పంజ్‌షేర్‌లో తాలిబన్లు ఫసక్.. ముష్కరులకు పాక్ సపోర్ట్!
posted on Sep 5, 2021 @ 1:13PM
పిచ్చోళ్లంతా ఒక్కచోట చేరారు. ముష్కర మూకలంతా అఫ్గనిస్తాన్‌ను అడ్డాగా చేసుకున్నారు. ఎక్కడెక్కడో ఉన్న ఉగ్రవాదులంతా కాబూల్‌లో తిష్టవేశారు. తాలిబన్ల పంచన చేరి ఎవరికి వారే ఉగ్రవాదాన్ని ఎగదోస్తున్నారు. మొత్తం అఫ్గన్‌లో వారికి కొరుకుడుపడని ఏకైక ప్రాంతం..పంజ్‌షేర్. అదొక్కడి కైవసం చేసుకుంటే.. ఇక పాపిష్టి మూకకు తిరుగుండదు. కానీ, పంజ్‌షీర్ అంత ఈజీగా వారికి చేజిక్కడం లేదు. ఆ లోయలోకి వెళ్లినవారంతా.. అట్నుంచి అటే పైకిపోతున్నారు. ఇప్పటికే వందలాది మంది తాలిబన్లు పంజ్‌షీర్ యోధుల దెబ్బకు హతమయ్యారు. మరోవైపు.. ఈ నెల గడిస్తే ఇక పంజ్‌షేర్‌లో అడుగుకూడా పెట్టలేరు.
అందుకే, సమయం లేదు మిత్రమా అంటూ తాలిబన్లు, ఐసిస్, ఆల్‌ఖైదా ఉగ్రవాదులంతా ఏకమై.. లోయపై యుద్ధానికి దిగారు. వారికి నేరుగా పాకిస్తాన్ ఆర్మీ సపోర్ట్ చేస్తోందని అంటున్నారు. ఇంతా చేసినా.. పంజ్‌షేర్ సింహాల ముందు వీరి పప్పులేమీ ఉడకడం లేదు. తాజాగా, ఏకంగా 600మంది తాలిబన్లు హతమయ్యారు. మరో 1000 మందిని పంజ్‌షేర్ దళాలు బంధీగా మార్చేశాయి. ‘నార్తర్న్ అలయెన్స్’ పేరుతో ఉన్న ట్విటర్ అనధికారిక ఖాతాలో ఈ విషయాలు ఉన్నాయి. పంజ్‌షేర్ సైతం తాలిబన్ల వశమైందంటూ వార్తలు వస్తుండగా ఈ విషయాలు వెలుగులోకి రావడం ఆసక్తికరం.
ప్రస్తుతం పర్యాన్ జిల్లాలో తాలిబన్లు, రెసిస్టెన్స్ దళాల మధ్య పోరాటం కొనసాగుతోంది. రెసిస్టెన్స్ దళాలు అత్యాధునిక డ్రోన్లు, బాంబులు వినియోగిస్తున్నారు. పంజ్‌షేర్‌కు ప్రవేశించే మార్గాల్లో ల్యాండ్‌మైన్స్ ఏర్పాటు చేయడంతో తాలిబన్లు ముందుకు కదలలేక పోతున్నారట. అందుకే, పాకిస్థాన్‌కు చెందిన గూఢచార సంస్థ ఐఎస్‌ఐ.. తాలిబన్లకు మద్దతుగా రంగంలోకి దిగిందని అంటున్నారు. తాలిబన్ బద్రి 313 పేరిట 570 మంది పాకిస్థాన్ ప్రత్యేక దళాలు, అల్ ఖైదా, ఐసిస్ వంటి ఉగ్రవాదులు ప్రావిన్స్‌పై దాడికి దిగుతున్నట్లు నార్తర్న్ అలయెన్స్ ఆరోపించింది. పంజ్‌షేర్‌పై దాడి చేస్తున్న తాలిబన్ దళాలకు పాక్ ఐఎస్‌ఐ హెడ్ నేరుగా మార్గనిర్దేశం చేస్తున్నారని తెలుస్తోంది. అయితే, ఇటీవల కాబుల్ చేరుకున్న ఐఎస్‌ఐ హెడ్ మాత్రం తాను తాలిబన్లను కలవడం లేదని తెలిపారు.
తాలిబన్ల టెన్షన్ అంతా రానున్న చలికాలం గురించే అంటున్నారు. అందుకే, ఆ లోగా పంజ్‌షేర్‌ను ఎలాగైనా అక్రమించుకోవాలని తెగ ఆరాటపడుతున్నారు. అక్టోబర్ నాటికి లక్ష్యాన్ని చేరుకోవడంలో విఫలమైతే.. పంజ్‌షేర్ ముట్టడి తాలిబన్లకు మరింత కష్టంగా మారుతుంది. చలికాలంలో దళాల కదలికలు అసాధ్యంగా మారే అవకాశం ఉంది. కొత్త ప్రభుత్వం పూర్తిస్థాయిలో మనుగడలోకి రావడానికి ముందే అహ్మద్ మసూద్ నేతృత్వంలోని యాంటీ తాలిబన్ దళాలను అణగదొక్కాలని భావిస్తున్న ముష్కరులకు పంజ్‌షేర్ నుంచి తీవ్ర ప్రతిఘటన ఏర్పడుతోంది. వందల్లో తాలిబన్లు హతమవుతుండటంతో ఫ్రస్టేషన్‌కి గురవుతున్నారు ముష్కరులు.