నాలుగు దిక్కులా దళిత బంధు.. కేసీఆర్ టార్గెట్ ఆ నలుగురేనా?
posted on Sep 1, 2021 @ 2:44PM
దళితబంధు. పులి మీద స్వారీలాంటి ఆ పథకం కేసీఆర్‌ను గట్టు దాటిస్తుందో.. గుటుక్కున మింగేస్తుందో.. అనే డౌటు. ఖజానా ఖాళీ అయి భూములు అమ్ముకుంటున్న దుస్థితిలో కూడా లక్షన్నర కోట్లతో నాలుగేళ్లలో ఎస్సీలందరికీ దళితబంధు ఇచ్చి తీరుతానంటున్నారు. ఆయన అంటున్నారే కానీ.. మాట మీద నిలబడతారనే నమ్మకం ఎవరికీ లేదు. కేసీఆర్ చరిత్ర అలాంటిది మరి. కేవలం హుజురాబాద్‌లో గట్టెక్కడానికే.. ఈటల రాజేందర్‌ను దెబ్బకొట్టడానికే.. దళితబంధు తీసుకొచ్చారనేది అందరి అనుమానం. అందుకే, ముందు తన దత్తగ్రామం వాసాలమర్రిలో మమ అనిపించి.. ఆ తర్వాతే హుజురాబాద్‌లో అట్టహాసంగా ప్రారంభించేశారు. పెద్ద రాగమే తీసి.. 15వందల కోట్లు జమ చేసి.. ఇప్పటి వరకూ కేవలం 25 మందికి మాత్రమే దళితబంధు ఇచ్చారు. లబ్దిదారుల ఎంపిక పేరుతో కావాలనే ఆలస్యం చేస్తున్నారని.. ఉప ఎన్నికలు అయ్యేవరకూ ఇలానే లాగుతారని.. ఆ తర్వాత అటకెక్కించేస్తారంటూ ప్రతిపక్షం ప్రచారం చేస్తోంది. దీంతో.. ఉలిక్కిపడిన సీఎం కేసీఆర్.. దళితబంధు అమలులో మరో ఎత్తుగడకు వ్యూహరచన చేశారు. వన్‌షాట్.. ఫోర్ బర్డ్స్ అనేలా.. తెలంగాణ నలుదిక్కులా దళితబంధు పేరు మారుమోగేలా కీలక ప్రకటన చేశారు.
ఇప్పటికే హుజురాబాద్‌లో దళితబంధు మొదలైపోగా.. తాజాగా మరో నాలుగు మండలాల్లో దళిత బంధును స్టార్ట్ చేస్తున్నట్టు ప్రకటించారు సీఎం కేసీఆర్. ఆ నాలుగు మండలాలను వ్యూహాత్మకంగా ఎంపిక చేసుకున్నారని అంటున్నారు. తెలంగాణ రాష్ట్రానికి తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ దిశల్లో.. ఒక్కో దిక్కులో ఒక్కో మండలాన్ని ఎంపిక చేసి.. రాష్ట్రమంతా దళితబంధుపై ఒకేసారి చర్చ జరిగేలా పావులు కదిపారని అంటున్నారు. ఇన్నాళ్లూ కేవలం హుజురాబాద్‌లోనే పైలెట్ ప్రాజెక్టుగా దళితబంధు అమలు అని చెప్పడంతా.. ఆ, అయితే మనకు కాదులే.. మన జిల్లా దాకా వచ్చినప్పుడు చూద్దాంలే.. అన్నట్టు మిగతా ప్రాంతాల వారు ఆ పథకాన్ని పెద్దగా పట్టించుకోలేదు. రాజకీయ రచ్చ తప్ప.. దళితబంధు బాగోగులపై ప్రజల్లో పెద్దగా చర్చ జరగట్లేదు. ఈ విషయాన్ని గుర్తించిన కేసీఆర్.. వెంటనే మరో నాలుగు మండలాల్లో దళితబంధు అమలు నిర్ణయం తీసేసుకున్నారు. కీలకమైన నాలుగు ఉమ్మడి జిల్లాలే టార్గెట్‌గా అమలుకు శ్రీకారం చుట్టారు. ఇప్పట్లో తమవరకూ రాదనుకున్న పథకం.. హఠాత్తుగా తమ ఉమ్మడి జిల్లాలో అమలవుతోందనే సరికి అంతా అలర్ట్ అవుతారని.. దళితబంధుపై ఆరా తీస్తారని.. మరింత అసక్తి కనబరుస్తారనేది కేసీఆర్ మాస్టర్ ప్లాన్...అంటున్నారు. అయితే, ఇలాంటి మాస్టర్ ప్లాన్‌తో పాటు మరో ఖతర్నాక్ పొలిటికల్ స్కెచ్ కూడా దాగుందని విశ్లేషిస్తున్నారు. ఆ రాజకీయ ఎత్తుగడ మరింత ఇంట్రెస్టింగ్‌గా ఉందంటున్నారు.
హుజురాబాద్‌లో బీజేపీ నేత ఈటల రాజేందర్‌కు ఎదుర్కోడానికే దళితబంధు తీసుకొచ్చారనే ప్రచారం జరుగుతోంది. అలాంటి విమర్శలతో ఇటు బీజేపీ, అటు కాంగ్రెస్.. దళితబంధు క్రెడిట్ కేసీఆర్‌కు ఏమాత్రం దక్కకుండా చేసే ప్రయత్నం గట్టిగా చేస్తున్నాయి. బీజేపీ కంటే హస్తం నేతలే దళితబంధుపై మరింత దూకుడుగా ఉన్నారు. పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ఏకంగా దళిత, గిరిజన దండోరాలతో, దీక్షలతో దుమ్మురేపుతున్నారు. అటు కోమటిరెడ్డి బ్రదర్స్ తమ తమ ఏరియాల్లో సొంతంగా దళిత దీక్షలు చేస్తున్నారు. దళిత నేత భట్టి.. ఘాటుగా విమర్శిస్తున్నారు. బీజేపీ ఎంపీ అర్వింద్ కేసీఆర్‌ను మాటలతో కుమ్మేస్తున్నారు. అందుకే, బలమైన వాయిస్ వినిపిస్తున్న ఇలాంటి ప్రతిపక్ష నాయకుల నోళ్లు మూయించేందుకే.. వ్యూహాత్మకంగా ఆయా జిల్లాల్లోని మండలాలను ఎంచుకొని దళిత బంధును అమలు చేసేలా సీఎం కేసీఆర్ పావులు కదిపారని అంటున్నారు.
ఆ నాలుగు మండలాల్లో నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలోని చారగొండ మండలం ఒకటి. ఆ అచ్చంపేటలోని కొండారెడ్డిపల్లినే రేవంత్‌రెడ్డి సొంతూరు. అందుకే, కావాలనే రేవంత్‌రెడ్డి సొంత జిల్లాలోని మండలాన్ని ఎంపిక చేశారని చెబుతున్నారు. ఓవైపు రేవంత్‌రెడ్డి దళితబంధు మోసమంటూ విమర్శలు గుప్పిస్తుంటే.. అదే సమయంలో ఆయన జిల్లాలోనే దళితబంధు అమలు చేసి చూపించి.. రేవంత్‌రెడ్డిని కార్నర్ చేయాలనేది కేసీఆర్ ఎత్తుగడలా కనిపిస్తోంది.
ఇక రేవంత్‌రెడ్డి తర్వాత దళితబంధుపై అంత దూకుడుగా వ్యవహరిస్తోంది కోమటిరెడ్డి బ్రదర్సే. మా నియోజకవర్గంలోనూ దళితబంధు ఇస్తే.. తాము వెంటనే తమ పదవులకు రాజీనామా చేస్తామంటూ ఇప్పటికే ప్రకటించారు కూడా. రాజగోపాల్‌రెడ్డి,, వెంకట్‌రెడ్డిలు దళితలకు మద్దతుగా దీక్షలు కూడా చేశారు. వాళ్లు ఇంత స్ట్రాంగ్‌గా పోరాడుతుంటే ప్రజలు నిజమే అనుకునే ప్రమాదం ఉంది కాబట్టి.. వారి దూకుడుకు చెక్ పెట్టేలా.. వారి అడ్డా అయిన ఉమ్మడి నల్గొండ జిల్లాలోని తిర్మలగిరి మండలంలో దళితబంధుకు శ్రీకారం చుడుతున్నారు కేసీఆర్. కోమటిరెడ్డి ఇలాఖాలోనే దళితబంధు అమలు చేసి చూపించి.. వారి నోటికి కళ్లెం వేయాలనేది కేసీఆర్ స్కెచ్ అంటున్నారు.
ఇక, దళితుల కోసం ప్రగతిభవన్‌లో కేసీఆర్ నిర్వహించిన సమావేశానికి హాజరై.. సీఎంతో కాస్త సఖ్యతగా ఉంటూ.. సొంతపార్టీలోనే విమర్శలకు గురవుతున్న భట్టి విక్రమార్క మద్దతుకు కృతజ్ఞతగానా అన్నట్టు.. ఆయన నియోజకవర్గమైన మధిరలోని చింతకాని మండలాన్ని సైతం దళితబంధు అమలుకు ఎంపిక చేసినట్టు తెలుస్తోంది.
ఇక, హుజురాబాద్‌లో దళితబంధుతో ఇటు ఈటల రాజేందర్‌తో పాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడైన బండి సంజయ్ సొంత జిల్లా కరీంనగర్‌లోనూ దళితులను ఆకర్షించే ప్రయత్నం చేయగా.. కొత్తగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా జుక్కల్ నియోజకవర్గంలోని నిజాంసాగర్ మండలంను దళితబంధు కోసం ఎంపిక చేశారు. నిజామాబాద్ ఎంపీగా ఉన్న బీజేపీ ఫైర్‌బ్రాండ్ లీడర్, ఎంపీ అర్వింద్‌తో పాటు.. అదే జిల్లాకు చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత, ప్రస్తుతం రేవంత్‌కు అత్యంత సన్నిహితంగా ఉంటున్న మధుయాష్కీగౌడ్‌కూ చెక్ పెట్టేలా.. ఆ మండలాన్ని ఎంచుకున్నారని అంటున్నారు.
ఇలా.. ఒకేసారి నాలుగు దిక్కుల్లోని నాలుగు మండలాల్లో దళితబంధును అమలు చేసి.. తెలంగాణ వ్యాప్తంగా దళితబంధుపై చర్చ జరిగేలా చేయడంతో పాటు... నలుగురు కీలక నేతల నోటికి చెక్ పెట్టేలా కేసీఆర్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారని విశ్లేషిస్తున్నారు. మరి, కేసీఆర్ వ్యూహాలు ఎంత వరకూ వర్కవుట్ అవుతాయో చూడాలి మరి...