కోహ్లీ సేనకు షాక్... ఆప్ఘన్ పై గెలుపుతో సెమీస్ కు కివీస్..
posted on Nov 7, 2021 @ 8:03PM
భారత అభిమానుల ఆశలు అడియాశలయ్యాయి. కోహ్లీసేన టీట్వంటీ వరల్డ్ కప్ నుంచి లీగ్ దశలోనే నిష్క్రమించింది. ఆప్ఘనీస్తాన్ గెలుపుపైనే భారత ఆశలు పెట్టుకోగా.. అది నెరవేరలేదు. ఆదివారం జరిగిన మ్యాచ్ లో ఆప్ఘనీస్తాన్ పై న్యూజీలాంగ్ ఈజీగా విక్టరీ కొట్టింది. దీంతో ఇంకో మ్యాచ్ మిగిలి ఉండగానే వరల్డ్ కప్ నుంచి కోహ్లీ సేన నిష్క్రమణ ఖాయమైంది. సోమవారం నమీబియాతో భారత్ పోరు నామమాత్రంగా మిగిలిపోయింది.
టీమ్‌ఇండియా ఆశలను చిదిమేస్తూ.. అఫ్గానిస్థాన్ మీద విజయంతో న్యూజిలాండ్ సెమీస్‌లోకి దూసుకెళ్లింది. సెమీస్‌కు వెళ్లాలంటే తప్పక నెగ్గాల్సిన మ్యాచ్‌లో న్యూజిలాండ్ అన్ని విభాగాల్లో రాణించి అఫ్గానిస్థాన్‌ను 8 వికెట్ల తేడాతో చిత్తు చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్గాన్ 124 పరుగులకే కట్టడి చేసిన కివీస్.. అనంతరం కేవలం రెండు వికెట్లను మాత్రమే కోల్పోయి 18.1 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ (40), కాన్వే (36), మార్టిన్ గప్తిల్ (28), మిచెల్ (17) రాణించడంతో స్వల్ప లక్ష్యాన్ని పూర్తి చేసింది. దీంతో గ్రూప్-2లో రెండో స్థానంతో సెమీస్‌కు చేరుకుంది. అఫ్గాన్ బౌలర్లలో ముజీబ్, రషీద్ ఖాన్ చెరో వికెట్ తీశారు.
మొదట బ్యాటింగ్ చేసిన అఫ్గాన్ 124 పరుగులు చేసింది. నజీబుల్లా జద్రాన్ అద్బుతంగా ఆడి 73 పరుగులు చేశాడు. అఫ్గాన్‌కు శుభారంభం దక్కలేదు. ఓపెనర్లు మహమ్మద్ షహజాద్ (4), హజ్రతుల్లా జజాయ్ (2)తోపాటు వన్‌డౌన్ బ్యాటర్ గుర్బాజ్ (6) విఫలమయ్యారు. అనంతరం వచ్చిన నయీబ్ (15)తో కలిసి నజీబుల్లా ఇన్నింగ్స్‌ను నిలబెట్టేందుకు ప్రయత్నించాడు. ఈ ఇద్దరూ కుదురుకుంటున్న సమయంలో నయీబ్‌ను సోధి క్లీన్‌బౌల్డ్ చేశాడు. తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన కెప్టెన్ నబీ (14) దూకుడుగా ఆడలేకపోయినా నజీబుల్లాకు చక్కటి సహకారం అందించాడు. అయితే స్వల్ప వ్యవధిలో మూడు వికెట్లను కోల్పోవడంతో అఫ్గాన్ మళ్లీ కష్టాల్లో పడింది. 115/4తో ఉన్న అఫ్గాన్ ఇన్నింగ్స్‌ను న్యూజిలాండ్ బౌలర్లు దెబ్బతీశారు. నబీ, నజీబుల్లా, కరీమ్ (2)ను స్వల్ప వ్యవధిలో పెవిలియన్‌కు చేర్చారు. దీంతో అఫ్గానిస్థాన్ అనుకున్నంత స్కోరును సాధించలేకపోయింది. కివీస్ బౌలర్లలో బౌల్ట్ 3, సౌథీ 2.. మిల్నే, సోధి, నీషమ్ తలో వికెట్ తీశారు.