అడుగుకో గుంత, గజానికో గొయ్యి! జగనన్న స్కీమ్ సూపర్ అన్న పవన్ కల్యాణ్..
posted on Sep 1, 2021 @ 2:16PM
ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం అన్ని సమస్యలే. జగన్ రెడ్డి ప్రభుత్వంలో పాలనంతా అస్తవ్యస్థంగా సాగుతుందనే విమర్శలు వస్తున్నాయి. సామాన్యులకు కనీస అవసరాలు కూడా దొరకడం లేదని అంటున్నారు. ఏపీలో రోడ్ల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ఓ వైపు భారంగా మారిన పెట్రోల్, డీజిల్ ధరలతో అల్లాడుతున్న జనాలు.. నరకకూపంగా మారిన రోడ్లపై ప్రయాణిస్తూ మరిన్ని కష్టాలు తెచ్చుకుంటున్నారు, ఏపీలో రోడ్లు ఎక్కడచూసినా గుంతలమయమే, అడుగుకో గుంత, గజానికో గొయ్యిలా రోడ్లు తయారయ్యాయి. గతుకుల రోడ్లపై ప్రయాణిస్తూ వేలాది మంది హాస్పిటల్ పాలవుతున్నారు. రోడ్ల దుస్తితిపై విపక్షాలు ఎంతగా మొత్తుకున్నా , నిరసనలు తెలిపినా ప్రభుత్వంలో చలనం లేదనే ఆరోపణలు వస్తున్నాయి.
తాజాగా ఆంధ్రప్రదేశ్ లోని రోడ్ల దుస్థితిపై జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ మండిపడ్డారు. వైసీపీ పాలనలో రోడ్ల వ్యవస్థ దారుణంగా తయారయిందని.. అడుగుకో గుంత, గజానికో గొయ్యిలా పరిస్థితి ఉందని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో లక్షా 20 వేల కిలోమీటర్లకు పైగా రోడ్లు ఉన్నాయని... ఈ రోడ్లు దెబ్బతిన్నా బాగు చేయడం లేదని దుయ్యబట్టారు. రోడ్లను బాగు చేయమని అడిగితే పోలీసులతో లాఠీఛార్జీలు చేయించే పరిస్థితులు ఏపీలో ఉన్నాయని పవన్ కల్యాణ్ మండిపడ్డారు.రోడ్డు బాగోలేదు, ఏదైనా చేయండి అని స్థానిక ప్రజాప్రతినిధిని అడిగినందుకు గిద్దలూరు నియోజకవర్గంలో వెంగయ్యనాయుడు అనే జనసైనికుడు ఆత్మహత్యకు పాల్పడేలా వేధించారని ఆవేదన వ్యక్తం చేశారు.
నివర్ తుపాను సమయంలో కృష్ణ, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో పర్యటించినప్పుడు దెబ్బతిన్న రోడ్లను ప్రత్యక్షంగా చూశానని తెలిపారు. ఆ పర్యటనలో భాగంగా నెల్లూరు జిల్లా గూడూరు నియోజకవర్గం తిప్పవరపుపాడు గ్రామానికి వెళ్లే దారిలో దాదాపు ఎనిమిది కిలోమీటర్ల మేర రోడ్డు ఛిద్రమైందని అన్నారు. నిలువెత్తు గోతులతో ఉన్న ఆ దారిలో ఒక ట్రాక్టర్ తిరగబడిపోయిందని చెప్పారు. గర్భిణి స్త్రీతో వెళ్తున్న ఆటో కూడా తిరగబడిపోయిందని తెలిపారు. రోడ్ల దుస్థితిపై ప్రజాప్రతినిధికి చెప్పినా మార్పు రాలేదని చెప్పారు. కరోనా పరిస్థితులు ఉన్నాయనో, ప్రభుత్వానికి కొంత సమయం ఇద్దామనో ఇంత కాలం ఆగామని... కానీ, పరిస్థితి నానాటికీ దిగజారుతోందని... నోరు తెరిచి అడిగిన వారిపై పోలీసుల సాయంతో కేసులు పెట్టించే పరిస్థితి వచ్చిందని పవన్ మండిపడ్డారు.
రోడ్ల అధ్వాన పరిస్థితిని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని పవన్ కల్యాణ్ అన్నారు. సెప్టెంబర్ 2, 3, 4 తేదీల్లో రోడ్ల దుస్థితిపై వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయాలని పిలపునిచ్చారు. ప్రభుత్వం స్పందించకపోతే... అక్టోబర్ 2న రోడ్లను శ్రమదానం చేసి మనమే బాగు చేసుకుందామని చెప్పారు