వినాయక చవితి వేడుకలపై ఆంక్షలు... జగన్ సర్కార్ కు హిందూ పండుగలపైనే వివక్షా?
posted on Sep 5, 2021 @ 11:07AM
ఆంధ్రప్రదేశ్ లో వినాయక చవితి వివాదం ముదురుతోంది. జగన్ సర్కార్ తీరుపై హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. వినాయక చవితి ఉత్సవాలను ఇళ్లకే పరిమితం చేయాలని అధికారులను ఏపీ ప్రభుత్వం ఆదేశించింది. బహిరంగ స్థలాల్లో విగ్రహాలు పెట్టవద్దని, నిమజ్జన ఊరేగింపులు కూడా చేయకూడదని ప్రభుత్వం తెలిపింది. ఎవరికి వారు ఇళ్లల్లోనే జరుపుకోవాలని స్పష్టం చేసింది. రాత్రి 11 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూను మరికొద్ది రోజులు పొడిగిస్తున్నట్లు కూడా ఏపీ సర్కార్ ప్రకటించింది. ప్రజారోగ్యం దృష్ట్యా జాగ్రత్తలు తీసుకోక తప్పదని సీఎం జగన్ స్పష్టం చేశారు.
వినాయకుడి ఉత్సవాలకు మాత్రం కొవిడ్ పేరు చెప్పి ఆంక్షలు పెడుతున్న ప్రభుత్వం.. ఇతర విషయాల్లో ఏం జాగ్రత్తలు పాటిస్తోందని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఆలయాల్లో భక్తుల సందర్శనలు ఆగడం లేదు, చర్చిల్లో ఆదివారం ప్రార్థనలు ఆగడం లేదు. జగన్ సర్కార్ తీరుపై హిందూ సంఘాలు, బీజేపీ నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోంది. హిందూ పండుగలపై వివక్ష చూపుతున్నారని, కావాలనే కొవిడ్ పేరుతో ఆంక్షలు విధించారని ఆరోపిస్తున్నాయి. కొవిడ్ కారణంగా వినాయక చవితి వేడుకలకు ఇండ్లలో జరుపుకోవాలని చెబుతున్న జగన్ ప్రభుత్వం.. ఇతర వర్గాల పండుగలకు ఎందుకు అనుమతి ఇచ్చారనే ప్రశ్నలు వస్తున్నాయి. ఇటీవలే మొహర్రం వేడుకలను ఘనంగా నిర్వహించారని, పెద్ద ఎత్తున ర్యాలీలు తీశారని బీజేపీ నేతలు చెబుతున్నారు. గుడ్ ఫ్రైడే రోజున వందలాది మంది ఒకే చోట గుమిగూడి వేడుకలు చేసుకున్నారని గుర్తు చేస్తున్నారు. అప్పుడు లేని ఇబ్బందులు వినాయక చవితి పండుగగే ఎందుకని ప్రశ్నిస్తున్నారు.
అంతేకాదు సెప్టెంబర్ 2న దిగంవత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్థంతిని వైసీపీ నేతలు, కార్యకర్తలు ఊరువాడా నిర్వహించారు. సభలు, సమావేశాలు పెట్టారు. పెద్ద ఎత్తున ర్యాలీలు కూడా తీశారు. వర్దంతి జరుపుకోవడానికి లేని అంక్షలు హిందూ పండుగైన వినాయక చవితిపైనే ఎందుకనే బీజేపీ నేతలు ఏపీ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. ఏపీలో స్కూళ్లను కూడా ఓపెన్ చేశారు. విద్యార్థుల హాజరు కూడా బాగానే ఉంది. నిజానికి థర్డ్ వేవ్ వస్తుందన్న వైద్య నిపుణుల హెచ్చరికలతో స్కూళ్లు ఇప్పుడే తెరవద్దని జనాలు కోరుకున్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు కూడా విజ్ఞప్తి చేశారు. కాని జగన్ సర్కార్ మాత్రం మొండిగా ముందుకు వెళ్లింది. విద్యాసంస్థలను తెరిచింది. స్కూల్స్ తెరిచాకా కరోనా కేసులు కూడా నమోదవుతున్నాయి. స్కూల్స్ తెరిచినప్పుడు.. వినాయక చవితిపైనే ఎందుకు ఆంక్షలు విధించారన్నది హిందూ సంఘాల ప్రశ్న,
ఏపీ సర్కార్ తీరును బీజేపీ నేతలు తీవ్రంగా తప్పుపడుతున్నారు. వినాయక చవితి వేడుకలపై విధించిన ఆంక్షలను వెంటనే రద్దు చేయాలని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు బహిరంగ ప్రకటన విడుదల చేశారు. ఒకవైపు వ్యాక్సిన్ వేస్తూ, మరోవైపు కరోనా తగ్గిందని చెబుతున్న ప్రభుత్వం మళ్లీ ఆంక్షలు పెట్టడం ఏంటని ప్రశ్నిస్తున్నారు బీజేపీ నేతలు. ప్రభుత్వ ఆంక్షలపై ఏకంగా ఆందోళనలకు పిలుపునిచ్చారు సోము వీర్రాజు. ఇడుపులపాయలో లేని ఆంక్షలు వినాయక చవితికి ఎందుకని ప్రశ్నించారు బీజేపీ జాతీయ నాయకురాలు పురంధేశ్వరి. జగన్ ప్రభుత్వంపై ఉద్యమానికి కూడా సిద్ధమవుతున్నారు.హైదరాబాద్ తర్వాత కర్నూల్ లో గణేష్ నిమజ్జనోత్సవం వైభవంగా సాగుతుంది. దీంతో ఏపీ బీజేపీ నేతలు కర్నూల్ లో సమావేశం నిర్వహిస్తున్నారు. కరోనా పేరుతో వినాయక భక్తుల పై ఆంక్షలు సరికాదని, ఉత్సవాలకు నిమజ్జన ఊరేగింపు లకు అనుమతించాలని డిమాండ్ చేస్తున్నారు.
మరోవైపు ఏపీ ప్రభుత్వ నిర్ణయంపై జనాల నుంచి వ్యతిరేకత వస్తోంది. కొవిడ్ నేపథ్యంలో జనం గుమికూడకుండా, ప్రమాదం పొడసూపకుండా జాగ్రత్తలు తీసుకోవడం వేరు. కానీ.. అసలు చవితి ఉత్సవాలను నిర్వహించే అవకాశమే లేకుండా ఆంక్షలను విధించడం ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. వినాయక చవితి అంటే కులమతాలకు అతీతంగా అందరూ కలిసి జరుపుకునే అరుదైన పండుగ. ఏ కాలనీలో జరిగే ఉత్సవాల్లో అయినా హిందువులతో పాటు, ముస్లిములు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొంటూనే ఉంటారు. ఒక పందిరి వేసి వినాయకుడిని ప్రతిష్టించి జనం లేకుండా అయినా సరే.. పూజలు చేసి వేడుక చేసుకోవడం ప్రతిచోటా ప్రజలకు ఒక సెంటిమెంట్ గా మారిపోయిన విషయం. అలాంటిది పూర్తి నిషేధం అనేది ప్రజలకు బాధగా ఉంది. వినాయకచవితి ఉత్సవాలు నిర్వహిస్తే.. పబ్లిక్ స్థలాల్లో ఏర్పాటుచేసే పందిర్ల వద్ద వాలంటీర్లు, పోలీసులతో నియంత్రణకు కొన్ని ఏర్పాట్లు చేస్తే జనం ఎక్కువ రాకుండా చేయడం చాలా చిన్న పని. అలాంటి జాగ్రత్తలకు సంబంధించిన ఏర్పాట్ల గురించి ఆలోచించకుండా.. ఏకంగా ఉత్సావాలనే రద్దు చేయాలని సీఎం జగన్ నిర్ణయించడంపై ప్రజలు మండిపడుతున్నారు.