చెయ్యి పట్టి లాగి.. లోకేశ్‌పై పోలీసుల దౌర్జన్యం.. టీడీపీ తీవ్ర ఆగ్రహం..
posted on Sep 9, 2021 @ 2:28PM
ఎందుకోగానీ ఇటీవల నారా లోకేశ్ అంటే జగన్‌రెడ్డి సర్కారు బాగా భయపడుతున్నట్టుంది. ఆయన ఎక్కడికి వెళితే అక్కడ పోలీసులను మోహరించి లోకేశ్ ముందరి కాళ్లకు బంధం వేస్తోంది. ఏకంగా వెయ్యి మంది పోలీసులు లోకేశ్‌ను చుట్టుముట్టడమంటే మాటలా? లోకేశ్ మాటల్లో దూకుడు, చేతల్లో వాడి-వేడి పెరగడమే ప్రభుత్వ ఆందోళనకు కారణం కావొచ్చు. పైగా నారా లోకేశ్ ఎంచుకుంటున్న సమస్యలు సైతం సర్కారును ఇరకాటంలో పడేసేవే కాబట్టి.. లోకేశ్ పర్యటనలను పోలీసుల సహాయంతో అడ్డుకుంటోంది వైసీపీ ప్రభుత్వం. తాజాగా, నరసరావుపేటలో అనూష కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు వెళ్తున్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ను గన్నవరం ఎయిర్ పోర్టులోనే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కొవిడ్ నిబంధనల కారణంగా పర్యటనకు అనుమతి లేదంటూ నారా లోకేశ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకొని విజయవాడ తరలించారు.
తనను అడ్డుకోవడంపై పోలీసులతో వాగ్వాదానికి దిగారు నారా లోకేశ్. ‘ నా పర్యటనను ఎందుకు అడ్డుకుంటున్నారో తెలియట్లేదు. నేను ధర్నాలు, ఆందోళనలు చేయడానికి వెళ్లట్లేదు. బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్తుంటే పోలీసులు కావాలనే అడ్డుకుంటున్నారు. ఏది తప్పో.. ఏది ఒప్పో నాకు తెలుసు. నాపై ఎలాంటి కేసులు లేవు’ అని నారా లోకేష్ పోలీసులపై మండిపడ్డారు. అయినా, లోకేశ్‌ను బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఈ సందర్భంగా ఖాకీలు లోకేశ్ చెయ్యి పట్టి కారు లోంచి బయటకు లాగడంపై టీడీపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. పోలీసుల తీరును నిరసిస్తూ.. టీడీపీ నేతలు, కార్యకర్తలు నినాదాలతో హోరెత్తించారు.
పోలీసుల తీరును తీవ్రంగా ఖండిస్తున్నారు టీడీపీ నాయకులు. పోలీసు వ్యవస్థను వైసీపీ ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని మండిపడుతున్నారు. పోలీసులు తమ విధులు నిర్వర్తిస్తే క్రైం రేటు తగ్గేదన్నారు. లోకేష్‌ను చూసి జగన్ ప్రభుత్వం ఎందుకంత భయపడుతోంది ప్రశ్నింస్తోంది టీడీపీ.