బద్వేలు ఉప ఎన్నిక వాయిదా.. జగన్ రెడ్డి భయపడుతున్నారా?
posted on Sep 4, 2021 @ 3:56PM
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఒక సీటు ఖాళీగా ఉంది. కడప జిల్లా బద్వేలు ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్య చనిపోవడంతో ఆ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరగాల్సి ఉంది. మార్చి 28న బద్వేలు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే డా.వెంకట సుబ్బయ్య కన్నుమూశారు. ఎన్నికల సంఘం రూల్స్ ప్రకారం చట్ట సభల్లో ఏదైనా సీటు ఖాళీ అయితే 6 నెలల లోపు అక్కడ ఉప ఎన్నిక నిర్వహించాలి. ఈ లెక్కన సెప్టెంబర్ 28కి బద్వేలు ఎమ్మెల్యే చనిపోయి ఆరు నెలలు పూర్తవుతాయి. అంటే అంతలోపే ఇక్కడ ఉప ఎన్నిక నిర్వహించాలి. కాని బద్వేలు ఉప ఎన్నిక విషయంలో మాత్రం సీన్ మారిపోయింది.
రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా లేకపోవడంలో బద్వేలు అసెంబ్లీ ఉప ఎన్నిక వాయిదా పడింది. శనివారం బెంగాల్, ఒడిషాలోని అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికలకు ఎన్నికల షెడ్యూల్ ప్రకటించింది సీఈసీ. తెలంగాణలోని హుజురాబాద్, ఏపీలోని బద్వేలు సహా 11 రాష్ట్రాల్లో ఉప ఎన్నికలను వాయిదా వేసింది. ఇందుకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాల నివేదికలే కారణమని సీఈసీ చెప్పింది. పండుగలు, వరదలు, కోవిడ్-19 మహమ్మారిని ఆయా రాష్ట్రాలు కారణాలుగా చూపినట్లు తెలిపింది. పండుగ సమయం దాటిన తర్వాత ఉప ఎన్నికలను నిర్వహించాలని సూచించారని.. ఆ విధంగానే ఎన్నికల నిర్వహిస్తామని సీఈసీ తెలిపింది.
దేశవ్యాప్తంగా 32 అసెంబ్లీ స్థానాలు, 2 పార్లమెంట్ స్థానాలకు ఉప ఎన్నికలు జరగవలసి ఉంది. ఉప ఎన్నికల నిర్వహణపై అభిప్రాయాలను తెలియజేయాలని రాష్ట్రాలు, రాజకీయ పార్టీలను ఎన్నికల సంఘం కోరింది. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు రాతపూర్వకంగా తమ అభిప్రాయాలను తెలియజేశాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణా, అస్సాం, బిహార్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, మధ్య ప్రదేశ్, మేఘాలయ, రాజస్థాన్, ఉత్తరాఖండ్, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు తమ రాష్ట్రాల్లో ఉప ఎన్నికలను వాయిదా వేయాలని కోరారు. తమ రాష్ట్రాల్లో కరోనా వైరస్ మహమ్మారి అదుపులో ఉందని ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు ఈసీకి లేఖలు రాశారు. ఎన్నికల నిర్వహణకు పూర్తి సన్నద్ధంగా ఉన్నామని తెలిపారు. దీంతో పశ్చిమ బెంగాల్‌లోని భవానీపూర్, శంషేర్‌గంజ్, జంగీపూర్ నియోజకవర్గాలకు, ఒడిశాలోని పిప్లీ శాసన సభ నియోజకవర్గానికి ఎన్నికల షెడ్యూల్ ఇచ్చింది సీఈసీ.
బెంగాల్, ఒడిషాలు ఎన్నికలు జరుగుతూ తెలుగు రాష్ట్రాల్లో ఉప ఎన్నికలు వాయిదా పడటం చర్చగా మారింది. ప్రభుత్వాల నిర్ణయం మేరకే సీఈసీ నిర్ణయం తీసుకోవడంతో.. అధికార పార్టీలకు ఓటమి భయం పట్టుకుందా అన్న చర్చ సాగుతోంది. ముఖ్యంగా బద్వేలు ఉప ఎన్నికను జగన్ సర్కార్ ఎందుకు ఆలస్యం చేస్తుందన్నది ఆసక్తిగా మారింది. బద్వేలు నియోజకవర్గం సీఎం జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లాలో ఉంది. అది వైసీపీకి గట్టి పట్టున్న ప్రాంతం. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో 85 శాతానికి పైగా స్థానాలు అధికార పార్టీనే గెలుచుకుంది. అయినా వైసీపీ ప్రభుత్వం కోవిడ్ కారణంగా చూపి ఎందుకు ఉప ఎన్నిక వాయిదా కోరిందన్నది అంతుపట్టడం లేదు.
జగన్ రెడ్డి ప్రభుత్వంపై ప్రస్తుతం ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత కనిపిస్తోంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దారుణంగా పతనం కావడం, కనీసం రోడ్లకు మరమ్మత్తులు చేసే దిక్కు లేకుండా ఉండటం, మహిళలపై దాడులు పెరిగిపోవడం.. వంటి అంశాలు వైసీపీని కలవరానికి గురి చేస్తున్నాయి. జగన్ సర్కార్ పై రోజు రోజుకు వ్యతిరేకత పెరుగుతోందని ఇటీవల నిర్వహించిన కొన్ని సర్వేల్లోనూ తేలింది. ఏపీ జనాలు టీడీపీకే ఎక్కువగా జై కొట్టారు, ఈ నేపథ్యంలో బద్వేలు ఉప ఎన్నికలో తేడా కొడుతుందేమోనన్న ఆందోళనలో వైసీసీలో ఉందని అంటున్నారు. ప్రభుత్వ నిర్వహించిన సర్వేల్లోనూ ఆశించిన ఫలితం రాలేదని చెబుతున్నారు.
2019 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి వెంకట సుబ్బయ్య దాదాపు 45 వేల ఓట్ల మెజార్టీతో టీడీపీ అభ్యర్థిపై గెలిచారు. వైసీపీకి 95 వేల 482 ఓట్లు రాగా.. టీడీపీ అభ్యర్థి ఓబులాపురం రాజశేఖర్ కు 50 వేల 748 ఓట్లు వచ్చాయి. ఉప ఎన్నికలో అధికార వైసీపీ ఓడిపోకున్నా.. గతంలో కంటే మెజార్టీ తగ్గినా ఇబ్బందే. ఎందుకంటే ఇది సీఎం సొంత జిల్లా. వైసీపీ ఎమ్మెల్యే చనిపోవడంతో సెంటిమెంట్ కూడా ఉంటుంది. ఉప ఎన్నికలో గతంలో కంటే మెజార్టీ పెరగాల్సిందే. కాని ప్రస్తుతం అలాంటి సీన్ కనిపించపోవడంతోనే ఇప్పడే ఉప ఎన్నిక వద్దని సీఎం జగన్ భావించారని అంటున్నారు. మరోవైపు బద్వేలు ఉప ఎన్నిక కోసం టీడీపీ కేడర్ ను సిద్ధం చేసింది. తమ అభ్యర్థిగా గత ఎన్నికల్లో పోటీ చేసిన ఓబులాపురం రాజశేఖర్ ను ప్రకటించారు చంద్రబాబు నాయుడు. వైసీపీ మాత్రం ఇంకా అభ్యర్థిని అధికారికంగా ప్రకటించలేదు.