ఐదు రాష్ట్రాల ఎన్నికలపై లేటెస్ట్ సర్వే.. యూపీలో సంచలనమేనా?
posted on Sep 4, 2021 @ 11:50AM
దేశ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఎన్డీఏ సారథ్యంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత పెరిగిందనే ఆరోపణలు వస్తున్నాయి. పెట్రోల్, డీజిల్ ధరలు , ప్రైవేటీకరణ సహా పలు అంశాల్లో మోడీ సర్కార్ తీరుపై జనాలు అసంతృప్తిగా ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. ఇటీవల నిర్వహించిన ఓ సర్వేలోనే గతంలో కంటే ప్రధాని మోడీ గ్రాఫ్ భారీగా తగ్గింది. అదే సమయంలో విపక్షాలు యాక్టివ్ అవుతున్నాయి. బీజేపీ ప్రభుత్వంపై పోరాటానికి ప్రాంతీయ పార్టీలను ఏకం చేసే పనిలో పడ్డారు కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షరాలు సోనియా గాంధీ. సెప్టెంబర్ చివరి వారంలో తమ కార్యాచరణ మొదలుపెట్టేలా ప్లాన్ చేస్తున్నారు.
దేశంలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితులతో త్వరలో జరిగే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు కీలకంగా మారాయి. యూపీలో కూడా ఎన్నికలు జరగనుండటంతో.. ఆ ఫలితం వచ్చే సార్వత్రిక ఎన్నికలపై ప్రభావం చూపిస్తుందనే చర్చ సాగుతోంది. అందుకే 2022 ప్రదమార్థంలో జరిగే యూపీ సహా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను 2024కు సెమీ ఫైనల్ గా భావిస్తున్నారు. ఆ నేపథ్యంలో యూపీతో పాటు ఎన్నికలు జరగనున్న పంజాబ్.. గోవా.. ఉత్తరాఖండ్.. మణిపూర్ అసెంబ్లీ ఎన్నికలపై తాజాగా ఒక ప్రముఖ మీడియా సంస్థ సర్వే నిర్వహించింది. ఏబీపీ న్యూస్ తో పాటు సి వోటర్ తో కలిసి నిర్వహించిన సర్వేలో ఆసక్తికర ఫలితాలు వచ్చాయి.
పంజాబ్ లో ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ కు గడ్డు పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉందని సర్వేలో తేలింది. కాంగ్రెస్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ కు ఈసారి గెలవడం అంత ఈజీ కాదని తెలుస్తోంది. పంజాబ్ లో ఆమ్ ఆద్మీ పార్టీ అనూహ్యంగా పుంజుకుందని సర్వేలో స్పష్టమైంది. ఢిల్లీ సీఎంగా వ్యవహరిస్తున్న అరవింద్ కేజ్రీవాల్ పంజాబ్ కు సీఎం అయితే బాగుంటుందని 22 శాతం మంది అభిప్రాయపడ్డారు. ఇటీవలే ఎన్డీఏ నుంచి బయటికి వచ్చిన శిరోమణి అకాలీదళ్ అధ్యక్షుడు సుఖ్ బీర్ సింగ్ బాదల్ ను సీఎంగా 19 శాతం మంది కోరుకుంటున్నారు. ప్రస్తుతం సీఎం అమరీందర్ సింగ్ 18 శాతం మంది జై కొట్టగా.. ఆప్ ఎంపీ భగవంత్ మన్ కు 16 శాతం మంది ఓటేశారు. పీసీసీ చీఫ్ నవజ్యోత్ సిద్ధూకు 15 శాతం మంది సానుకూలంగా ఉన్నారు. మొత్తంగా చూస్తే ఆప్ కు మద్దతుగా 40 శాతం మంది నిలవగా.. కాంగ్రెస్ కు 33 మంది ఉన్నారు.
ప్రస్తుతం బీజేపీ అధికారంలో ఉన్న ఉత్తరాఖండ్ రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ వశం కానుందని సర్వేలో తేలింది. ఇటీవల సీఎంగా బాధ్యతలు స్వీకరించిన బీజేపీ నేత ఫుష్కర్ సింగ్ దామీకి 23 శాతం మంది మద్దతు పలికితే.. కాంగ్రెస్ నేత హరీశ్ రావత్ కు 31 శాతం మంది మద్దతుగా నిలిచారు. ఇక గోవాలో మళ్లీ బీజేపీకి గెలుపు అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్న ప్రమోద్ సావంత్ వైపే మెజార్టీ గోవా ప్రజలు ఉన్నారు. 33 శాతం మంది మళ్లీ ఆయనే సీఎం కావాలని కోరుకున్నారు. గోవాలోనూ ఆమ్ ఆద్మీ పార్టీ బలపడుతున్నట్లు కనిపించింది. గోవాలో ఆప్ అభ్యర్థి సీఎం కావాలని 14 శాతం మంది కోరుకున్నారు.
దేశంలో అతి పెద్ద రాష్ట్రమైన ఉత్తర్ ప్రదేశ్ లో బీజేపీకి ఈసారి గడ్డు పరిస్థితులు ఉంటాయనే ప్రచారం సాగుతోంది. కాని ఏబీపీ న్యూస్ సి వోటర్ సర్వేలో మాత్రం వచ్చే ఎన్నికల్లోనూ బీజేపీకి సానుకూలంగా ఉన్నట్లు తేలింది. ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్న యోగిని మెజార్టీ యూపీ ప్రజలు కోరుకుంటున్నట్లుగా తేలింది. సర్వే చేసిన వారిలో 40 శాతం మంది యోగికి అనుకూలంగా స్పందించారు. సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ కు 27 శాతం మంది మద్దతు తెలిపితే.. బీఎస్పీ అధినేత్రి మాయావతిగ్రాఫ్ మరింతగా పడిపోయినట్లుగా తేలింది. ఆమెను యూపీ సీఎం కావాలని కేవలం 15 శాతం మందే కోరుకున్నారు. కాంగ్రెస్ పార్టీ యువనేత, యూపీపై ఫోకస్ చేసినప్రియాంక వాద్రాను ముఖ్యమంత్రిగా కేవలం 3 శాతం మందే అంగీకరించడం ఆసక్తి రేపుతోంది.
యూపీలో బీజేపీకే విజయావకాశాలు మెండుగా కనిపిస్తున్నా.. 2017లో జరిగిన ఎన్నికలతో పోలిస్తే మాత్రం భారీగా సీట్లను కోల్పోనుందని సర్వే ద్వారా తెలుస్తోంది. 2022 ఎన్నికల్లో గతంలో కంటే బీజేపీ 62 సీట్లను కోల్పోనుందని, సమాజ్ వాదీ పార్టీకి ఇప్పుడున్న బలానికి అదనంగా మరో 65 సీట్లు గెలిచే వీలుందని వెల్లడైంది. యూపీ అసెంబ్లీలో మొత్తం 403 స్థానాలు ఉన్నాయి. సర్కార్ ఏర్పాటుకు మేజిక్ ఫిగర్ 202 స్థానాల్లో. ఏబీపీ న్యూస్ సి వోటర్ సర్వే అంచనాల ప్రకారం బీజేపీకి 259 సీట్ల నుంచి 276స్థానాలు.. సమాజ్ వాదీ పార్టీకి 109 నుంచి 117 స్థానాలు.. బీఎస్పీ 12 నుంచి 16 స్థానాలు.. కాంగ్రెస్ 3 నుంచి 7 స్థానాలు రానున్నాయి. ఇతరులకు 6 నుంచి 10సీట్ల రావొచ్చంటున్నారు.
ఇక ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్ లో బీజేపీకే మరోసారి గెలుపు అవకాశాలు ఉన్నాయి. 40.5 శాతం మంది మణిపూర్ లో బీజేపీకి పట్టం కట్టేందుకు ఆసక్తి చూపుతున్నారు. ప్రతిపక్ష పార్టీగా ఉన్న కాంగ్రెస్ కు 34.5 శాతం మంది ఓటర్లు మద్దతుగా నిలిచారు. మొత్తంగా తాజా సర్వే ప్రకారం ప్రస్తుతం అధికారంలో ఉన్న బీజేపీకి ఒక్క ఉత్తరాఖండ్ లో గడ్డు కాలం కనిపిస్తుండగా.. పంజాబ్ లో హస్తం ఎదురీదుతోంది. అనూహ్యంగా పంజాబ్, గోవాలో ఆమ్ ఆద్మీ పార్టీ బలపడుతున్నట్లు స్పష్టమవుతోంది. మొత్తంగా సర్వే ఫలితాలు కాంగ్రెస్ ను కలవరపెడుతుండగా.. బీజేపీకి కొంత ఊరటనిస్తున్నాయి.