గుంటూరు జిల్లాలో మరో గ్యాంగ్ రేప్! ఏపీలో మహిళలకు రక్షణే లేదా?
posted on Sep 9, 2021 @ 11:32AM
ఆంధ్రప్రదేశ్ లో మహిళల రక్షణే లేకుండా పోతోంది. వరుస ఘటనలు జరుగుతున్నా పోలీసులు సీరియస్ గా స్పందించడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో అఘాయిత్సాలు జరుగుతూనే ఉన్నాయి. రమ్య ,అనూష ఘటనలు మరవకముందే గుంటూరు జిల్లాలో మరో దారుణం జరిగింది. సత్తెనపల్లి మండలంలో మరో గ్యాంగ్ రేప్ జరిగింది.
గుంటూరులో జరిగిన ఓ వివాహానికి హాజరైన సత్తెనపల్లి మండలానికి చెందిన దంపతులు గత రాత్రి బైక్‌పై తిరిగి బయలుదేరారు. ఈ క్రమంలో మేడికొండూరు అడ్డరోడ్డు సమీపంలో వారిని అడ్డగించిన దుండగులు మహిళ భర్తపై దాడిచేశారు. అనంతరం వివాహితను పొలాల్లోకి లాక్కెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అర్ధరాత్రి దాటాక బాధితులు సత్తెనపల్లి పోలీస్ స్టేషన్‌కు వెళ్లి తమ గోడు వెళ్లబుచ్చుకున్నారు.
అయితే ఈ ఘటన జరిగిన ప్రదేశం గుంటూరు అర్బన్ పరిధిలోకి వస్తుంది కాబట్టి ఫిర్యాదు తీసుకోబోమని పోలీసులు తేల్చి చెప్పినట్టు బాధితులు వాపోయారు. పోలీసుల తీరుతో బాధితులు నిరాశగా వెనుదిరిగారు. నిజానికి ఘటన ఎక్కడ జరిగినా తొలుత జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేయాలన్న ఆదేశాలు ఉన్నప్పటికీ పోలీసులు పట్టించుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తర్వాత విచారణ చేపట్టిన పోలీసులు పురోగతి సాధించారు. పాలడుగు దగ్గర కోల్డ్ స్టోరేజ్‌లో పనిచేసే 8 మంది కార్మికులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. వీరంతా ఒడిశా, విజయనగరానికి చెందిన యువకులుగా గుర్తించారు. నిందితులపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
మహిళలపై వరుసగా జరుగుతున్న అత్యాచారాలు, హత్యాచారాలు ఏపీలో కలకలం రేపుతున్నాయి. సత్తెనపల్లి ఘటనపై టీడీపీ నేత నారా లోకేశ్ మండిపడ్డారు. ముఖ్యమంత్రి జగన్ పాలనలో ఆంధ్రప్రదేశ్ అఘాయిత్యాలకు అడ్రస్ గా మారిందని లోకేశ్ విమర్శించారు. బైక్ పై వెళ్తున్న జంటపై దాడి చేసి, మహిళపై అమానుషానికి పాల్పడటం బాధాకరమని అన్నారు. ఫిర్యాదు చేయడానికి బాధితులు పోలీస్ స్టేషన్ కి వెళ్తే... అది తమ పరిధిలోకి రాదని పోలీసులు చెప్పడం దారుణమని మండిపడ్డారు. మహిళలపై వరుసగా అత్యాచారాలు జరుగుతున్నా ప్రభుత్వంలో ఏ మాత్రం చలనంలేదని అన్నారు. పరామర్శకు తాను వెళ్తుంటే వేలాది మంది పోలీసులను రంగంలోకి దించారని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం పోలీసులను కక్షసాధింపులకు ఉపయోగించుకుంటోందని... అందువల్లే ఇలాంటి దుస్థితి నెలకొందని చెప్పారు.