తీన్మార్ మల్లన్నపై 31 కేసులు.. కేసీఆర్ అంతలా భయపడుతున్నారా?
posted on Sep 9, 2021 @ 1:47PM
కేసీఆర్ భయపడేది ఇద్దరే ఇద్దరికని అంటారు. ఒకరు రేవంత్‌రెడ్డి.. మరొకరు తీన్మార్ మల్లన్న. రేవంత్‌రెడ్డి బహిరంగ వేదికలు, ప్రెస్‌మీట్లతో కేసీఆర్‌ను కుమ్మేస్తుంటే.. తీన్మార్ మల్లన్న క్యూ-న్యూస్ యూట్యూబ్ ఛానెల్‌తో కేసీఆర్ సర్కారును కుళ్లబొడుస్తుంటారు. ముఖ్యమంత్రిని, మంత్రులను, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, టీఆర్ఎస్ నేతలు.. ఇలా ఏ ఒక్కరినీ వదలకుండా మాటలు, తిట్లతో తూట్లు పొడుస్తుంటారు. అందుకే మల్లన్న ఛానెల్‌ను ఎన్నిసార్లు మూసేయించినా.. మళ్లీ మరో పేరుతో అదే దూకుడు ప్రదర్శిస్తుంటారు. మిలియన్ల కొద్దీ సబ్‌స్క్రైబర్స్‌తో.. రోజూ లక్షల్లో వ్యూస్‌తో.. కేసీఆర్ వ్యతిరేకులందరికీ మంచి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌గా మారింది క్యూ-న్యూస్. ఇక తీన్మార్ మల్లన్న వారందరికీ హీరో. తెలంగాణలో తిరుగులేని పాపులారిటీ. ఇంకా చెప్పాలంటే రాష్ట్రంలో కేసీఆర్ కంటే మల్లన్నకే ఎక్కువ ఫ్యాన్స్ ఉంటారంటే నమ్మాల్సిందే. అందుకే, ఇటీవల ఎమ్మెల్సీగా పోటీ చేస్తే.. గ్రాడ్యూయేట్లు తీన్మార్ మల్లన్నను విశేషంగా ఆదరించారు. కేసీఆర్ పార్టీకి ముచ్చెమటలు పట్టించారు. కొద్దిలో సెకండ్ ప్లేస్‌కు పరిమితమయ్యారు. లేదంటేనా.. ఈపాటికి మల్లన్న మరో లెవెల్‌లో ఉండేవారు.
జనాల్లో మల్లన్న పాపులారిటీ చూసి.. అప్పటి నుంచి ఆయన్ను మరింత టార్గెట్ చేశారని అంటారు. ఏదో ఒక కేసుతో.. క్యూ-న్యూస్‌ను క్లోజ్ చేసి.. మల్లన్నను మూసేయాలని సర్కారు లక్ష్యంగా పెట్టుకుందని చెబుతారు. అందుకే, ఓ బెదిరింపు కేసులో ఆయన్ను వారాల తరబడి జైల్లోనే ఉంచేస్తున్నారు. బెయిల్ రాకుండా చేసేందుకు సర్కారు పకడ్బందీ కేసులు బనాయిస్తోందని అంటున్నారు. ఇదే మంచి ఛాన్స్ అంటూ క్యూ-న్యూస్ ఆఫీసుపై పలుమార్లు పోలీసులు తనిఖీలు చేసి.. అనేక కంప్యూటర్లు, హార్డ్‌డిస్క్‌లు స్వాధీనం చేసుకున్నారు.
తీన్మార్ మల్లన్న బయటకు వస్తే.. అందరికంటే కేసీఆర్‌కే ఎక్కువ డ్యామేజ్. అందుకే, ఆయనపై కేసులపై కేసులు నమోదు చేసి.. సాధ్యమైనంత కాలం జైల్లోనే ఉంచేలా ప్లాన్ చేస్తున్నారని అనుమానిస్తున్నారు. మల్లన్నపై ఇప్పటి వరకూ 31 కేసులు నమోదు చేశారు పోలీసులు. ఆ కేసుల వివరాలు ఇలా ఉన్నాయి....
ఇక తాజాగా తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్‌కుమార్‌ను సైబర్ క్రైం పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. మల్లన్నను ఒక్కరోజు కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోర్టును కోరగా.. ధర్మాసనం ఆ మేరకు అనుమతిచ్చింది. ఈ క్రమంలో ఆయనను హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు ప్రశ్నిస్తున్నారు.
మరోవైపు, మల్లన్నకు పార్టీలకు అతీతంగా వివిధ ప్రముఖుల నుంచి మద్దతు లభిస్తోంది. బీజేపీ నేత, వీ6 ఛానెల్, వెలుగు పేపర్ అధినేత వివేక్ వెంకటస్వామి మల్లన్న ఇంటికెళ్లి ఆయన కుటుంబ సభ్యులతో మాట్లాడారు. అంతకుముందు కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క సైతం మల్లన్న కుటుంబ సభ్యులను కలిసి మద్దతు ప్రకటించారు. ఇలా అన్ని వర్గాల నుంచి తీన్మార్ మల్లన్నకు సపోర్ట్ లభిస్తుండటంతో సర్కారులో ఫ్రస్టేషన్ మరింత పెరిగిపోతున్నట్టుంది.