ఎమ్మెల్యే తల్లికి పింఛన్! వారెవా.. జగనన్న సర్కార్
posted on Sep 4, 2021 @ 5:10PM
ఆంధ్రప్రదేశ్ లో అన్ని సంచలనాలే. జగన్ రెడ్డి సర్కార్ పథకాలు.. వాటి అమలు తీరు అన్ని వివాదాస్పదమే. అందుకే హైకోర్టు కూడా మొట్టికాయలు వేస్తోంది. ప్రభుత్వం తీసుకున్న చాలా నిర్ణయాలను కొట్టి వేసింది. అయినా జగన్ ప్రభుత్వం తీరు మారడం లేదు. దీంతో రోజుకో సర్కార్ నిర్వాకం బయటికి వస్తూనే ఉంది. తాజాగా ఏ ఎమ్మెల్యే తల్లికి వృద్ధాప్య పెన్షన్ ఇస్తున్న విషయం వెలుగులోనికి వచ్చింది.
ఆయన ఒకటి కాదు రెండు కాదు నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. వైసీపీ సీనియర్ నేతల్లో ఒకరు. ఆయన ఖరీదైన కార్లతో తిరుగుతారు, అయినా ఆ ఎమ్మెల్యే తల్లికి వృద్ధాప్య పెన్షన్ వస్తోంది.కడప జిల్లా రైల్వే కోడూరు వైసీపీ ఎమ్మెల్యే కొరుముట్ల శ్రీనివాసులు తల్లి తులశమ్మకు పింఛన్లు ఇష్తున్న విషయం తాజాగా బయటపడింది. ఒక ఎమ్మెల్యే తల్లికి అధికారులు పింఛన్ ఇవ్వడం దుమారం తీవ్ర కలకలం రేపుతోంది.
ఏపీలో చాలా మంది అర్హులైన వృద్ధులకు పింఛన్ రావడం లేదు. పింఛన్ కోసం వాళ్లంతా కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. పింఛన్ ఇవ్వండి సార్లూ అంటూ కాళ్లా వేళ్లా పడుతున్నారు. అయినా కనికరించడం లేదు అధికారులు. అర్హులైన వారికి పింఛన్లు ఇవ్వడం లేదని రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ నేతలు ఆందోళన చేస్తున్నారు. ఈ క్రమంలోనే టీడీపీ రాష్ట్ర సాంస్కృతిక విభాగం అధ్యక్షుడు పంతగాని నరసింహప్రసాద్ తాజాగా సంచలన ఆరోపణలు చేశారు. ఎమ్మెల్యే శ్రీనివాసులు తల్లికి పింఛన్లు ఇస్తున్నారని.. అభాగ్యులకు తొలగిస్తున్నారని ఆరోపించారు. రైల్వే కోడూరు ఎంపీడీవో కార్యాలయానికి వృద్ధుడి వేషధారణలో వెళ్లి ఆయన వినూత్న నిరసన తెలిపి ఫిర్యాదు చేశారు.
నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన నేత తల్లికి ఇప్పటికీ పింఛన్ ఇస్తుండడం ఏమిటని అధికారులను ప్రశ్నించారు పంతగాని నరసింహప్రసాద్. ఆ ఎమ్మెల్యే రూ.కోటి విలువ చేసే కారులో తిరుగుతున్నా ఆయన తల్లికి పింఛన్ ఇస్తున్నారని.. పేదల పింఛన్లు తొలగిస్తున్నారని.. ఇది ఎంతవరకు న్యాయమని నిలదీశారు. పంతగాని నరసింహప్రసాద్ ఎంపీడీవో కార్యాలయంలో నిరసన వ్యక్తం చేసి వెళుతుండగా ఆయనను కొందరు వైసీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.