చిల్లరగా మాట్లాడితే నాలుక కోస్తాం... విపక్షాలకు కేసీఆర్ వార్నింగ్
posted on Nov 7, 2021 @ 7:12PM
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చాలా రోజుల తర్వాత ఉగ్రరూపం చూపించారు. విపక్షాలపై ఓ రేంజ్ లో ఫైరయ్యారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో బీజేపీ చిల్లర రాజకీయాలు చేస్తుందని కేసీఆర్ మండిపడ్డారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్ర ప్రభుత్వం బాధ్యతా రాహిత్యంగా వ్యవహరిస్తుందని అన్నారు. రైతులతో పంట మార్పిడి చేయించాలని కేంద్రమే చెప్పిందని కేసీఆర్ చెప్పారు. ఈ నేపథ్యంలో యాసంగిలో ఎలాంటి పంటలు వేయాలో శాస్త్రవేత్తలతో చర్చించి, అందుకు అనువైన విత్తనాలు కూడా తెప్పించామని అన్నారు.యాసంగి ధాన్యంలో తాలు, నూకలు ఎక్కువగా వస్తాయని, యాసంగి ధాన్యం నాణ్యంగా ఉండడంలేదని ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్ సీఐ) చెబుతోందని తెలిపారు. యాసంగిలో రా రైస్ మాత్రమే కొంటామని, బాయిల్డ్ రైస్ కొనలేమని చెబుతోందని వివరించారు. ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం అనేక అభ్యంతరాలు పెడుతోందని సీఎం కేసీఆర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. బాయిల్డ్ రైస్ కొనుగోలు చేసేది లేదని కేంద్రం కరాఖండిగా చెబుతోందని స్పష్టం చేశారు.
ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం రోజుకోమాట చెబుతోందని మండిపడ్డారు. అందుకే ప్రత్యామ్నాయ పంటలు వేయాలని రైతులకు చెబుతున్నామని, వేరుశనగ, చిరుధాన్యాలతో మంచి లాభాలు వస్తున్నాయని పేర్కొన్నారు."పరిస్థితి ఇలా ఉంటే రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు అత్యంత బాధ్యతా రాహిత్యంతో మాట్లాడుతున్నాడు. మీరు వరి పంటనే వేయండి... ప్రభుత్వం మెడలు వంచి పంటను కొనిపిస్తాం అంటూ రైతులకు చెబుతున్నాడు. ఎవరి మెడలు వంచుతాడు? ఆయనే మెడ వంచుకుంటాడా? లేక కేంద్రం మెడలు వంచుతాడా? ఈయన ఓ ఎంపీ. చాలారోజుల నుంచి ఇలాగే మాట్లాడుతున్నాడు. కానీ క్షమిస్తున్నా. నా స్థాయికి తగిన మనిషి కాదు.. నాకంటే చిన్నవాడు. నా మీద వ్యక్తిగతంగా మాట్లాడుతున్నా, కుక్కలు మొరుగుతున్నాయని పట్టించుకోలేదు.
కానీ ఏడేళ్లుగా మేం రైతుల కోసం చేస్తున్న కృషిని దెబ్బతీసేలా, రైతులను తప్పుదోవపట్టించేలా వ్యవహరిస్తుండడంతోనే స్పందించాల్సి వస్తోంది. ఈ పనికిమాలిన మాటలు నమ్మి వరి పంట వేస్తే చాలా కష్టం. వరి కొనబోమని కేంద్రం తెగేసి చెబుతోంది. రైతులను కాపాడుకునే బాధ్యత మా పైన ఉంది కాబట్టే ఇవాళ రైతులకు విన్నవిస్తున్నాం. రైతులు నష్టపోరాదనే వరి వద్దని మంత్రి చెప్పారు" అని కేసీఆర్ వివరించారు.యాసంగిలో వరి వద్దని వ్యవసాయ శాఖ మంత్రి చెప్పారన్నారు. రైతులు నష్టపోతారనే ఉద్దేశంతో మంత్రి వరి వద్దన్నారన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాడు రైతుల ఆత్మహత్యలు, చాలా కకావికలమైన వ్యవసాయం, వలసలు, పాలమూరు, నల్లగొండ, మెదక్ జిల్లాల నుంచి రైతులు కూడా కూలి పనుల కోసం హైదరాబాద్‌కు రావడం.. దారుణ పరిస్థితులుండేవన్నారు.
రాష్ట్ర సాధన జరిగిన తర్వాత ప్రజలు రాష్ట్రాన్ని తీర్చిదిద్దే అవకాశాన్ని అధికార రూపంలో కట్టబెట్టారన్నారు. స్థిరమైన లక్ష్యంతో, నిర్ణయాత్మకమైన పద్ధతిలో ఈ రాష్ట్రంలో గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పరిపుష్టం చేయాలని, వ్యవసాయాన్ని స్థిరీకరించాలి.. పల్లెలు చల్లగా ఉండేటట్లు చేయాలి.. వృత్తి పనులందరికీ పనులు దొరకాలని అనే స్పష్టమైన పాలసీని తీసుకున్నామన్నారు. ఆ దిశలో బలమైన అడుగులు రాష్ట్ర ప్రభుత్వం వేసిందన్నారు. అందులో మొట్టమొదట మొదలు పెట్టింది.. అడుగంటి పోయిన భూగర్భ జలాలను పెంచేందుకు.. మిషన్ కాకతీయ పేరిట చెరువులను అద్భుతంగా తీర్చిదిద్దామన్నారు.