టీడీపీ జడ్పీటీసీ అభ్యర్థుల నామినేషన్ల తిరస్కరణ.. చిత్తూరు జిల్లాలో వైసీపీ కుట్ర?
posted on Nov 6, 2021 @ 5:00PM
ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార పార్టీ అక్రమాలకు పాల్పడుతుందనే ఆరోపణలు వస్తున్నాయి. వైసీపీ నేతల ఒత్తిడితో ఎన్నికల అధికారులు ఏకపక్షంగా వ్యవహిరిస్తున్నారనే విమర్శలు.. ఎన్నికల ప్రక్రియ మొదలైనప్పటి నుంచే ఉన్నాయి. టీడీపీ అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా వైసీపీ కార్యకర్తలు అడ్డుకోవడం వంటి ఘటనలు జరిగాయి. టీడీపీ అభ్యర్థులకు రక్షణ కల్పించడంలో పోలీసులు విఫలయ్యారనే ఆరోపణలు ఉన్నాయి.
నామినేషన్ల పర్వంలో పలు ప్రాంతాల్లో తీవ్ర ఉద్రిక్తతలు తలెత్తగా.. తాజాగా నామినేషన్ల పరిశీలనలోనూ అక్రమాలు జరిగాయనే ఆరోపణలు వస్తున్నాయి. చిత్తూరు జిల్లాలో ఇలాంటి ఫిర్యాదులు ఎక్కువగా వస్తున్నాయి. కలకడ, బంగారుపాళెం జడ్పీటీసీ టీడీపీ అభ్యర్థుల నామినేషన్ తిరస్కరణకు గురికావడం కలకలం రేపుతోంది.
బంగారు పాళ్యం, కలకడ మండలాలకు సంబంధించిన జెడ్పిటిసి ఎన్నికల కోసం తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు శుక్రవారం నాడు దాఖలు చేసుకున్న నామినేషన్ పత్రాలు సక్రమంగా లేవని అందువల్ల వారి దరఖాస్తులను తిరస్కర్రిస్తున్నట్లు ఎన్నికల అధికారి ఎం ఎస్ మురళి ప్రకటించారు. బంగారుపాళ్యం అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన గిరిబాబు అఫిడవిట్ వీటిలో కాలం సంఖ్య5(9) మరియు సదరు అభ్యర్థి ప్రాథమిక వ్యవసాయ పరపతి కేంద్రంలో రుణం క్లియర్ కాలేదని ప్రత్యర్థి అభ్యంతరం తెలిపారని చెప్పారు. కలకడ మండలం టిడిపి అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన సురేఖ దరఖాస్తు చేసుకున్న దరఖాస్తు ఫారంలో నమోదు చేసిన పుట్టిన తేదీ,కుల ధ్రువీకరణలోఇచ్చిన పుట్టినతేది , ఆధార్ కార్డు లో గల తేదీలు వేరు వేరుగా ఉన్నాయని, వయస్సు నిర్ధారణ కు సంబంధించి ధ్రువీకరణ సమర్పించలేదని తెలిపారు. డిక్లరేషన్ ఫారంలో దరఖాస్తు కు సాక్షి సంతకం చేసిన వారి అడ్రస్ వ్రాయలేదన్నారు.
తమ పార్టీ జడ్పీటీసీ అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరణకు గురి కావడంపై తెలుగు దేశం పార్టీ నేతలు తీవ్రంగా స్పందిస్తున్నారు. చంద్రబాబు జిల్లా కావడం వల్లే అధికార పార్టీ నేతలు కుట్ర పూరితంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. కావాలనే చిన్నిచిన్న కారణాలతో తిరస్కరించారని చెప్పారు. వైసీపీ నేతల ఒత్తిడితోనే ఎన్నికల అధికారులు పక్షపాతంతో పని చేస్తున్నారని టీడీపీ నేతలు మండిపడుతున్నారు.