రూట్ మార్చిన కేసీఆర్.. మరో నాలుగు నియోజకవర్గాల్లో దళిత బంధు
posted on Sep 1, 2021 @ 11:52AM
దళిత బంధు పథకంపై వ్యూహం మార్చారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. దళిత బంధును ప్రతిష్టాత్మకంగా చెప్పిన కేసీఆర్.. రాష్ట్రంలోని దళిత కుటుంబాలన్నింటికి అందిస్తామని చెప్పారు. ప్రస్తుతం కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గంలో పైలెట్ ప్రాజెక్టుగా అమలు చేస్తున్నారు. ఇప్పటికే 15 మంది లబ్దిదారులకు దళిత బంధు పథకం ద్వారా వాళ్లు ఎంచుకున్న యూనిట్లను అందించారు. మిగితా వారికి అందించేందుకు నియోజకవర్గ వ్యాప్తంగా దళిత వాడల్లో అధికారులు సర్వే చేస్తున్నారు. అయితే ఉప ఎన్నిక ఉన్నందు వల్లే హుజురాబాద్ లో దళిత బంధును అమలు చేస్తున్నారని, ఉప ఎన్నిక తర్వాత ఆపేస్తారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. గతంలో దళితులకు మూడు ఎకరాల భూపంపిణి కార్యక్రమం మధ్యలోనే ఆగిపోవడంతో.. జనాల నుంచి ఇవే అనుమానాలు వస్తున్నాయి.
దళిత బంధుపై జనాల నుంచి ఆశించిన ఫలితం రాకపోగా ఉప ఎన్నిక కోసమే తెచ్చారనే ప్రచారంతో తమకు నష్టం కల్గుతుందనే భావించారట గులాబీ బాస్. అందుకే వ్యూహం మార్చారు. దళితబంధు పథకం అమలు యొక్క లోతు పాతులను, దళిత ప్రజల యొక్క మనోభావాలను, వారి అవసరాలను పూర్తి స్థాయిలో అవగాహన చేసుకోవాలని సిఎం కెసిఆర్ నిర్ణయించారు. ఇందులో భాగంగా.. రాష్ట్రంలోని తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ భాగాల్లో వున్న, దళిత శాసన సభ్యులు ప్రాతినిధ్యం వహిస్తున్న నాలుగు నియోజకవర్గాల్లోని 4 మండలాలను ఎంపిక చేసి ఆ మండలాల్లో అన్ని కుటుంబాలకు హుజూరాబాద్ తో పాటు దళితబంధు ను అమలు చేయాలని నిర్ణయించారు.
ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలోని చింతకాని మండలం....సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలోని తిర్మలగిరి మండలం నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలోని చారగొండ మండలం, కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలోని నిజాం సాగర్ మండలాలను సిఎం కెసిఆర్ ఎంపిక చేశారు. ఈ 4 మండలాల్లో వున్న అన్ని దళిత కుటుంబాలకు వెంటనే దళిత బంధు పథకాన్ని ప్రభుత్వం వర్తింపచేస్తుంది. సిఎం కెసిఆర్ ఢిల్లీ పర్యటన ముగించుకుని వచ్చిన తర్వాత ఆయా జిల్లాల మంత్రులు, ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు జిల్లా కలెక్టర్లతో హైద్రాబాద్ లో సమీక్షా సమావేశాన్ని సిఎం నిర్వహించనున్నారు. ఆ సమావేశంలో నిర్ణయాలు తీసుకుని ఈ నాలుగు మండలాల్లో దళితబంధు పథకాన్ని అమలు చేస్తారు.