కేసీఆర్ తో కొండా దంపతులకు గొడవ ఇదే? హుజురాబాద్ పోటీపై క్లారిటీ..
posted on Sep 9, 2021 @ 3:57PM
కొండా దంపతులు.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఫ్రైర్ బ్రాండ్ లీడర్లుగా ముద్ర పడిన వారు. కొండా సురేఖ మంత్రిగా... కొండా మురళీ ఎమ్మెల్సీగా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉమ్మడి వరంగల్ జిల్లా రాజకీయాలను శాసించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత కొండా దంపతుల రాజకీయ జీవితం అనేక మలుపులు తిరిగింది. మొదట వైఎస్ జగన్ కు మద్దతుగా నిలిచారు. రాష్ట్ర విభజన తర్వాత వైసీపీకి గుడ్ బై చెప్పి.. ఎవరూ ఊహించని విధంగా టీఆర్ఎస్ లో చేరారు. 2014 ఎన్నికల్లో వరంగల్ తూర్పు నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. కేసీఆర్ కేబినెట్ లో మంత్రి పదవి వస్తుందని భావించినా రాలేదు. తర్వాత కేసీఆర్ తో విభేదాలు రావడంతో 2018 ఎన్నికలకు ముందు తిరిగి కాంగ్రెస్ లో చేరారు కొండా దంపతులు. కాని గత అసెంబ్లీ ఎన్నికల్లో పరకాల నుంచి పోటీ చేసిన కొండా సురేఖ ఘోరంగా ఓడిపోయారు.
2018 ఎన్నికల్లో ఓటమి తర్వాత కొంత కాలం రాజకీయాల్లో యాక్టివ్ గా పాల్గొనలేదు కొండా దంపతులు. పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి నియమాకం తర్వాత మళ్లీ స్పీడ్ పెంచారు. నిజానికి గతంలో రేవంత్ రెడ్డితో వాళ్లకు తీవ్ర విభేదాలుండేవి. కాని ప్రస్తుతం రేవంత్ రెడ్డికి ప్రధాన మద్దతుదారులుగా మారిపోయారు కొండా దంపతులు. త్వరలో ఉప ఎన్నిక జరగనున్న కరీంనగర్ జిల్లా హుజురాబాద్ లో కాంగ్రెస్ అభ్యర్థిగా కొండా సురేఖ పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. కొండాను బరిలోకి దింపి తన సత్తా చాటాలని యోచనలో రేవంత్ రెడ్డి ఉన్నారని అంటున్నారు. ఈ నేపథ్యంలో హుజురాబాద్ ఉప ఎన్నికలో పోటీ చేస్తారంటూ తమపై జరుగుతున్న ప్రచారంపై క్లారిటీ ఇచ్చారు కొండా దంపతులు. అంతేకాదు సీఎం కేసీఆర్ తో తమకు గ్యాప్ ఎందుకు వచ్చిందో చెప్పారు. అంతేకాదు టీఆర్ఎస్ లో కేసీఆర్ వ్యవహారశైలిపై సంచలన వ్యాఖ్యలు చేశారు కొండా దంపతులు.
టీఆర్ఎస్ నేతలు అంతా కేసీఆర్ కు ఊడిగం చేసేవారే అన్నారు కొండా మురళీ. వరంగల్ దళితులకు కూడా దళితబంధు అమలు చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే వందలారీల్లో జనాలను తీసుకెళ్లి హుజురాబాద్ లో నామినేషన్ వేయిస్తా అన్నారు. టీఆర్ఎస్ లో దళిత నేతలకు సిగ్గుంటే రాజీనామా చేయాలన్నారు. 2018లో కొండా సురేఖకు ఓడించేందుకు 500 కోట్లు కేసీఆర్ ఖర్చు చేశారని కొండా మురళీ ఆరోపించారు. ఇప్పుడు ఈటల రాజేందర్ ను ఓడించేందుకు వేలకోట్లు ఖర్చు చేస్తున్నారని చెప్పారు. కేసీఆర్ దగ్గర బూట్లు విడవలేదనే తనపై కక్ష కట్టాడంటూ సంచలన ఆరోపణలు చేశారు కొండా మురళీ. వరంగల్ కు చెందిన టీఆర్ఎస్ కార్పోరేటర్లు తన కాళ్ళు పట్టుకుని టికెట్ అడుక్కుని తన కాళ్లే లాగేశారన్నారు. కాంగ్రెస్ లో గట్టినేతలను డమ్మీ చేసేందుకే మమ్ములను అప్పుడు టీఆర్ఎస్ లో చేర్చుకున్నారని సురేఖ అన్నారు. కొండా సురేఖకు మంత్రి పదవి ఇస్తే గట్టిగా మాట్లాడుతుందని ఐదేళ్లు మంత్రి పదవి ఇవ్వకుండా దాటవేశారని ఆరోపించారు. కేసీఆర్ అసలు స్వరూపం తెలుసుకుని బయటకు వచ్చామని తెలిపారు.
హుజురాబాద్ ఉప ఎన్నికలో పోటీపైనా మురళీ క్లారిటీ ఇచ్చారు. హుజురాబాద్ లో కొండా సురేఖకు పోటీచేయాలని కాంగ్రెస్ అధిష్ఠానం అడుగుతోందంటే తమపై ఎంత నమ్మకముందో అర్థం చేసుకోవాలన్నారు. హుజూరాబాద్ లో టీఆర్ఎస్, బీజేపీ కి గట్టీ పోటీ ఇవ్వాలంటే కొండా సురేఖ కరెక్ట్ అని కాంగ్రెస్ నేతలు అంటున్నారని సురేఖ చెప్పారు. ఒకవేళ తాను హుజురాబాద్ లో పోటీచేసినా... మళ్లీ వరంగల్ కే వస్తానని క్లారిటీ ఇచ్చారు. అలాంటి హామీ వస్తేనే హుజూరాబాద్ లో పోటీచేస్తానని పీసీసీ చెప్పానని తెలిపారు. గత ఎన్నికల్లో పరకాలకు వెళ్లి తప్పుచేశామన్నారు కొండా సురేఖ. కానీ ఇకపై వరంగల్ లోనే ఉంటామని స్పష్టం చేశారు.