సొంత చెల్లినే రోడ్డున పడేశాడు.. జనానికేం చేస్తడు! జగన్ పై నారా లోకేష్ ఫైర్..
posted on Sep 9, 2021 @ 6:29PM
తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నర్సరావుపేట పర్యటన హై టెన్షన్ పుట్టించింది. లోకేష్ ను గన్నవరం ఎయిర్ పోర్టులోనే పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు. లోకేష్ ను అదుపులోనికి తీసుకునే సమయంలో పోలీసులు అత్సుత్సాహం ప్రదర్శించారు. తనను ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశిస్తున్న లోకేష్ చేయి పట్టి కారులో నుంచి లాగేశారు పోలీసులు. తనపై పోలీసులు వ్యవహరించిన తీరుపై లోకేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ రెడ్డి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
ఆంధ్రప్రదేశ్ లో మహిళలకు రక్షణ లేదని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ అన్నారు. లేని దిశ చట్టాన్ని ఉందని మహిళలను వైసీపీ మోసం చేస్తోందని తెలిపారు. సొంత చెల్లికే న్యాయం చేయలేని జగన్.. ప్రజలకేం చేస్తారని ప్రశ్నించారు. జగన్ నివాసం సమీపంలోనే మహిళలపై ఎన్నో ఘోరాలు జరిగాయని గుర్తు చేశారు. మహిళలపై ఇన్ని దాడులు జరుగుతున్నా.. వైసీపీ మేలుకోవడం లేదని చెప్పారు. ఫిర్యాదు చేసేందుకు వెళ్తోన్న మహిళలపై పోలీసులు దురుసుగా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. బాధిత కుటుంబాలకు ఇప్పటివరకు న్యాయం చేయలేదన్నారు.
అక్రమ కేసులతో టీడీపీ నేతలను హింసిస్తున్నారని లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్తే ఎందుకు భయపడుతున్నారని, దిశ చట్టం ద్వారా నిందితులను ఎందుకు శిక్షించలేకపోతున్నారని లోకేష్ ప్రశ్నించారు. అక్రమ కేసులతో టీడీపీ నేతలను హింసిస్తున్నారని లోకేష్ ఆరోపించారు. పోలీసులతో మా పోరాటాన్ని ఆపలేరు. మొత్తం 517 బాధిత కుటుంబాలను కలిసి తీరుతానని లోకేష్ ప్రకటించారు.
నరసరావుపేట పర్యటనకు వెళుతున్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ను గన్నవరం ఎయిర్ పోర్టులోనే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తనపై ఎలాంటి కేసులు లేవని ఎందుకు అదుపులోకి తీసుకున్నారని లోకేష్ వేసిన ప్రశ్నలకు పోలీసులు సమాధానం చెప్పలేక మౌనం వహించారు. అనవసరంగా తన పర్యటనను రాద్దాంతం చేస్తున్నారంటూ పోలీసుల తీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే నరసరావుపేట పర్యటనకు అనుమతి లేదని పోలీసులు చెప్పారు. నారా లోకేశ్ ను ఉండవల్లిలోని ఆయన నివాసానికి తరలించారు. అనుమతి లేకుండా జాతీయ రహదారిపై ర్యాలీగా వచ్చారని పోలీసులు పేర్కొంటూ 41ఏ సీఆర్పీసీ నోటీసులు ఇచ్చారు. శాంతిభద్రతలకు ఆటంకం కలిగించారని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు.