జగన్ సర్కార్ కు డబుల్ షాక్.. అమరావతి రైతులకు బిగ్ రిలీఫ్
posted on Sep 1, 2021 @ 4:02PM
అంధ్రప్రదేశ్ లోని వైసీపీ ప్రభుత్వానికి దెబ్బ మీద దెబ్బ తగులుతూనే ఉంది. ఒకే రోజు జగన్ రెడ్డికి హైకోర్టులో రెండు షాకులు తగిలాయి. రాజధాని అమరావతి భూముల విషయంలో ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు షాక్ ఇచ్చింది. అసైన్డ్ భూములు తీసుకున్న రైతులకు అనుకూలంగా ఆదేశాలిచ్చింది. వారికి నాటి టీడీపీ ప్రభుత్వం ఇచ్చిన రిటర్నబుల్ భూములను తిరిగి తీసుకుంటూ ఇప్పటి వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఇచ్చిన 316 జీవోపై మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసింది. ఆ జీవోకు సంబంధించి తదుపరి చర్యలను తీసుకోరాదంటూ ప్రభుత్వాన్ని ఆదేశించింది.
రాజధాని నిర్మాణం కోసం భూములను ఇచ్చిన రైతులకు ప్యాకేజీ ఇస్తూ గత ప్రభుత్వం జీవో 41ని తీసుకొచ్చిందని, కానీ, ఇప్పుడు దానిని రద్దు చేసి రైతులకు ఇచ్చిన భూములను వెనక్కు తీసుకుంటున్నారని కోర్టుకు రైతుల తరఫు న్యాయవాది వివరించారు. అయితే వారి వాదనలను తోసిపుచ్చిన ప్రభుత్వ తరఫు లాయర్.. మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వొద్దంటూ కోర్టును కోరారు. అయినా ప్రభుత్వ వాదనలను తోసిపుచ్చుతూ తదుపరి చర్యలను నిలిపివేస్తూ రైతులకు అనుకూలంగా హైకోర్టు ఆదేశాలిచ్చింది.
ఇక గూంటూరు జిల్లాలోని సంగం డెయిరీ అంశంలోనూ జగన్ ప్రభుత్వానికి మరోసారి ఎదురు దెబ్బ తగిలింది. రాష్ట్ర ప్రభుత్వం వేసిన రిట్ అప్పీల్ ను తిరస్కరించింది. ఈ అంశంపై దాఖలైన ఇంప్లీడ్ పిటిషన్లను కూడా కొట్టేసింది. సంగం డెయిరీని స్వాధీనం చేసుకోవద్దని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. సంగం డెయిరీకి సంబంధించి గతంలోనే హైకోర్టు సింగిల్ జడ్జి బెంచ్ సంగం డెయిరీని స్వాధీనం చేసుకోవద్దని తీర్పును వెలువరించింది. అయితే సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ... వైసీపీ ప్రభుత్వం అప్పీల్ కు వెళ్లింది. దీనిపై విచారణ చేపట్టిన డివిజన్ బెంచ్ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సమర్థించింది. ప్రభుత్వం వేసిన రిట్ అప్పీల్ ను తిరస్కరించింది.
డెయిరీ కేసులో హైకోర్టు తీర్పును టీడీపీ సీనియర్ నేత, సంగం డెయిరీ చైర్మన్ ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ స్వాగతించారు. రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టులో మరోసారి చుక్కెదురైందని వ్యాఖ్యానించారు. ఇది రాష్ట్ర ప్రభుత్వంపై పాడిరైతులు సాధించిన విజయమని ఆయన అభివర్ణించారు. డెయిరీని తమ అధీనంలోకి తీసుకోవాలని ప్రయత్నించిన సర్కారుకు ఈ తీర్పుతో అడ్డుకట్ట పడిందని ధూళిపాళ్ల అన్నారు.