అమరావతి రైతుల పాదయాత్రపై కుట్రలా? పోలీసుల ఆంక్షలతో పర్చూరులో ఉద్రిక్తత..
posted on Nov 7, 2021 @ 10:48AM
నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణం రాజు చెప్పినట్లే జరుగుతోంది. అమరావతి రైతుల మహా పాదయాత్రకు అడ్డంకులు స్పష్టించే కుట్రలు జరుగుతున్నాయని ఆయన చెప్పిన కొన్ని గంటల్లోనే అలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. రాజధాని రైతుల మహాపాదయాత్రకు ప్రకాశం జిల్లా పోలీసుల ఆంక్షలు విధించారు. పర్చూరులో కొల్లా వెంకట నారాయణ కళ్యాణ మండపం దగ్గర పాదయాత్ర చేస్తున్న రైతుల వద్దకు జిల్లా అడిషనల్ ఎస్పీ రవిచంద్ర, చీరాల డీఎస్పీ శ్రీకాంత్, చీరాల రూరల్ సీఐ రోశయ్య తదితరులు వచ్చారు.
పాదయాత్రలో అనుసరించాల్సిన 20 నియమాలను సీఐ రోశయ్య చదివి వినిపించారు. కార్యక్రమాన్ని కవర్ చేసేందుకు వచ్చిన మీడియాపై కూడా ఆంక్షలు విధించారు. మీడియా హాల్టింగ్ ప్రదేశాల్లో మాత్రమే కార్యక్రమాన్ని కవర్ చేయాలని ఆదేశించారు. నిబంధనలు అతిక్రమిస్తే హైకోర్టుకు నివేదిస్తామని, పాదయాత్రను నిలిపివేస్తామని పోలీసులు చెప్పారు. నిబంధనలు ఉల్లంఘిస్తున్నారంటూ పాదయాత్ర నిర్వాహకులను పోలీసులు మరోసారి హెచ్చరించారు. అయితే హైకోర్టు ఆదేశాల మేరకే యాత్ర సాగుతోందని ఐకాస నాయకులు ఆయనకు తెలిపారు. ఎవరైనా వచ్చి సంఘీభావం తెలిపితే తమకు సంబంధం లేదని నిర్వాహకులు వివరించారు.
అమరావతినే ఏపీ ఏకైక రాజధానిగా కొనసాగించాలంటూ రాజధాని రైతులు, మహిళలు చేపట్టిన అమరావతి ‘మహాపాదయాత్ర’ ఏడో రోజు కొనసాగుతోంది. ఆదివారం పర్చూరు నుంచి ఇంకొల్లు వరకు సుమారు 17 కిలోమీటర్ల మేర యాత్ర సాగనుంది. మూడు రాజధానులు, సీఆర్డీఏ రద్దుకు వ్యతిరేకంగా చేస్తున్న ఈ పోరాటానికి వివిధ రాజకీయ పార్టీల నేతలు, ప్రజల నుంచి మద్దతు లభిస్తోంది. దీంతో పాదయాత్రలో పోలీసులు భారీగా మోహరించారు.
కార్తిక సోమవారం సందర్భంగా సోమవారం పాదయాత్రకు విరామం ప్రకటించారు. యథావిధిగా మంగళవారం నుంచి మళ్లీ సాగనుంది. 45 రోజుల పాటు సాగనున్న యాత్ర తిరుమలలో ముగియనుంది.