అన్న.. చెల్లి.. తల్లి.. వైఎస్ సమాధి సాక్షిగా ఏం మెసేజ్ ఇచ్చినట్టు?
posted on Sep 2, 2021 @ 10:40AM
వస్తారా? రారా? అనుకున్నారు. కలుస్తారా? లేరా? అని చూశారు. జయంతికి ఎవరి దారి వారిదే. ఉదయం తల్లి, చెల్లి.. సాయంత్రం అన్న. ఆనాడు తండ్రి సమాధి సాక్షిగా కుటుంబ విభేదాలు బయటపెట్టుకున్నారు. ప్రజల్లో అబాసుపాలయ్యారు. అన్న జైలు కెళితే.. పార్టీ కోసం తల్లి, చెల్లి అంత చేస్తే.. ఇప్పుడేంటి.. అందలమెక్కాక అన్న.. ఆ ఇద్దరినీ దూరం పెట్టేశారని.. వైఎస్సార్ అభిమానులే జగన్‌ను చీదరించుకున్నారు. అందుకే, జయంతి రోజున అంత రచ్చ జరిగింది కాబట్టే.. ఇప్పుడు వర్థంతికి ఏం జరుగుతుందోనని అంతా ఆసక్తి కనబరిచారు. అన్ని కళ్లూ ఇడుపులపాయ వైపే చూశాయి.
సెప్టెంబర్ 2. ఆ రోజు రానే వచ్చింది. ఆ సమయం ఆసన్నమైంది. వైఎస్సార్ 12వ వర్థంతికి ఇడుపులపాయలోని వైఎస్ ఘాట్‌లో గంభీర వాతావరణం క్రియేట్ అయింది. జయంతి మాదిరి అన్నా, చెల్లి, తల్లి.. వేరు వేరుగా వస్తారా? ఒక తండ్రి బిడ్డలుగా ఆ ఇద్దరూ కలిసే నివాళులు అర్పిస్తారా? అని అంతా అటెన్షన్. ఆ గడియ వచ్చే సరికి కాస్త క్లారిటీ.. మరికాస్త కన్ఫ్యూజన్ ఏర్పడింది. మళ్లీ ఎటూ తేలకుండా.. అదే గడిబిడి కొనసాగుతోంది.
అన్న వచ్చాడు. తల్లితో కలిసి చెల్లి కూడా వచ్చింది. వైఎస్సార్‌కు నివాళి అర్పించేందుకు కుటుంబం అంతా తరలివచ్చారు. అది కూడా అంతా ఒకేసారి వచ్చారు. తల్లి, చెల్లి, అన్న.. ఆ ముగ్గురూ పక్క పక్కనే కూర్చుకున్నారు. మత ప్రార్థనలు జరుగుతుండగా.. మౌనంగా వైఎస్సార్‌కు నివాళులు అర్పించారు. వచ్చిన దారినే ఎవరి మానాన వారు వెళ్లిపోయారు.
ఒక మాటా లేదు.. ఒక మంతీ లేదు.. ఒక నవ్వూ లేదు.. ఒక పలకరింపూ లేదు. ముగ్గురి ముఖాలూ మాడిపోయి ఉన్నాయని అంటున్నారు. బహుషా వైఎస్సార్ వర్థంతి కదా.. ఆయన జ్ఞాపకాల్లో విషాదంతో ఉండి ఉంటారు. మరి, ఆ తండ్రి కన్నబిడ్డలేగా.. తోడబుట్టిన అన్నాచెల్లెల్లేగా.. బాగున్నావా.. అంటే ఏం పోయింది. ఓ నమష్కారం పడేస్తే ఏ కిరీటం పడిపోతుంది. తల్లి సాక్షిగా.. తండ్రి సమాధి ముందు.. ఆ అన్నాచెల్లెల్ల జగడం మరోసారి బయటపడింది. వైఎస్ కుటుంబంలో పెద్ద గొడవే జరిగుంటుందని.. అందుకే మరీ పక్క పక్కనే ఉన్నా.. పట్టించుకోనంత దూరం వారి మధ్య పెరిగిపోయిందని అంటున్నారు. జగనన్న చెల్లికి పెద్ద ద్రోహమే, భారీ అన్యాయమే చేసుంటారని చర్చించుకుంటున్నారు.
వైఎస్సార్ జయంతి మాదిరి వేరు వేరుగా వచ్చి అందరినోటా పడకుండా.. ఒకేసారి వచ్చి ఈసారికి మాత్రం కాస్త నష్ట నివారణ చర్యలు చేపట్టినట్టున్నారు. ఒకే ఫ్రేమ్‌లో ఫ్యామిలీ అంతా కనిపించి.. విభేదాలను కాస్త కవర్ చేసుకునే ప్రయత్నం చేశారు...అంటున్నారు.