ఆరేండ్ల బాలికపై హత్యాచారం.. పండుగ పూట హైదరాబాద్ లో ఘోరం..
posted on Sep 10, 2021 @ 11:26AM
వినాయక చవిత పర్వదినం రోజున హైదరాబాద్ లో దారుణం జరిగింది. సైదాబాద్ లో తీవ్ర కలకలం చెలరేగింది. గురువారం సింగరేణి కాలనీలోని ఆరేళ్ల బాలిక అదృశ్యమైంది. ఆమె కోసం వెతకగా చివరకు ఆమె పక్కింట్లో నివసించే రాజు అనే యువకుడి ఇంట్లో మృతదేహం లభ్యమైంది. అప్పటికే రాజు ఆ ఇల్లు వదిలి పారిపోయాడు. బాలికపై రాజు అత్యాచారానికి పాల్పడి, ఆ తర్వాత చంపేసి, అక్కడి నుంచి పారిపోయాడని స్థానికులు ఆరోపణలు చేస్తున్నారు.
పొట్టకూటి కోసం నల్గొండ జిల్లా చందం పేట నుంచి నగరానికి వలస వచ్చింది ఆ బాలిక కుటుంబం. ఇంట్లో ఆడుతూ..పాడుతూ..కనిపించిన బాలిక గంటల తరబడి కంటకనిపించలేదు. సాయంత్రం అయినా చిన్నారి కనిపించకపోవడంతో బాలిక ఆచూకీ కోసం 2 గంటలపాటు తల్లిదండ్రులు వెతికినా లభించలేదు. దీంతో చిన్నారి ఇంటి పక్కనే ఉండే రాజుపై అనుమానంతో అర్ధరాత్రి 12 గంటలకు రాజు ఇంట్లో చూడగా చిన్నారి మృతదేహం లభ్యమైంది. చిన్నారి బాలికపై అత్యాచారం చేసి నిందితుడు హత్య చేశాడు.
పోలీసులతో అక్కడి స్థానికులు వాగ్వాదానికి దిగారు. నిందితుడిని వెంటనే తమకు అప్పగించాలని డిమాండ్ చేశారు. దీంతో పోలీసులు, స్థానికుల మధ్య తోపులాట జరిగింది. ఆగ్రహం వ్యక్తం చేసిన స్థానికులు పోలీసులపై రాళ్లు రువ్వి, కారం చల్లారు. దాడిలో పలువురు పోలీసులకు గాయాలయ్యాయి. పరిస్థితి అదుపు దాటిపోతుండటంతో కాలనీలో భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.ఎలాంటి అవాంఛనీయ ఘటన చోటు చేసుకోకుండా చర్యలు తీసుకుంటున్నారు.
శుక్రవారం ఉదయం నుంచి సింగరేణి కాలనీ వాసులు చంపాపేట్ రహదారిపైకి వచ్చి ధర్నాకు దిగారు. దీంతో పోలీసులు, కాలనీ వాసులకు మధ్య వాగ్వివాదం కొనసాగుతోంది. బాలికను హత్య చేసిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. బాలిక కుటుంబానికి న్యాయం చేయాలని కాలనీవాసులు ఆందోళన చెందుతున్నారు. ఆందోళనకారులతో మాట్లాడి తక్షణ సాయం కింద కలెక్టర్ రూ.50 వేలు అందజేశారు. చంపాపేట్ రహదారిపై పోలీసులు భారీగా మోహరించారు.