టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థులు ఖరారు.. సీనియర్లపై కేసీఆర్ పెద్దపీట
posted on Nov 6, 2021 @ 7:42PM
ఎమ్మెల్సీ సీట్ల కోసం టీఆర్ఎస్ లో తీవ్ర పోటీ ఉంది. శాసనమండలి ఖాళీల భర్తీపై సుదీర్ఘ కసరత్తు చేసిన సీఎం కేసీఆర్.. ఏడు పేర్లను ఖరారు చేసినట్లు తెలుస్తోంది. మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, అసెంబ్లీ మాజీ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి, వరంగల్ జిల్లాకు చెందిన సీనియర్ నేత, రవీందర్ రావు, కరీంనగర్ జిల్లాకు చెందిన పాడి కౌశిక్ రెడ్డి, నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ కు చెందిన ఎంసీ కోటిరెడ్డి, ఎల్ రమణను ఎమ్మెల్యేల కోటాలో శాసనమండలి పంపాలని కేసీఆర్ నిర్ణయించారని సమాచారం.
శాసనమండలి మాజీ చైర్మెన్ గుత్తా సుఖేందర్ రెడ్డిని గవర్నర్ కోటాలో ఖరారు చేశారు సీఎం కేసీఆర్. నిజానికి గవర్నర్ కోటాలో ఖాళీ అయిన స్థానాన్ని పాడి కౌశిక్ రెడ్డికి ఇస్తున్నట్లు గత జూలైలో కేసీఆర్ ప్రకటించారు. కౌశిక్ రెడ్డి పేరును ప్రతిపాదిస్తూ కేబినెట్ తీర్మానం చేసి గవర్నర్ కు పంపింది. అయితే కౌశిక్ రెడ్డి ఎమ్మెల్సీ ఫైలును గవర్నర్ తమిళిసై పెండింగులో పెట్టారు. కౌశిక్ రెడ్డిపై కేసులు పెండింగులో ఉన్నాయన్న ఫిర్యాదులు రావడంతోనే గవర్నర్ ఆమోదముద్ర వేయలేదని తెలుస్తోంది. గవర్నర్ కోటాలో కౌశిక్ రెడ్డి ఎమ్మెల్సీకి గ్రీన్ సిగ్నల్ రాకపోవడంతో కేసీఆర్ మరో ఆలోచన చేసినట్లు కనిపిస్తోంది. కౌశిక్ రెడ్డిని ఎమ్మెల్యే కోటాలో ఎంపిక చేసి.. గవర్నర్ కోటాలో గుత్తా సుఖేందర్ రెడ్డిని ఎంపిక చేశారని తెలుస్తోంది.
ఏడు ఎమ్మెల్సీ సీట్ల భర్తీలో ఉమ్మడి నల్గొండ, వరంగల్, కరీంనగర్ జిల్లాలకే ప్రాధాన్యత దక్కడం ఆసక్తిగా మారింది. ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎంసీ కోటిరెడ్డికి ఛాన్స్ దక్కింది. నాగార్జున సాగర్ ఉపఎన్నికలో పార్టీ టికెట్ ఆశించారు కోటిరెడ్డి. అయితే దివంగత ఎమ్మెల్యే నర్సింహయ్య తనయుు నోముల భగత్ కు టికెట్ ఇచ్చిన కేసీఆర్.. ఎంసీ కోటిరెడ్డిని మండలికి పంపిస్తానని హామీ ఇచ్చారు. అప్పటి హామీ మేరకు ఈసారి కోటిరెడ్డికి ఎమ్మెల్సీ ఖరారు చేశారు. ఇక ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి కడియం శ్రీహరి, మదుసూధనాచారీ, రవీందర్ రావుకు అవకాశం దక్కింది.ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి కౌశిక్ రెడ్డితో పాటు ఇటీవలే టీడీపీ నుంచి కారెక్కిన ఎల్ రమణకు అవకాశం ఇచ్చారు కేసీఆర్.