జగనన్న సర్కార్ రోడ్ల స్పెషల్.. రన్నింగులోనే ఊడుతున్న బస్సు చక్రాలు
posted on Sep 4, 2021 @ 8:27PM
ఆంధ్రప్రదేశ్ లో రహదారులు అధ్వాన్నంగా తయారయ్యాయనే విమర్శలు వస్తున్నాయి. గతుకుల రోడ్లకు సంబంధించి జనాలు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. పాడై పోయిన రోడ్లు ఫోటోలు, వీడియోలు పోస్టూ చేస్తూ తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అడుగుకో గుంత, గజానికో గొయ్యిలా రోడ్లు తయారయ్యాయని.. పట్నం, పల్లె తేడా లేకుండా ఎక్కడ చూసినా అధ్వాన్న రోడ్లే కనిపిస్తున్నాయని చెబుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో రోడ్లపై కార్లు పడిపోయే సైజులో గుంతలు ఉన్నాయంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఊహించచ్చు.
గతుకుల రోడ్లపై ప్రయాణిస్తూ వేలాది మంది జనాలు హాస్పిటల్ పాలవుతున్నారు. దీంతో ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నాయి. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పిలుపుతో జన సైనికులు అధ్వాన్న రోడ్లను బాగు చేయాలంటూ రోడ్డెక్కారు. జనసేన ఆన్ లైన్ ఉద్యమం ప్రారంభించింది. దీంతో ఏపీలో అధ్వాన్నపు రహదారులపై #JSPForAP_Roads హ్యాష్ ట్యాగ్ తో రెండు రోజుల్లో దాదాపు 2 లక్షల ట్వీట్స్ వచ్చాయి. గుంతల మధ్య రోడ్లను కళ్ళకు కట్టేలా ఉన్న ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో జనాలు అప్ లోడ్ చేశారు. జగన్ రెడ్డి పాలనలో రోడ్ల దుస్థితిపై జనసేన చేపట్టిన ఉద్యమం ట్విట్టర్ ట్రెండింగ్ లో రాష్ట్ర స్థాయిలో మొదటి స్థానంలో, జాతీయ స్థాయిలో 5వ స్థానంలో నిలిచింది.
ఏపీలో రోడ్లు ప్రమాదకరంగా మారాయని విపక్షాలు చెబుతున్నట్లే.. వరుసగా ప్రమాదాలు జరుగుతున్నాయి. తూర్పు గోదావరి జిల్లాలో ఆర్టీసీ బస్సు చక్రాలు రన్నింగులో ఉండగానే ఊడిపోవడం కలకలం రేపుతోంది. తూర్పుగోదావరి జిల్లా గోకవరం నుండి మారేడుమిల్లి మీదుగా గుర్తేడు వెళ్తున్న ఆర్టీసీ బస్సుకు వెనక చక్రాలు ఊడిపోయాయి.. వై. రామవరం మండలం ఎడ్లకొండ వద్దకు బస్సు రాగానే.. రెండు వెనుక చక్రాలు ఒక్కసారిగా బస్సు నుంచి విడిపోయాయి.. పెద్దశబ్దం రావడంతో బస్సులో ఉన్నవారితో పాటు స్థానికులు కూడా భయాందోళనకు గురయ్యారు.. బస్సులో ప్రయాణికులు సురక్షితంగా బయటపడడంతో ఊపిరి పీల్చుకున్నారు.
ఆర్టీసీ బస్సు చక్రాలు ఊడిపోయిన ఘటనపై జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ స్పందించారు. ప్రమాదానికి సంబంధించిన ఫొటోలు ఆయన ట్వీట్ చేశౄరు. ఓ ఆర్టీసీ బస్సు వెనుక చక్రాలు ఊడిన స్థితిలో రోడ్డుపై నిలిచిపోయి ఉన్న ఫొటోను ఆయన షేర్ చేశారు. దెబ్బతిన్న రోడ్ల దుష్ఫలితం అని బస్సు పరిస్థితిపై నాదెండ్ల అన్నారు. తూర్పు గోదావరి జిల్లాలో గోకవరం నుంచి గుర్తేడు పాతకోట వెళ్లే బస్సు వెనుక చక్రాలు ఊడిపోయాయని వెల్లడించారు. ఆ రోడ్డు ఎలా ఉందో చూడండి అంటూ ఫొటోలు ట్వీట్ చేశారు.