కమలదళం పంచ తంత్రం.. యూపీకి స్పెషల్ టీమ్
posted on Sep 10, 2021 @ 11:26AM
ఉత్తర ప్రదేశ్ సహా ఐదు రాష్ట్రాలలో వచ్చే సంవత్సరం (2022)లో జరిగే అసెంబ్లీ ఎన్నికల కోసం, కమల దళం, బీజేపీ అన్ని విధాలా సమయత్తమవుతోంది. నిజానికి రెండు మూడు నెలల ముందే వివిధ స్థాయిల్లో సమీక్షలు, సమాలోచనలు చేసిన బీజేపీ జాతీయ నాయకత్వం..ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రంలో క్షేత్ర స్థాయి పరిస్థితులను అధ్యయనం చేసి, కార్యప్రణాళిక, రోడ్ మ్యాప్ సిద్దం చేసుకుంది. ఎన్నికలకు సిద్దమవుతున్న రాష్ట్రాలకు, ఎన్నికల ఇంచార్జీలను నియమించింది.
అసెంబ్లీ ఎన్నికలు జరిగే ఐదు రాష్టాలకు గాను, మూడు రాష్ట్రలలో బీజేపీ అధికారంలో ఉంది. ఈ మూడు రాష్ట్రాలలో అధికారాన్ని నిలబెట్టుకోవడం, పార్టీ భవిష్యత్ ప్రస్థానానికి చాలా చాలా అవసరం. ఒక విధంగా ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు, 2024 సార్వత్రిక ఎన్నికలకు దిక్సూచిగా నిలుస్తాయని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. అందుకే ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రంలో పక్కా ప్రణాళికతో బీజేపీ ముందుకు పోతోంది.అన్నిటికంటే ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలను బీజేపీ నాయకత్వం మరింత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.
గత (2017) అసెంబ్లీ ఎన్నికల్లో మూడింట రెండు వంతుల మెజారిటీతో విజయం సాధించిన యూపీలో బీజేపీకి ఇప్పుడు పరిస్థితులు అంత అనుకూలంగా లేవు. కరోనా సెకండ్ వేవ్ కట్టడి చేయడంలో ముఖ్యమంత్రి యోగీ ఆదిత్య నాథ్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందనే భావన ప్రజలలో బలంగా ఏర్పడింది. యోగీ పాలనపట్ల ప్రజల్లోనే కాదు, పార్టీలోనూ తీవ్ర వ్యతిరేకత ఉందని జాతీయ మీడియాలో కూడా అనేక కథనాలు వచ్చాయి. చివరకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా యోగీ పాలన పట్ల అసంతృప్తిని వ్యక్త చేసినట్లు వార్తలొచ్చాయి. ఒక దశలో ముఖ్యమంత్రిని మారుస్తారని కూడా రాజకీయ, మీడియా వర్గాల్లో ప్రచారం జరిగింది. బీజేపీ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తోన్న ఉత్తరప్రదేశ్ ఎన్నికల బాధ్యతల కోసం ఏకంగా ఐదుగురు కేంద్ర మంత్రులను రంగంలోకి దించింది.
కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్రప్రధాన్ కు యూపీ ఎన్నికల బాధ్యతలు అప్పగించారు. ఆయన్ని రాష్ట్ర ఎన్నికల ఇంచార్జీగా నియమించారు. కేంద్రమంత్రులు అనురాగ్ ఠాకూర్, అర్జున్ రాం మేఘ్‌వాల్, శోభ కరంద్లాజే, అన్నపూర్ణదేవి యాదవ్‌లతో పాటు ఎంపీ సరోజ్ పాండే, హరియాణా మాజీ మంత్రి అభిమన్యులను సహా ఇంచార్జీలుగా పార్టీ ప్రకటించింది. అదే విధంగా ప్రాంతాల, రీజియన్ల వారీగా సంస్థాగత ఇంచార్జీలను నియమించింది. లోక్‌సభ ఎంపీ సంజయ్ భాటియాకు పశ్చిమ యూపీ, పార్టీ జాతీయ ఉప కోశాధికారి సుధీర్ గుప్తాకు కాన్పూర్ బాధ్యతలు అప్పగించింది. గోరఖ్‌పూర్ ఎన్నికల ప్రచారాన్ని పార్టీ జాతీయ కార్యదర్శి అరవింద్ మేనన్ పర్యవేక్షించనున్నారు.
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు ఒక్క బీజేపీకి మాత్రమే కాదు అన్ని పార్టీలకు కీలకమే. ఒక విధంగా యూపీ అసెంబ్లీ ఎన్నికలను అన్ని పార్టీలు, 2024 లోక్‌సభ ఎన్నికల ముందు జరికే సెమీఫైనల్ పోల్ గా భావిస్తున్నాయి. యూపీలో గెలిస్తే, కేంద్రలో బీజేపీకి హ్యాట్రిక్ ఖాయమైనట్లే అని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. దేశంలోనే అత్యధికంగా 80 మంది లోక్‌సభ సభ్యులున్న రాష్ట్రం ఉత్తర ప్రదేశ్. అందుకే, ఢిల్లీ పీఠాన్ని చేరేందుకు యూపీ దగ్గరి దారి అనేది నెహ్రూ కాలం నుంచి నానుడిగా నిలిచి పోయింది. ఒక విధంగా ఇది రుజువుతున్న నిజం. అందుకే లోక్ సభ ఎన్నికలలో విజయానికి, యూపీ అసెంబ్లీ ఎన్నికలు తొలి మెట్టు అంటారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ అఖండ విజయం సాధించిన కమల దళం, 2019 లోక్ సభ ఎన్నికల్లోనూ అదే జోరు కొనసాగించింది, లోక్ సభలో ఏకంగా 300 మార్కును దాటేసింది. అందుకే, వచ్చే ఏడాది జరగబోయే ఎన్నికల్లోనూ జయకేతనం ఎగురవేసేందుకు కాషాయ పార్టీ ఇప్పటి నుంచే వ్యూహాలు రచిస్తోంది. కాంగ్రెస్, ఎస్పీ, బీస్పీ వేటికవి ఒంటరి పోరాటానికి సిద్దమవుతున్నాయి. ఇది ఒక విధంగా బీజేపీకి అనుకూలించే అంశంగా భావిస్తున్నారు.
ఇక పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు కూడా వచ్చే ఏడాదే జరగనున్నాయి. అయితే ఈ రాష్ట్రంపై కమలదళానికి అంతగా పట్టులేదు. ఆశలు కూడా లేవు. అయితే అధికార కాంగ్రీస్ పార్టీకి గట్టి పోటీ ఇచ్చేందుకు పార్టీ గట్టి ప్రయత్నాలే చేస్తోంది. రాష్ట్ర బాధ్యతలను అధిష్ఠానం కేంద్రమంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌కు అప్పగించింది. కేంద్రమంత్రులు హర్‌దీప్‌సింగ్ పురి, మీనాక్షి లేఖి, లోక్‌సభ ఎంపీ వినోద్ చావ్డా సహా ఇంచార్జీలుగా నియమించింది. పంజాబ్’లో ప్రస్తుతం కాంగ్రెస్ అధికారంలో ఉన్నా, అంతర్గత కుమ్ములాటలతో పార్టీ సతమతమవుతోంది. అయినా, గతంలో అకాలీదళ్ తో కలిసి సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న బీజేపీ ఇప్పుడు అనివార్యంగా ఒంటరి పోరుకు సిద్దమవుతోంది. కేంద్ర చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో నెలల తరబడి సాగుతున్న ఆందోళన కారణంగా బీజేపీ తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కుంటోంది.
మణిపూర్ అసెంబ్లీ ఎన్నికల బాధ్యతలను కేంద్రమంత్రి భూపేంద్రయాదవ్‌కు అప్పగించారు. మరో కేంద్రమంత్రి ప్రతిమా భౌమిక్, అసోం మంత్రి అశోక్ సింఘాల్ కో-ఇన్‌ఛార్జ్‌లు వ్యవహరిస్తారు. ఉత్తరాఖండ్ ఎన్నికల ఇన్‌ఛార్జ్‌గా ప్రహ్లాద్ జోషీ నియమితులయ్యారు. ఆయన నేతృత్వంలో ఎంపీ లాకెట్ ఛటర్జీ, పార్టీ అధికార ప్రతినిధి ఆర్పీ సింగ్ కో-ఇన్‌ఛార్జ్‌లు పనిచేయనున్నారు. అసెంబ్లీ ఎన్నికలు జరిగే ఐదో రాష్ట్రం గోవాకు ఇంకా నియామకాలు జరగలేదు. ఏది ఏమైనా, వచ్చే సంవత్సరం జరిగే అసెంబ్లీ ఎన్నికలు బీజేపీకే కాదు, కాంగ్రెస్ పార్టీకి కూడా అత్యంత కీలకం. ఒక విధంగా కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ తేల్చే ఎన్నికలుగా కూడా భావించవచ్చని పరిశీలకులు భావిస్తున్నారు.