గిదేంది కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి! కాంగ్రెస్ కార్యకర్తల సూటి ప్రశ్నలు...
posted on Sep 5, 2021 @ 4:39PM
తెలంగాణ కాంగ్రెస్ ఇప్పుడిప్పుడే జోష్ లో కనిపిస్తోంది. పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి నియామకం తర్వాత కేడర్ లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. వరుస కార్యక్రమాలతో ప్రజల్లోకి దూసుకుపోతున్నారు రేవంత్ రెడ్డి. పీసీసీ చీఫ్ కాగానే ఛలో రాజ్ భవన్ ఆందోళనతో అధికార పార్టీని షేక్ చేశారు. దళిత గిరిజన దండోరా సభలతో సీఎం కేసీఆర్ ను ఏకిపారేస్తున్నారు. దండోరా సభలకు ఊహించిన దానికంటే భారీగా స్పందన వచ్చిందని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ తో పాటు కేంద్ర ప్రభుత్వాన్ని తనదైన శైలిలో టార్గెట్ చేస్తున్నారు రేవంత్ రెడ్డి. దీంతో హస్తం పార్టీదే వచ్చే ఎన్నికల్లే అధికారమనే చర్చ కూడా గాంధీభవన్ లో జరుగుతోంది. మరోవైపు అదే సమయంలో కాంగ్రెస్ లో కోల్డ్ వార్ తెరపైకి వస్తోంది. ముఖ్యంగా భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు పార్టీకి ఇబ్బందిగా మారుతున్నాయి. వైఎస్ విజయమ్మ ఏర్పాటు చేసిన వైఎస్ సంస్మరణ సభకు ఎవరూ వెళ్లొద్దని పీసీసీ ఆదేశాలు ఇచ్చినా ఆ సభకు హాజరయ్యారు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. అంతేకాదు అక్కడ పీసీసీని టార్గెట్ చేస్తూ కామెంట్లు చేశారు. రేవంత్ రెడ్డి, సీతక్కలపై ఘాటు విమర్శలు చేశారు.
ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తీరుపై కాంగ్రెస్ లో అసహనం వ్యక్తమవుతోంది. పార్టీకి ఫుల్ జోష్ వస్తున్న సమయంలో ఇలాంటి నేతలు వెనక్కి లాగే ప్రయత్నం చేస్తున్నారనే అభిప్రాయం కాంగ్రెస్ కార్యకర్తల నుంచి వస్తోంది. ఆ నేపథ్యంలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని ఉద్దేశించి కొందరు కాంగ్రెస్ కార్యకర్తలు చేసిన పోస్టు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అందులో కోమటిరెడ్డి వ్యవహార శైలిని తప్పుపట్టడంతో పాటు ఆయనకు పలు సూచనలు చేశారు కాంగ్రెస్ కార్యకర్తలు.
కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి కాంగ్రెస్ కార్యకర్తల సూటి ప్రశ్నలు అంటూ వైరల్ అవుతున్న పోస్టు ఇదే...
⦁ పీసీసీ అధ్యక్ష పదవి దక్కలేదన్న అక్కసుతో, వ్యక్తిగత కక్షతో మీరు వ్యవహరిస్తోన్న తీరు, మాట్లాడుతున్న మాటలు కాంగ్రెస్ పార్టీకి లాభమా... నష్టమా?
⦁ తండ్రి సంస్మరణ సభ ముసుగులో షర్మిల, విజయమ్మలు రాజకీయ సమ్మేళనాన్ని పెట్టి, రాజకీయ ప్రయోజనం పొందే ప్రయత్నం చేస్తూ... కాంగ్రెస్ కు నష్టం చేసే ప్రయత్నం చేస్తుంటే దానిని సమర్ధించమంటారా...?
⦁ నా కుమార్తెను మీకు అప్పగిస్తున్నా దీవించండి అని విజయమ్మ...తెలంగాణలో రాజన్న రాజ్యం తెస్తాను అని షర్మిల రాజకీయ ప్రకటనలు చేసిన సభ సంస్మరణ సభ అవుతుందా... రాజకీయ సభ అవుతుందా... మీ పరిజ్ఞానానికే వదిలేస్తున్నాం?
⦁ అది వైఎస్ రాజశేఖర్ రెడ్డి సంస్మరణ సభే ఐతే ఆయన కుమారుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎందుకు హాజరు కాలేదో మీరు చెప్పగలరా?
⦁ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా వైఎస్ ను గౌరవిస్తాం... కానీ, సమైక్య వాదిగా ఆయనను తిరస్కరిస్తాం... రాజశేఖర్ రెడ్డి బతికి ఉంటే తెలంగాణ వచ్చి ఉండేది కాదు అన్న విజయమ్మ మాటలను ఆమె సభకు హాజరైన మీరు సమర్ధిస్తారా?
⦁ వైఎస్ తెలంగాణను వ్యతిరేకించినా ఆయన కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి కాబట్టే... వర్ధంతి రోజు కాంగ్రెస్ శ్రేణులు టీపీసీసీ ఆదేశాల మేరకు ఊరువాడా నివాళి అర్పించిన విషయం మీ కంటికి కనిపించలేదా...?
⦁ వైఎస్ తనయుడు జగన్ మోహన్ రెడ్డి కారణంగానే ఏపీలో కాంగ్రెస్ పార్టీ సర్వనాశనం అయింది... ఇప్పుడు తనయ షర్మిల ద్వారా తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీ నష్టపోవడాన్ని మీరు సమర్ధిస్తారా...? తన వారసుల ద్వారా కాంగ్రెస్ భూస్థాపితం కావాలని వైఎస్ కోరుకున్నారా...?
⦁ రేవంత్ రెడ్డిని పదే పదే చంద్రబాబు మనిషి అని ముద్ర వేయడం టీఆర్ఎస్ దుష్ట ఎజెండాలో భాగం అని తెలంగాణ సమాజం మొత్తం భావిస్తోంది... అదే ఎజెండా ను మోస్తున్న మిమ్మల్ని కాంగ్రెస్ మనిషి అనుకోవాలా... లేక కేసీఆర్ కోవర్ట్ అనుకోవాలా...?
⦁ సోనియాగాంధీ నిర్ణయం మేరకు పీసీసీ అధ్యక్ష పదవిలో ఉన్న రేవంత్ రెడ్డి పై చంద్రబాబు మనిషి అని ముద్ర వేయడం కాంగ్రెస్ కు లాభమా... నష్టామో చెప్పగలరా?
⦁ షర్మిల, విజయమ్మ పెట్టిన రాజకీయ సమ్మేళన సభకు వెళ్లకూడదన్నది ఒక్క రేవంత్ రెడ్డి నిర్ణయం కాదు... టీపీసీసీ, ఏపీసీసీ, టీసీఎల్పీ కలిసి తీసుకున్న నిర్ణయం... దీంట్లో మీరు ఒక్క రేవంత్ రెడ్డి గారినే టార్గెట్ చేయడం వెనుక ఆంతర్యం ఏమిటి?
⦁ తెలంగాణలో కేసీఆర్ వ్యతిరేక పునరేకీకరణ జరగాల్సిన అవసరం ఉంది. రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ఈ బాధ్యతను తీసుకుంది. ఆ క్రమంలోనే ముఖ్య నేతలు ఇతర పార్టీల నేతలను కలిసి కాంగ్రెస్ లోకి ఆహ్వానిస్తున్నారు...ఈ ప్రయత్నాన్ని మీరు తప్పు పడతారా... ?
⦁ టీపీసీసీ ఆధ్వర్యంలో జరుగుతోన్న కేసీఆర్ వ్యతిరేక పునరేకీకరణను వ్యతిరేకించడమంటే పరోక్షంగా కేసీఆర్ ను సమర్ధించడం కాదా... ఇన్నేళ్ల రాజకీయ అనుభవం ఉన్న మీకు ఈ మాత్రం అవగాహన లేదా...?
⦁ రాజకీయాల్లో విలువలు దిగజారి పోయాయి. ఆయారాం గాయారం గాళ్లు పార్టీలు మారగానే కొత్త పార్టీ అధినేతలను ప్రసన్నం చేసుకోవడం కోసం పాత పార్టీ అధినేతల పై ఇష్టారాజ్యంగా నోరు పారేసుకుంటున్న రోజులివి... అలాంటి రాజకీయాలకు భిన్నంగా రేవంత్ రెడ్డి వ్యవహరించడం మీ దృష్టిలో రాజకీయ విలువలను ప్రోత్సహించినట్టా... దిగజార్చినట్టా...?
⦁ చంద్రబాబు భుజాలపై తుపాకీ పెట్టి టీపీసీసీ అధ్యక్ష పదవిలో ఉన్న రేవంత్ రెడ్డిని కొట్టాలన్నది టీఆర్ఎస్ ఆలోచన... కేసీఆర్ ఆలోచనను మీరు ఆచరణలో పెట్టాలనుకుంటున్నారా...?
⦁ 2018 డిసెంబర్ 11తో తెలంగాణలో తెలుగుదేశం చరిత్ర ముగిసిపోయింది. అసలు అస్థిత్వంలోనే లేని... సంబంధం లేని పార్టీని టార్గెట్ చేసి మాట్లాడాలని మీరు కోరుకోవడంలో ఆంతర్యం ఏమిటి?
⦁ 2018 అసెంబ్లీ ఎన్నికలలో ఇదే తెలుగుదేశం పార్టీ, చంద్రబాబుతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకుంటే అదే పచ్చకండువా మెళ్లో వేసుకుని మీరు ఊరూరు ఊరేగలేదా...? తెలుగుదేశం నేతలతో కలిసి ప్రచారం చేసుకోలేదా...? ఆ రోజు మీరు చేసింది చంద్రబాబు భజన కాదా...?
⦁ కేసీఆర్ మోసపూరిత విధానాలకు వ్యతిరేకంగా ఏఐసీసీ ఆమోదం మేరకు టీపీసీసీ నిర్వహిస్తోన్న దళిత - గిరిజన ఆత్మగౌరవ దండోరా సభలకు హాజరయ్యేందుకు సమయం లేని మీకు... విజయమ్మ - షర్మిలలు నిర్వహించిన వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ సమావేశాలకు హాజరయ్యేందుకు మాత్రం సమయం ఉందా...?
⦁ నీ నియోజకవర్గంలో దళిత - గిరిజన ఆత్మగౌరవ సభ పెడదామంటే... అవసరం లేదు అని పార్టీ నిర్ణయాన్ని అడ్డుకున్న మీకు కాంగ్రెస్ పార్టీ మీద, పార్టీ భవిష్యత్ మీద కమిట్ మెంట్ అన్నాటా... లేనట్టా... మమ్మల్ని ఎలా అర్థం చేసుకోమంటారు...?
⦁ ఆర్థికంగా నిలదొక్కుకోవడం కోసం అటు ఢిల్లీలో మోదీని, ఇటు రాష్ట్రంలో కేసీఆర్ తో చీకటి ఒప్పందం చేసుకున్నారని మీపై ప్రచారం జరుగుతోంది... ఆ ప్రచారాన్ని మేం నమ్మాలా... వద్దా?
⦁ అనేక మంది సీనియర్లు పార్టీలో ఉన్నా... 1984లో జూనియర్ అయిన వైఎస్ రాజశేఖర్ రెడ్డికి పీసీసీ పదవి ఇచ్చిన మాట వాస్తవం కాదా... సీనియర్లకే పీసీసీ ఇవ్వాలంటే మీ కంటే సీనియర్లు పార్టీలో లేరా... వాళ్లకు లేని బాధ మీకొక్కరికే ఎందుకు...?
⦁ కోవర్టులు కాంగ్రెస్ ను వీడి పోవాలని ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ గారే పిలుపునిచ్చారు... ఆయన మార్గంలోనే టీపీసీసీ కూడా పయనిస్తోంది అన్న విషయం మీకు అర్థం కావడం లేదా...?
⦁ మీరు కాంగ్రెస్ నాయకులుగా ఉన్నారో... కేసీఆర్ కోవర్టుగా ఉన్నారో కాంగ్రెస్ కార్యకర్తలమైన మాకు అర్థం కావడం లేదు...
⦁ పీసీసీ అధ్యక్షుడు అయిన తర్వాత మీరు రావద్దన్నా... సీనియర్లను అందరినీ కలుపుకుని పోవాలన్న ఉద్ధేశంతో రేవంత్ రెడ్డి ఓ మెట్టు దిగి ఢిల్లీలో మూడు సార్లు మిమ్మల్ని కలిసి కాంగ్రెస్ బలోపేతం కోసం కలిసి పని చేద్దామని చెప్పిన మాట వాస్తవం కాదా...?
⦁ మీరు చచ్చేదాకా కాంగ్రెస్ లో ఉంటారా... లేక కాంగ్రెస్ ను చంపేదాకా ఉంటారో అర్థం కావడం లేదు...
⦁ ఒకవైపు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ నాయకత్వంలో పని చేస్తాం అని చెబుతారు... మరోవైపు ఆ సోనియాగాంధీ, రాహుల్ గాంధీ తీసుకున్న నిర్ణయాన్నే వ్యతిరేకిస్తారు... దీనిని ఎలా అర్థం చేసుకోవాలి?
⦁ తమపై కేసులు సోనియాగాంధీ కుట్రలో భాగమేనని ఊరువాడ తిరిగి బదనాం చేసిన విజయమ్మ, షర్మిల సభలకు వెళ్లి మీరు ఏం సంకేతం ఇవ్వదలచుకున్నారు. సోనియాగాంధీ పై వాళ్లు వేసిన అబాండాలపై మీ వైఖరి ఏమిటి?
⦁ కేవలం పీసీసీ అధ్యక్ష పదవి రాలేదన్న అక్కస్సుతో... ఆర్థికంగా నిలదొక్కుకోవడం కోసం కేసీఆర్ తో లాలూచీ పడి మీరు చేస్తోన్న విమర్శలు కాంగ్రెస్ పార్టీకి మేలు చేస్తాయని భావిస్తున్నారా....?
⦁ పీసీసీ పదవిలో ఈ రోజు రేవంత్ రెడ్డి ఉండొచ్చు... రేపు మరొకరు ఉండొచ్చు కానీ కాంగ్రెస్ పార్టీ శాశ్వతం. మీ మాటలు, చేతలు దానిని శాశ్వత సమాధి చేసేలా ఉన్నాయన్నది వాస్తవం కాదా...?
⦁ మీ వ్యవహార శైలి ఇలాగే కొనసాగితే మిమ్మల్ని కేసీఆర్ కోవర్టుగా భావించాల్సి ఉంటుంది... మీ లాంటి వాళ్లు కాంగ్రెస్ కు అవసరమా అని కూడా కార్యకర్తలుగా మేం ఆలోచన చేయాల్సిన పరిస్థితి వస్తోంది.
⦁ వెంకట్ రెడ్డి ... చివరిగా ఒక విజ్ఞప్తి. మీరు ఆత్మపరిశీలన చేసుకోండి. దయచేసి వ్యక్తులపై కోపంతో కాంగ్రెస్ కు వెన్నుపోటు పొడిచే ప్రయత్నం చేయకండి.