కేసీఆర్‌పై సీబీఐ డైరెక్టర్‌కి ఫిర్యాదు.. ఢిల్లీలో రేవంత్‌రెడ్డి దూకుడు..
posted on Sep 9, 2021 @ 12:57PM
సీఎం కేసీఆర్ ఢిల్లీలోనే తిష్ట వేశారు. కేంద్ర పెద్దలను కలిశారు. ఆ తర్వాత నుంచి గాయబ్. ఢిల్లీలోనే ఉన్నారు కానీ, ఎక్కడ ఉన్నారో.. ఏం చేస్తున్నారో.. ఎవరిని కలుస్తున్నారో.. ఏం మంత్రాంగం నెరపుతున్నారో... మూడోకంటికి తెలీడం లేదు. ఇలా కేసీఆర్ హస్తినలో తనదైన రాజకీయం నడుపుతుండగా.. గులాబీ బాస్‌కు పోటీగా పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి సైతం ఢిల్లీలో దడదడలాడిస్తున్నారు. ఇద్దరు హేమాహేమీల పాలిటిక్స్‌తో.. ఢిల్లీలో తెలంగాణ పొలిటికల్ హీట్ పెరిగింది.
రేవంత్‌రెడ్డి పలువురు పీసీసీ సభ్యులతో కలిసి ఏఐసీసీ నేత రాహుల్‌గాంధీని కలిశారు. రాష్ట్ర రాజకీయాలపై మంతనాలు జరిపారు. కేసీఆర్‌ను గద్దె దించడానికి అవలంభించాల్సిన భవిష్యత్ వ్యూహాలపై చర్చించారు. దళిత-గిరిజన దండోరా సభకు రావాలని రాహుల్‌ను ఆహ్వానించారు రేవంత్.
రాహుల్‌గాంధీతో మీటింగ్ ముగిసినా.. ఇంకా ఢిల్లీలోనే ఉన్నారు రేవంత్‌రెడ్డి. కేసీఆర్ పన్నుతున్న ఎత్తులను చిత్తు చేసేలా కాంగ్రెస్ పెద్దలతో ప్రణాళికలు రచిస్తున్నారని తెలుస్తోంది. పనిలో పనిగా.. కేసీఆర్ సర్కారును ఇరకాటంలో పెట్టేలా పలు పావులు సైతం కదుపుతున్నారు పీసీసీ చీఫ్. అందులో భాగంగా.. ఢిల్లీలో సీబీఐ డైరెక్టర్‌ను కలిసి.. సీఎం కేసీఆర్‌పై ఫిర్యాదు చేశారు రేవంత్‌రెడ్డి. ఇటీవల కోకాపేట, ఖానామెట్‌లో ప్రభుత్వ భూముల వేలంలో పెద్ద ఎత్తున గోల్‌మాల్ జరిగిందని నేరుగా సీబీఐ డైరెక్టర్‌కే కంప్లైంట్ ఇచ్చి కాక రేపారు.
సీఎం కేసీఆర్ తనకు కావాల్సిన వారికి కారు చౌకగా ప్రభుత్వ భూములను కట్టబెట్టారని పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ఆరోపించారు. రాష్ట్ర ఖజానాకు 1500 కోట్ల నష్టం తెచ్చారని.. రాతపూర్వకంగా సీబీఐ డైరెక్టర్‌కు ఫిర్యాదు చేసినట్టు రేవంత్ తెలిపారు. సీఎస్ సోమేశ్‌కుమార్, జయేశ్ రంజన్‌పై కూడా ఫిర్యాదు చేసినట్టు వెల్లడించారు. హస్తినలో మకాం వేసి.. కులాసాగా రాజకీయ వ్యూహాలు రచిస్తున్న గులాబీ బాస్‌కు.. అదే ఢిల్లీలో రేవంత్‌రెడ్డి సీబీఐకి ఇచ్చిన ఫిర్యాదుతో కేసీఆర్ ఒక్కసారిగా ఉలిక్కిపడటం ఖాయమంటున్నారు. రేవంత్‌రెడ్డా మజాకా.. అంటున్నారు కాంగ్రెస్‌వాదులు.