ఉప ఎన్నికలకు భయపడుతున్నారా? జగన్, కేసీఆర్ వ్యూహమేంటీ?
posted on Sep 4, 2021 @ 6:50PM
అటు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం, ఇటు తెలంగాణ ప్రభుత్వం కరోనా ఒక ముగిసిన అధ్యాయం అన్నట్లుగా వ్యవహరిస్తున్నాయి. ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అయితే, కరోనాతో సహజీవనం తప్పదని ఎప్పుడోనే తేల్చేశారు. ఉభయ తెలుగు రాష్ట్రాలలో బడులు, గుడులు, సినిమా ధియేటర్లు ... బార్లు... అన్నీ బార్లా తెరిచారు. తెలంగాణలో అయితే, రాజకీయ జాతరలు కూడా జోరుగా సాగుతున్నాయి. అయినా, అక్కడ ఏపీలో ఒకటి (బుద్వేల్) ఇక్కడ (హుజూరాబాద్) అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికల విషయంలో మాత్రం, వామ్మో ... కరోనా అంటూ భయాన్ని ప్రదర్శిస్తున్నారు. ఉప ఎన్నికలు నిర్వహించడం ఇప్పట్లో అయ్యే పని కాదని, చేతు లెత్తేశారు. దీంతో కేంద్ర ఎన్నికల సంఘం ఉభయ తెలుగు రాష్ట్రాలలో ఖాళీ అయిన అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికలు దసరా తర్వాతే నిర్వహిస్తామని ప్రకటించింది.
తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు, ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిజానికి కరోనాకు భయపడతున్నారా లేక జనానికి భయపడుతున్నారా? అంటే, రెండవదానికే అనుకోవలసీ వస్తోంది. ముందు ముందు ఎలా ఉంటుందో తెలియదు కానీ, ప్రస్తుతానికి అయితే, రెండు రాష్ట్రాలలో కరోనా కొంచెం అటూ ఇటుగా చాలా వరకు కంట్రోల్లోనే ఉందని ఆరోగ్య శాఖ విడుదల చేసిన గణాంకాలు సూచిస్తున్నాయి. అదెలా ఉన్నా, అక్కడ ఇక్కడ రెండు రాష్ట్రాలలో ప్రైవేటు, కార్పొరేట్ విద్యాసంస్థల యాజమాన్యాల అభ్యర్ధనలను కాదనలేక కేజీ టూ పీజీ తరగతుల విద్యార్ధులకు ఒకేసారి ప్రత్యక్ష తరగతులు ప్రారంభించాయి. విద్యావ్యాపారం మాత్రమే కాదు, అన్ని ఆర్థిక కార్యకలాపాలు సాగిపోతూనే ఉన్నాయి. తెలంగాణలోనే కాదు, ఏపీలో కూడా ఒక్క వినాయక చవితి మినహా అన్ని మతపరమైన, ఊరేగింపులు ఇతరేతర కార్యక్రమాలకు రాష్ట్ర ప్రభుత్వం పచ్చ జెండా ఉపింది.
తెలంగాణలో హుజూరాబాద్ ఉపఎన్నికలో ఎలాగైనా గెలిచి తీరాలనే పట్టుదలతో ముఖ్యమంత్రి కేసీఆర్, తమ శక్తి యుక్తులు అన్నిటినీ ఉపయోగిస్న్తున్నారు. నిధులు ప్రవాహం, దళిత బంధు, పదవుల పందారం, పెన్షన్లు, రేషన్ కార్డులు ఒకటని కాదు చేతిలో ఉన్న అధికారం మొత్తాన్ని ఇష్టారాజ్యంగా ఉపయోగించుకుంటున్నారు. రాజకీయంగానూ సొంత పార్టీ స్థానిక నాయకులు మొదలు, పక్క పార్టీల నాయకులను కారెక్కించి, రేటు ఎంతైనా డోంట్కేర్ అంటూ కండువాలు కప్పేస్తున్నారు. ఇంతచేసినా, ఎక్కడో ఏదో అనుమానం, ఓటమి తధ్యం అన్న భయం ఆయన్ని వెంటాడుతున్నాయి కావచ్చు, అందుకే, రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఎన్నికలు నిర్వహించాలేంని చేతులెత్తేసింది.
ఇక ఏపీ విషయానికి వస్తే, ముఖ్యమంత్రి సొంత జిల్లా కడపలో అధికార వైసీపీ ఎమ్మెల్యే డాక్టర్ వెంకట సుబ్బయ్య అకాల మరణంతో బద్వేల్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక అన్వర్యమైంది , నిజానికి, హుజూరాబాద్ ఉప ఎన్నికకు డిసెంబర్ 12 వరకు సమయముంది, కానీ బద్వేల్ నియోజకవర్గంలో ఆరు నెలల గడువు సెప్టెంబర్ 28తో ముగుస్తోంది. అయినా, ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఎన్నికల సంఘాన్ని ఉప ఎన్నిక వాయిదా కోరారంటే, ఓడిపోతామనే భయమే కానీ, కరోనా కారణం కాదని వేరే చెప్పనక్కరలేదని,పరిశీలకులు భావిస్తున్నారు. ముఖ్యమంత్రి సొంత జిల్లా కడపలో, అధికార పార్టీలో చాలా కాలంగా సాగుతున్నఅంతర్గత పోరు ఇటీవల కాలంలోతారాస్థాయికి చేరింది. స్వపక్షలో విపక్షం ముఖ్యమంత్రి జగన్ రెడ్డికి తలనొప్పిగా మారింది. పార్టీలోని ప్రత్యర్ధి వర్గాలు ఒఅక్రిపై ఒకరు కత్తులు దూస్తున్నారు. బద్వేల్ సహా ఇంచుమించుగా జిల్లాలోని అన్ని నియోజక వర్గాలలో రాజకీయ అదుపత్య పోరు రక్తి కట్టిస్తోంది. రాజకీయ ఆధిపత్యంతో పాటుగా కాంట్రాక్టుల వరకు పార్టీ నాయకులు తగవు పడుతున్నారు. మరోవంక, ముఖ్యమంత్రి బాబాయ్ ముదర్ కేసు విచారణ కొత్త మలుపులు తిరుగుతోంది. అలాగే, వైఎస్ ఫ్యామిలీలో కుటుంబ తగవులు కూడా కొత్త సమస్యలు తెచ్చి పెడుతోంది.
మరోవైపు తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఎన్నికకు చాలా ముందుగానే దూకుడు పెంచారు. ఉప ఎన్నికకు చంద్రబాబు నాయుడు పార్టీ అభ్యర్ధిని ఖరారు చేసేశారు. ఉప ఎన్నికలో టీడీపీ అభ్యర్థిగా 2019 పోటీచేసిన ఓబులాపురం రాజశేఖర్‌ను బరిలో దింపనున్నట్లు చంద్రబాబు ప్రకటించారు. గత ఎన్నికల్లో ఓటమి చవిచూసినా మరీనా పరిస్థితులలో టీడీపీ అభ్యర్ధి గట్టిపోటీ ఇస్తారని పార్టీ వర్గాలు బావిస్తున్నాయి.దీంతో ముఖ్యమంత్రి జగన్ రెడ్డి సొంత గడ్డపై మరో రసవత్తర రాజకీయ పోరుకు రంగం సిద్దమైంది. ఇంకా వేడి రాచుకోకపోయినా, ముందు ముందు మరో హుజూరాబాద్ గా మారినా ఆశ్చర్య పోనవసరం లేదని అంటున్నారు.