తమిళనాడులో జగనన్న పరువు పాయే!
posted on Sep 1, 2021 @ 11:52AM
ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత రోజురోజుకు పెరిగిపోతోంది. ప్రభుత్వ విధానాలతో ఆర్థిక పరిస్థితి దారుణంగా తయారైంది. అప్పు లేనిదే ప్రభుత్వానికి గడవని పరిస్థితి నెలకొంది. ఉద్యోగాలకు వేతనాలు ఇవ్వాలన్న రుణం తీసుకోవాల్సిందే. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని పట్టించుకోకుండా ఎడాపెడా అడ్డగోలుగా ఖర్చులు చేస్తున్న జగన్ సర్కార్.. ఖజానా నింపుకోవడానికి ఆస్తి పన్నును భారీగా పెంచింది. దీనిపై జనాల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది.
ఇక పెట్రోల్, డీజిల్ రేట్లు పెరుగుదలతో వినియోగదారులు భగ్గుమంటున్నారు. అయితే దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ పై అధిక పన్ను వేస్తున్న రాష్ట్రాల్లో ఏపీ టాప్ లో ఉంది. దక్షిణాదిలో ఏపీలో పెట్రోల్, డిజిల్ రేట్లు ఎక్కువ. తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక కంటే ఏపీలో పెట్రోల్, డీజిల్ రేట్లలో లీటర్ కు నాలుగు నుంచి 8 రూపాయల వరకు వ్యత్యాసం ఉంది. కేంద్ర సర్కార్ తో పాటు జగన్ రెడ్డి సర్కార్ భారీగా ట్సాక్స్ పెంచడంతో ఏపీలో వాహనదారులపై అధిక భారం పడుతోంది. వాహనదారులకు కొంత ఊరట కల్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం విధించిన పన్నులను తగ్గించాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇటీవలే తమిళనాడులోని స్టాలిన్ సర్కార్ లీటర్ కు మూడు రూపాయలు తగ్గించి వినియోగదారులకు ఊరటనిచ్చింది. కాని జగన్ రెడ్డి సర్కార్ మాత్రం పెంచుకుంటూనే పోతోంది.
జగన్ రెడ్డి ప్రభుత్వ తీరుపై ఏపీలో తీవ్ర నిరసనలు వ్యక్తమవుతుండగా.. పక్క రాష్ట్రాల్లోనూ ఏపీ పరువు పోయే పరిస్థితిలు ఏర్పడ్డాయి. తమిళనాడులో ఏపీ కంటే లీటర్ పెట్రోల్ రేటు ధర ఏకంగా 8 రూపాయలు తక్కువగా ఉంది. ఇదే ఇప్పుడు జగన్ రెడ్డి సర్కార్ ను రోడ్డున పడేస్తోంది. తమిళనాడులోని పెట్రోల్ బంకుల దగ్గర ఏపీ పరువు పోయేలా బోర్డులు ఏర్పాటు చేశారు. ఏపీతో పోల్చుతూ ఇక్కడ పెట్రోల్, డీజిల్ రేట్లు తక్కువగా ఉన్నాయంటూ పెట్రోల్ బంకుల దగ్గర బోర్టులు పెట్టారు. ఏపీలో లీటర్ పెట్రోల్ రేటు 108 రూపాయల 78 పైసలు కాగా ఇక్కడ 100 రూపాయల 89 పైసలేనంటూ కొన్ని బంకుల దగ్గర బోర్డులు కనిపిస్తున్నాయి.
తమిళనాడులోని పెట్రోల్ బంకుల దగ్గర కనిపిస్తున్న బోర్డులను కొందరు సోషల్ మీడియాలో పోస్టు చేశారు. జగన్ సర్కార్ తీరుకు ఈ బోర్టులు నిదర్శనంటూ పోస్టులు పెట్టారు. జగనన్న క్రేజీ తమిళనాడులో పెరిగిపోయిందంటూ మరికొందరు సెటైర్లు వేస్తున్నారు. మొత్తానికి ఏపీతో పోల్చితే తమ దగ్గర పెట్రోల్, డీజిల్ రేట్లు తక్కువంటూ తమిళనాడులోని పెట్రోల్ బంకుల దగ్గర పెట్టిన బోర్డులు జగన్ రెడ్డి ప్రభుత్వానికి ఇబ్బందిగా మారాయానే చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది.