కేసీఆర్ కు అమిత్ షా అపాయింట్ మెంట్.. ఢిల్లీలో ఏం జరుగుతోంది?
posted on Sep 4, 2021 @ 1:15PM
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ పర్యటన జాతీయ రాజకీయాల్లో చర్చగా మారింది. దేశ రాజధానిలో తెలంగాణ భవన్ నిర్మాణం భూమి పూజ కోసం హస్తిన వెళ్లిన టీఆర్ఎస్ అధినేత... ముందుగా ఇచ్చిన షెడ్యూల్ లేకున్నా వరుసగా కేంద్రం పెద్దలను కలుస్తుండటం ఆసక్తిగా మారింది. శుక్రవారం సాయంత్రం ప్రధాని నరేంద్ర మోడీని కలిసిన కేసీఆర్ కు కేంద్ర హోంమంత్రి అమిత్ షా అపాయింట్ మెంట్ కూడా ఖరారైంది. మధ్యాహ్నం అమిత్ షా నివాసంలో ఇద్దరి మధ్య సమావేశం జరగనుంది. ప్రధాని మోడీతో జరిగిన సమావేశానికి కొనసాగింపుగానే అమిత్ షాతో తెలంగాణ ముఖ్యమంత్రి చర్చలు ఉంటాయని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి.
శుక్రావరం సాయంత్రం ఐదు గంటలకు ప్రధాని నివాసానికి వెళ్లిన కేసీఆర్.. ప్రధానితో సుమారు 50 నిమిషాలపాటు చర్చించారు. యాదాద్రి ఆలయ ప్రారంభోత్సవానికి ప్రధాని మోడీని కేసీఆర్ ఆహ్వానించారు. మొత్తంగా 16 అంశాలపై ప్రధాని మోడీకి కేసీఆర్ వినతిపత్రం సమర్పించారు. ఐపీఎస్‌ల సంఖ్యపెంపు, కొత్తజిల్లాలకు ఐపీఎస్‌ల కేటాయింపు, హైదరాబాద్- నాగ్‌పూర్ ఇండస్ట్రీయల్ కారిడార్ ప్రధాన అంశాలుగా ఉన్నాయి. ఏపీ, తెలంగాణ మధ్య జలవివాదం, రాష్ట్రానికి రావాల్సిన నిధులపై చర్చ జరిగింది. పీఎంజీఎస్‌వైకి అదనపు నిధులు, కొత్త జిల్లాలకు జవహర్ నవోదయ విద్యాలయాలను కేటాయించాలని ప్రధానికి ముఖ్యమంత్రి విన్నవించారు. తెలంగాణకు గిరిజన వర్సిటీ, ఐఐఎం, కరీంనగర్‌కు ఐఐటీ, వరంగల్‌లో టెక్స్‌టైల్ పార్క్‌కు రూ.1,000 కోట్లు మంజూరు చేయాలని కేసీఆర్ కోరారు. ఢిల్లీలో తెలంగాణ భవన్ నిర్మాణానికి స్థలం కేటాయించాలని ప్రధానిని కోరారు సీఎం కేసీఆర్.
ప్రధాని మోడీని కేసీఆర్ కలవడం రాజకీయ వర్గాల్లో చర్చగా మారగా.. హోమంత్రి అమిత్ షాను కలుస్తుండటం మరింత వేడి పుట్టిస్తోంది. అమిత్ షాతో జరిగే సమావేశంలో ఖచ్చితంగా రాజకీయ అంశాలపై చర్చ ఉంటుందని చెబుతున్నారు. జాతీయ స్థాయిలో ప్రస్తుతం ఎన్డీఏ వ్యతిరేక కూటమి ఏర్పాటు ప్రయత్నాలు జోరుగా సాగుతున్నాయి. ఇటీవలే కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ విపక్ష పార్టీల నేతలతో సమావేశమయ్యారు. మోడీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో పెద్ద ఎత్తున ఉద్యమించాలని నిర్ణయించారు. అయితే ఈ సమావేశానికి టీఆర్ఎస్ అధినేత అయిన కేసీఆర్ కు సమాచారం రాలేదు. తమ కూటమిలోకి కేసీఆర్ ను తీసుకోవడానికి సోనియా ఇష్టంగా లేరని చెబుతున్నారు. కేసీఆర్ ను బీజేపీ మనిషిగానే ఆమె చూస్తున్నారని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ప్రధాని మోడీని కలిసిన కేసీఆర్.. అమిత్ షాను కలుస్తుండటం ప్రాధాన్యత సంతరించుకుంది.
తెలంగాణలో ప్రస్తుతం బీజేపీ, టీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం సాగుతోంది. కేసీఆర్ సర్కార్ పై ఓ రేంజ్ లో ఫైరవుతున్నారు కమలనాధులు. పాదయాత్ర చేస్తున్న ఎంపీ బండి సంజయ్.. కేసీఆర్ సర్కార్ పై తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారు. కేసీఆర్ ను జైలుకు పంపిస్తామని చెబుతున్నారు. రాష్ట్రంలో పరిస్థితి ఇలా ఉంటే .. ఢిల్లీలో కేసీఆర్ కేంద్రం పెద్దలను కలుస్తుండటం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. దేశ వ్యాప్తంగా మారుతున్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో కేసీఆర్ ను దూరం చేసుకోకూడదనే యోచనలో బీజేపీ పెద్దలు ఉన్నారని తెలుస్తోంది. అందుకే కేసీఆర్ తో చర్చలు జరుపుతున్నారని అంటున్నారు. కాంగ్రెస్ కూటమి వైపు వెళ్లడానికి ఇష్టం లేని కేసీఆర్ కు కూడా బీజేపీ తప్ప మారో మార్గం లేదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
మరోవైపు బీజేపీ, టీఆర్ఎస్ ఒకటేనని, రెండు పార్టీలు కావాలనే డ్రామాలు చేస్తున్నాయని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ఢిల్లీలో కేసీఆర్ కదలికలను ఆ పార్టీ నేతలు నిశితంగా పరిశీలిస్తున్నారు. బీజేపీ పెద్దలతో కేసీఆర్ సమావేశాన్ని తమకు అనుకూలంగా మలుచుకుని జనంలోకి వెళ్లాలని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది.