నాగేంద్రన్‌కి ఉరి వద్దు.. సింగపూర్‌లో ఉద్యమం..
posted on Nov 6, 2021 @ 4:15PM
అతని పేరు నాగేంద్రన్ కె ధర్మలింగం. భారత సంతతికి చెందిన వ్యక్తి. పుట్టింది మలేసియాలో. ప్రస్తుతం సింగపూర్ జైల్లో ఉన్నాడు. ఆయనకు త్వరలో ఉరి వేయనున్నారు. అయితే, నాగేంద్రన్‌కు ఉరి శిక్ష వద్దంటూ.. క్షమాభిక్ష ప్రసాదించాలంటూ ఆన్‌లైన్‌లో పెద్ద ఎత్తున ఉద్యమం నడుస్తోంది. మానవ హక్కుల సంఘాలు భారీ మొత్తంలో సంతకాలు సేకరిస్తున్నాయి. అక్టోబర్ 29న ఆన్‌లైన్ వేదికగా 50వేల సంతకాల సేకరణే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాయి. ఇప్పటివరకు 40వేలకు పైగా సంతకాలు సేకరించాయి. మరి, ఆన్‌లైన్ పోరాటం ఫలిస్తుందా? నాగేంద్రన్ కె ధర్మలింగంకు ఉరి రద్దు అవుతుందా? అనేది ఆసక్తికరంగా మారింది. ఇంతకీ ఎవరీ నాగేంద్రన్? ధర్మలింగం జైల్లో ఎందుకు మగ్గుతున్నారు? ఉరి శిక్ష పడేంత తప్పు ఏం చేశారు? అతని కోసం ఆన్‌లైన్ ఉద్యమం ఎందుకు హోరెత్తుతోంది? ఇవన్నీ ఇంట్రెస్టింగ్ విషయాలే.
భారత సంతతికి చెందిన నాగేంద్రన్ కె ధర్మలింగం 2009లో డ్రగ్స్ అక్రమ రవాణా చేస్తూ సింగపూర్ పోలీసులకు చిక్కాడు. ఆ కేసులో దోషిగా తేలిన నాగేంద్రన్‌కు సింగపూర్ కోర్టు ఉరిశిక్ష విధించింది. ఈ నవంబర్ 10న నాగేంద్రన్‌కు ఉరి వేయనున్నారు జైలు అధికారులు. దీంతో మానవ హక్కుల సంఘాలు నాగేంద్రన్ ఉరిశిక్ష రద్దుకు ప్రయత్నిస్తున్నాయి. అతను హైపర్ యాక్టివిటీ డిజార్డర్ అనే మానసిక సమస్యతో బాధపడుతున్నట్టు తెలుస్తోంది. నాగేంద్రన్ ప్రేయసిని హత్య చేస్తామని బెదిరించి.. కొందరు గుర్తు తెలియని వ్యక్తులు అతనితో బలవంతంగా డ్రగ్స్ అక్రమ రవాణా చేయించారని కూడా అంటున్నారు. అందుకే, నాగేంద్రన్‌కు క్షమాభిక్ష ప్రసాదించాలంటూ సింగపూర్ అధ్యక్షుడు హలీమా యాకోబ్‌కు అభ్యర్థనలు పంపుతున్నాయి. నవంబర్ 10న ఉరి శిక్ష అమలు చేయనుండగా.. ఈ లోపే క్షమాభిక్ష కోసం ఆన్‌లైన్ వేదికగా సంతకాల సేకరణ స్టార్ట్ చేశారు.
అయితే, 2010లో డ్రగ్స్ అక్రమ రవాణా కేసులో దోషిగా తేలిన నాగేంద్రన్ ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని సింగపూర్ అధికార వర్గాలు చెబుతున్నాయి. చేసిన అప్పులు తీర్చేందుకు పూర్తి అవగాహనతోనే అతడు ఈ తప్పు చేసినట్టు.. హైకోర్టుతో పాటు అప్పీల్ కోర్టు సమర్థించినట్టు.. సింగపూర్ హోం మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అతనితో బలవంతంగా ఈ పని చేయించారనే వాదనలను తోసిపుచ్చింది. క్షమాభిక్ష కోసం అధ్యక్షునికి నాగేంద్రన్ పెట్టుకున్న పిటీషన్ కూడా తిరస్కరణకు గురైందని హోం మంత్రిత్వశాఖ స్పష్టం చేసింది. నవంబర్ 10న ఉరి శిక్ష అమలును చూసేలా, నాగేంద్రన్ ఫ్యామిలీ మలేసియా నుంచి సింగపూర్‌కు వచ్చేందుకు ప్రయాణ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపింది. అయితే, ఆన్‌లైన్ ఉద్యమం హోరెత్తుతుండటంతో నవంబర్ 10న ఏమైనా జరగొచ్చని అంటున్నారు.