ఈటలకు బిగ్ షాక్.. హుజురాబాద్ ఉప ఎన్నిక వాయిదా
posted on Sep 4, 2021 @ 1:36PM
తెలంగాణ రాజకీయాల్లో సెగలు రేపుతున్న కరీంనగర్ జిల్లా హుజురాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నిక వాయిదా పడింది. ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా లేకపోవడంతో ఉప ఎన్నికను మరి కొంత కాలం వాయిదా వేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. కొవిడ్ ఇంకా పూర్థి స్థాయిలో కట్టడిలో లేనందున ఉప ఎన్నిక ఇప్పుడే వద్దని, పండగల తర్వాత నిర్వహించాలని కేసీఆర్ ప్రభుత్వం సీఈసీని కోరింది. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ సహా మరో 11 రాష్ట్రాలు కూడా ఉప ఎన్నికలకు ముందుకు రాలేదు. దీంతో ఉప ఎన్నికలు జరగాల్సి ఉన్నా 11 రాష్ట్రాలను మినహాయించి బెంగాల్, ఒడిషాలో ఉప ఎన్నికలకు షెడ్యూల్ ఇచ్చింది కేంద్ర ఎన్నికల సంఘం.
పశ్చిమ బెంగాల్ లోని మూడు, ఒడిషాలోని ఒక అసెంబ్లీ ఉప ఎన్నికకు ఈనెల 6న నోటిఫికేషన్ రానుంది. ఈనెల 13 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. సెప్టెంబర్ 30న పోలింగ్ జరగనుండగా.. అక్టోబర్ 3న ఓట్లను లెక్కిస్తారు. బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్డీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయారు. అయినా సీఎంగా ఆమె బాధ్యతలు స్వీకరించారు. ముఖ్యమంత్రిగా ఆమె కొనసాగాలంటే 6 నెలల లోపు ఎమ్మెల్యే కావాల్సి ఉంది. ఇందుకోసం మమతకు నవంబర్ వరకు గడువుంది. బెంగాల్ లో మూడు అసెంబ్లీ సీట్లు ఖాళీగా ఉన్నాయి. దీంతో ఉప ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల సంఘంపై టీఎంసీ ఒత్తిడి తెస్తోంది. అయితే తమను తీవ్రంగా టార్గెట్ చేస్తున్న మమతను ఇబ్బంది పెట్టేలా ఉప ఎన్నికలను ఆలస్యం చేసేలా కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుందనే ఆరోపణలు వచ్చాయి. కాని ఇప్పుడు సీఈసీ షెడ్యూల్ ఇవ్వడంతో టీఎంసీ నేతలు ఊరట చెందుతున్నారు.