నార్కో అనాలిసిస్ పరీక్షకు అంగీకరించని సునీల్.. సీబీఐ ఏం చేయనుందో?
posted on Sep 1, 2021 @ 7:22PM
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాబాయ్ , దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ సోదరుడు, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. కేసు విచారణలో కొన్ని రోజులుగా దూకుడుగా వెళుతున్న సీబీఐకి నిరాశ ఎదురైంది. వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి జమ్మలమడుగు కోర్టులో .. ఈ కేసులో కీలక అనుమానితుడిగా భావిస్తున్న సునీల్ యాదవ్ ను సీబీఐ అధికారులు వర్చువల్ విధానంలో హాజరు పరిచారు. వివేకా హత్యకేసులో వాస్తవాలు రాబట్టేందుకు సునీల్ యాదవ్ కు నార్కో అనాలిసిస్ పరీక్ష నిర్వహిస్తామని, అందుకు అనుమతించాలని సీబీఐ కోర్టును కోరింది.
నార్కో పరీక్షలకు సమ్మతమేనా? అని సునీల్ యాదవ్ ను న్యాయమూర్తి అడిగారు. అయితే నార్కో పరీక్షలకు తాను అంగీకరించబోనని సునీల్ యాదవ్ స్పష్టం చేశాడు. దీంతో సీబీఐ అభ్యర్థనను తిరస్కరిస్తున్నట్టు జమ్మలమడుగు కోర్టు న్యాయమూర్తి ప్రకటించారు. నార్కో పరీక్షలు జరపాలంటే న్యాయస్థానం అనుమతించడంతో పాటు, నార్కో పరీక్షలు చేయించుకునే వ్యక్తి అంగీకారం కూడా అవసరం. ఈ నిబంధన కారణంగా సీబీఐకి వివేకా కేసులో నిరాశ ఎదురైంది. సునీల్ యాదవ్ నార్కో అనాలసిస్ పరీక్షకు అంగీకరించకపోవడంతో సీబీఐ ఏం చేయబోతుందన్నది ఆసక్తిగా మారింది.
మరోవైపు సునీల్ యాదవ్ నార్కో అనాలసిస్ పరీక్షకు అంగీకరించకపోవడంతో కేసులో చిక్కుముడి ఎలా వీడుతుందన్నది ఆసక్తిగా మారింది. ఇటీవలే వివేకా హత్య కేసులో సమాచారం ఇచ్చిన వారికి ఐదు లక్షల నజరానా ప్రకటించింది సీబీఐ. దీంతో వివేకా కేసులో సీబీఐకి కీలక ఆధారాలు లభించలేదా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వివేకా కూతురు సునీతా రెడ్డి గతంలోనే కొందరు అనుమానితుల పేర్లను సీబీఐకి ఇచ్చింది. అందులో సీఎం జగన్ సన్నిహితుడు, కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి పేరు కూడా ఉంది. ఇటీవలే అవినాష్ రెడ్డి కుటుంబ సభ్యులను సీబీఐ ప్రశ్నించింది. వివేకా హత్య కేసు విచారణలో జరుగుతున్న పరిణామాలతో ఈ కేసులో ఏం జరగబోతుందన్న ఉత్కంఠ పెరిగిపోతోంది.