కరోనా కొత్త వేరియంట్.. ఇండియాకి ఇంకా రాలేదట.. వచ్చాక పరిస్థితేంటి?
posted on Sep 2, 2021 @ 12:24PM
C.1.2. కరోనా కొత్త వేరియంట్. ఈ పేరు చెబితేనే యావత్ ప్రపంచం వణికిపోతోంది. ఆల్ఫా, డెల్టాలతోనే చచ్చిపోతుంటే.. ఇక ఇంకో కొత్త వేరియంట్ విజృంభిస్తే పరిస్థితి ఏంటంటూ బెంబేలెత్తిపోతోంది. ఈ కొత్త మ్యూటెంట్‌కు కొవిడ్ టీకాలనూ ఎదుర్కొనే సామర్థం ఉందని శాస్త్రవేత్తలు అంటుండటంతో మరింత డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. దక్షిణాఫ్రికాలో మొదట గుర్తించగా.. ఇప్పటికే చైనా, ఇంగ్లండ్, న్యూజిలాండ్ తదితర దేశాలకు వ్యాపించినట్టు డబ్ల్యూహెచ్‌వో ప్రకటించిందది. ఇప్పటి వరకు ఉన్న అన్ని వేరియంట్లతో పోలిస్తే C.1.2 మరింత డేంజరస్ అని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తుండటం కలవరం రేపుతోంది. ఈ కొత్త వేరియంట్ అత్యంత వేగంగా వ్యాప్తి చెందే అవకాశం ఉండటంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది.
అయితే , ప్రస్తుతానికి ఈ రకం వేరియంట్ భారత్‌లోకి ఇంకా ప్రవేశించలేదని కేంద్రం వెల్లడించడం ఒక్కటే కాస్త ఊరటనిచ్చే అంశం. ఇప్పటికింకా రాకపోయినా.. భవిష్యత్తులో వస్తే? ఏంటి పరిస్థితి? మన దేశం ఈ కొత్త వేరియంట్‌ను ఫేస్ చేయగలదా? దాని ముందు వ్యాక్సిన్లూ పనికిరాకపోవచ్చని అంటుంటే.. అది అంత ఖతర్నాకా? థర్డ్ వేవ్ దీనితోనేనా? అనే భయాందోళనలు.
మరోవైపు.. దేశవ్యాప్తంగా కొత్త కేసులు, మరణాలు కలవరపెడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కేసుల సంఖ్య 47వేలు దాటగా.. మరణాలు కూడా 500పైనే నమోదయ్యాయి. కొత్త కేసులు ఈ స్థాయిలో ఉండటం రెండు నెలల తర్వాత ఇదే కావడం ఆందోళనకరం. అయితే, వీటిలో 70శాతం కేరళలోనే ఉండటం ఆ రాష్ట్రంలో కలకలం రేపుతోంది.
కరోనా సెకండ్ వేవ్ నుంచి కేరళ ఇంకా బయటపడట్లేదు. అక్కడ బుధవారం ఒక్కరోజే 32,803 కొత్త కేసులు వెలుగుచూశాయి. దేశవ్యాప్తంగా నమోదవుతోన్న మొత్తం కేసుల్లో మూడింట రెండొంతులు కేరళ రాష్ట్రంలోనే ఉంటున్నాయి. మరణాల సంఖ్య కూడా భారీగానే ఉండటం కలవరపెడుతోంది.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా 3,89,583 మంది వైరస్‌తో బాధపడుతుండగా.. యాక్టివ్ కేసుల రేటు 1.19శాతానికి పెరిగింది. ఇక దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ నిరంతరాయంగా కొనసాగుతోంది. ఇప్పటివరకు 66కోట్లకు పైగా డోసులను పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది.