో ఉన్న అభిప్రాయలను పార్టీ సమన్వయకర్తలు సీఎంకు వివరించారుట. దీంతో పార్టీపై ఫోకస్ పెట్టాలని డిసైడ్ అయిన జగన్.. త్వరలో సమావేశాలు నిర్వహించబోతున్నారని తెలుస్తోంది.
పార్టీలో ప్రక్షాళనతో పాటు కేబినెట్ విస్తరణకు జగన్ కసరత్తు చేస్తున్నారని సమాచారం. జగన్ తో సమావేశానికి రావాలటూ ఎమ్మెల్యేలకు సీఎం కార్యాలయం నుంచి ఫోన్లు వెళ్లాయని చెబుతున్నారు, ఎమ్మెల్యేలతో ఫేస్ టు ఫేస్ మాట్లాడి వారి అభిప్రాయాలు తెలుసుకోనున్నారట జగన్. ఇందు కోసం సెప్టెంబర్ రెండో వారంలో అసెంబ్లీ సమావేశాల సమయంలోనే ముహూర్తంగా నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే 151 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి వారి నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితి, ఎమ్మెల్యేల పని తీరు వంటి వాటి పైన సీఎం అంతర్గత సర్వేలు చేయించారు. వాటి నివేదికలను సిద్దం చేసుకున్నారని చెబుతున్నారు. జిల్లాల వారీగా ఎమ్మెల్యేలతో జరిగే సమావేశాల్లో.. నియోజకవర్గానికి సంంబధించిన సర్వే వివరాలను వాళ్ల ముందు ఉంచనున్నారట. సర్వేల ఆధారంగానే ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి క్లాస్ ఉంటుందని అంటున్నారు.
ఎమ్మెల్యేలు అందరితో కాకుండా.. వన్ టు వన్ సమావేశాలు ఏర్పాటు చేయాలని జగన్ నిర్ణయించినట్లుగా సమాచారం. ఆ సమయంలో ఆ ఎమ్మెల్యేల పైన వచ్చిన ఫీడ్ బ్యాక్ తో పాటుగా వారి బలాలు- బలహీనతల పై సీఎం నేరుగా చర్చించనున్నారని తెలుస్తోంది. ఆరోపణలు ఉన్న వారికి హెచ్చరికలు చేయడంతో పాటు పని తీరు బాగున్న వారికి ప్రమోషన్ దక్కే అవకాశాల గురించి సీఎం నేరుగా వారితోనే చర్చించనున్నట్లు తెలుస్తోంది. సీఎం-ఎమ్మెల్యేల ఫేస్ టు ఫేస్ సమావేశంలో పార్టీ సమన్వయకర్తలు, మంత్రులకు ఎవరూ లేకుండా ఎమ్మెల్యేలే నేరుగా సీఎంతో మాట్లాడే విధంగా అవకాశం కల్పించనున్నారని చెబుతున్నారు.
ఎమ్మెల్యేలతో జరిగే భేటీల్లోనే కేబినెట్ అవకాశాలపైన మనసులో మాట చెప్పనున్నారట ముఖ్యమంత్రి. కేబినెట్ ప్రక్షాళన గురించి సీఎం తన అభిప్రాయాలను ఆశావాహ ఎమ్మెల్యేలకు స్పష్టం చేయనున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వంలో ఎవరికి అవకాశం ఇవ్వాలనేది సీఎం చేస్తున్న కసరత్తు ఇప్పటికే దాదాపుగా పూర్తయిందని తెలుస్తోంది. ఈ సమీక్షల్లో ఆశావాహులకు సీఎం నేరుగా తన అభిప్రాయం చెప్పటంతో పాటుగా.. అవకాశం ఇవ్వలేని వారికి భవిష్యత్ పైన హామీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. దీంతో కేబినెట్ విస్తరణ సమయంలో ఏ ఒక్కరి నుంచి ఓపెన్ గా అసంతృప్తి బయటకు రాకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నారని అంటున్నారు. పార్టీ బాధ్యతల విషయంలో సీఎం మరింత స్పష్టంగా పార్టీ నేతలకు దిశా నిర్దేశం చేయనున్నారని సమాచారం.
అక్టోబర్ 2 నుంచి రచ్చబండ ద్వారా సాధ్యమైనంత కాలం ప్రజల్లో ఉండాలనేది జగన్ భావిస్తున్నారట. ఈ లోగానే ఎమ్మెల్యేలతో సమావేశాలు పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నారు. సీఎం తమతో నేరుగా మాట్లాడేందుకు సమయం కేటాయించటం పైన ఎమ్మెల్యేల్లో జోష్ కనిపిస్తోంది. దసరాకు కేబినెట్ విస్తరణ ఉంటుందని పార్టీ సీనియర్లు భావిస్తున్నారు. అయితే కేబినెట్ విస్తరణలో ఎవరికి అవకాశం ఇస్తారు..ఎవరిని పక్కన పెడతారనే చర్చ మాత్రం పార్టీ నేతల్లో టెన్షన్ కు కారణమవుతోంది. ముందుగా చెప్పిన విధంగా ప్రస్తుత కేబినెట్ లో 90 శాతం మందిని తప్పిస్తారా..లేక మొత్తం కేబినెట్ నే మర్చేస్తారా అనే టెన్షన్ ప్రస్తుత మంత్రుల్లో కొనసాగుతోంది. దీంతో ఆశావాహులు సైతం సీఎం నిర్ణయం కోసం నిరీక్షిస్తున్నారని చెబుతున్నారు.