కల్లు తాగిన కోతుల్లా తాలిబన్లు.. అఫ్గన్‌లో అరాచకం..
posted on Sep 9, 2021 @ 5:19PM
భయపడినట్టే జరుగుతోంది. తాలిబన్ల పాలన మరోసారి భయపెడుతోంది. మహిళలు, జర్నలిస్టులపై దాడులకు తెగబడుతున్నారు. రాయబార కార్యాలయాల్లో చొరబడి పుస్తకాలు చింపేసి చిందర వందర చేసేస్తున్నారు. ఇంటర్నెట్ సేవలు బంద్ చేశారు. ఆందోళన కారులపై ఆంక్షలు విధిస్తున్నారు. మునపటిలానే షరియా చట్టాల ప్రకారమే పాలిస్తామని తేల్చి చెప్పేశారు తాలిబన్లు. త్వరలో కొలువుదీరనున్న కొత్త ప్రభుత్వంలో అంతర్జాతీయ స్థాయి ఉగ్రవాదులకు కీలక మంత్రి పదవులు కట్టబెట్టి.. ప్రపంచానికి టెర్రర్ మెసేజ్ పంపించారు తాలిబన్లు.
మంత్రి పదవి చేపట్టిన ఒక్కోడు ఒక్కో సైతాన్ లాంటోడు. ఉగ్రవాదులు, కిడ్నాపర్లు, హంతకులు, ఏళ్ల తరబడి జైళ్లలో మగ్గిన వారికి ప్రభుత్వంలో స్థానం లభించింది. ‘తాలిబన్ ఫైవ్’గా పేరున్న ఐదుగురు క్రూరమైన నాయకులకు కీలక పదవులు కట్టబెట్టారు. తాలిబన్ కొత్త ప్రభుత్వంలోని ఇంటెలిజెన్స్ డైరెక్టర్ అబ్దుల్ హక్ వాసిక్, బోర్డర్ అండ్ ట్రైబల్ అఫైర్స్ మినిస్టర్ నూరుల్లా నూర్, డిప్యూటీ డిఫెన్స్ మినిస్టర్ మహమ్మద్ ఫాజీ, సాంస్కృతిక సమాచార మంత్రి ఖైరుల్లా ఖైరాహ్, తూర్పు కొహెస్త్ ప్రావిన్స్ గవర్నర్‌గా నియమితులైన మహమ్మద్ నబీ ఒమర్. వీరంతా ‘తాలిబన్ ఫైవ్’గా పిలవబడే నరహంతకులు.
అఫ్గానిస్థాన్‌లో తాలిబన్ల అరాచక పాలన మొదలైంది. మహిళల ఆందోళనలను కవర్ చేస్తున్న జర్నలిస్టులను చిత్రహింసలకు గురి చేశారు తాలిబన్లు. తాలిబన్ల దాడిలో తీవ్రంగా గాయపడిన కొందరు జర్నలిస్టుల ఫొటోలు తాజాగా సోషల్‌మీడియాలో వైరల్ అవుతున్నాయి.
తాలిబన్లకు వ్యతిరేకంగా రాజధాని కాబుల్‌లో పెద్ద ఎత్తున నిరసనలు జరుగుతున్నాయి. దీంతో తాలిబన్ ఇంటెలిజెన్స్ విభాగం.. కాబుల్‌లోని పలు ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలను నిలిపివేసింది. ఆందోళనకారులు 24 గంటల ముందు నిరసనల కోసం అనుమతి తీసుకోవాలని ఆదేశించింది.
తాజాగా కాబూల్‌లోని నార్వే రాయబార కార్యాలయాన్ని స్వాధీనం చేసుకున్న తాలిబన్లు లోపలున్న వైన్ సీసాలను పగలగొట్టి, పుస్తకాలను ధ్వంసం చేయడంపై అంతర్జాతీయంగా విమర్శలు వస్తున్నాయి. తాలిబన్ల తీరుపై ప్రపంచవ్యాప్తంగా ఆందోళన వ్యక్తం అవుతోంది.