వైఎస్ వివేకాను చంపింది ఆ ఇద్దరేనా?
posted on Sep 10, 2021 @ 11:54AM
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాబాయ్, దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ సోదరుడు వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ కీలక పురోగతి సాధించిందని తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన ఈ కేసును దాదాపుగా సీబీఐ చేధించిందని అంటున్నారు. ఒకటి , రెండు రోజుల్లోనే హత్య కేసులో పూర్తి క్లారిటీ వస్తుందని చెబుతున్నారు. వివేకా హత్య కేసులో గత మూడు నెలలుగా విచారణ జరుపుతున్న సీబీఐ అధికారులు.. గురువారం గజ్జల ఉమా శంకర్ రెడ్డిని అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఇది అత్యంత కీలకమని తెలుస్తోంది.
కడప జిల్లా సింహాద్రిపురం మండలం సుంకేసులకు చెందిన గజ్జల ఉమాశంకర్‌రెడ్డి (45)ని గురువారం అరెస్టు చేసి పులివెందుల కోర్టులో హాజరుపరిచారు సీబీఐ అధికారులు. కోర్టు ఆయనకు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. వివేకా హత్య కేసులో సీబీఐ అధికారులు సునీల్ యాదవ్‌ను కీలక నిందితుడిగా పరిగణించి అరెస్టు చేశారు. 10 రోజులు తమ కస్టడీలో ఉంచుకుని విచారించారు. ఆ తర్వాత వివేకా ఇంటి వాచ్‌మెన్ రంగయ్య, డ్రైవర్ దస్తగిరి వాంగ్మూలాలు మేజిస్ట్రేట్ సమక్షంలో నమోదు చేశారు. ఇదే క్రమంలో గురువారం కడప కేంద్రకారాగారంలోని అతిథిగృహంలో సునీల్ యాదవ్ బంధువు భరత్‌కుమార్ యాదవ్‌ను, ఉమాశంకర్‌రెడ్డిని మరోసారి సుదీర్ఘంగా విచారించారు. సాయంత్రం 5.10 గంటల ప్రాంతంలో సీబీఐ అధికారులు ఉమాశంకర్‌రెడ్డిని అరెస్టు చేసి పులివెందుల సివిల్ కోర్టుకు తీసుకొచ్చారు.జడ్జి రిమాండ్ విధించడంతో కడప సెంట్రల్ జైలుకు తరలించారు. వివేకా హత్యకేసులో ఉమాశంకర్ పాత్రపై సునీల్, డ్రైవర్ దస్తగిరి వెల్లడించినట్లు తెలుస్తోంది.
వివేకా హత్యకు ముందే ఆయన ఇంట్లో కుక్కను సునీల్, ఉమాశంకర్ కలిసి కారుతో ఢీకొట్టి చంపారని విశ్వసనీయ వర్గాల సమాచారం. వివేకాను హత్య చేయడానికి వీరిద్దరూ బైకుపై వెళ్లారని తెలుస్తోంది. హత్య అనంతరం ఉమాశంకర్ బైకులో గొడ్డలి పెట్టుకుని పారిపోయాడని సీబీఐ అధికారుల విచారణలో వెల్లడైందని సమాచారం. నిందితుడు వాడిన బైకు, గొడ్డలిని సీబీఐ అధికారులు ఇప్పటికే స్వాధీనం చేసుకున్నారు. గుజరాత్ నుంచి ఫోరెన్సిక్ నివేదిక తెప్పించారు. గత నెల 11న ఉమాశంకర్ ఇంట్లో రెండు చొక్కాలు స్వాధీనం చేసుకున్నారు. మరికొందరు నిందితులను కూడా పట్టుకోవలసి ఉందని, హత్యకు వాడిర ఇతర ఆయుధాలనూ స్వాధీనం చేసుకోవాలని సీబీఐ భావిస్తోందని తెలుస్తోంది. ఈ సమాచారం రాబట్టేందుకు ఉమాశంకర్‌రెడ్డిని 5 రోజులు కస్టడీకి ఇవ్వాలని సీబీఐ పిటిషన్‌లో పేర్కొందని సమాచారం. ఉమా శంకర్ విచారణ తర్వాత వివేకా హత్య కేసులో పూర్తి స్పష్టత వస్తుందని భావిస్తున్నారు.