పునీత్‌పై వీరాభిమానం.. ఆహారం మానేసి అభిమాని ప్రాణత్యాగం..
posted on Nov 6, 2021 @ 3:12PM
పునీత్ రాజ్‌కుమార్. కన్నడ పవర్‌స్టార్. ఆయన మరణం కోట్లది ప్రజలను విషాదంలో ముంచెత్తింది. బడాబడా సెలబ్రిటీలే ఆ షాక్ నుంచి ఇంకా కోలుకోనేలేదు. ఇక పునీత్ అభిమానులైతే తమ హీరో హఠాత్మరణాన్ని తట్టుకోలేకపోతున్నారు. పునీత్ ఇకలేరు అనే నిజం నమ్మలేకపోతున్నారు. కర్నాటకలో ఎటుచూసినా సంతాప ఛాయలే కనిపిస్తున్నాయి. పునీత్ చేసిన సినిమాలు, ఆయన జ్ఞాపకాలు, సేవ కార్యక్రమాలను తలుచుకుంటూ విచారం వ్యక్తం చేస్తున్నారు.
శివమూర్తి. పునీత్ రాజ్‌కుమార్‌కు వీరాభిమాని. తన అభిమాన తార మరణాన్ని అతను జీర్ణించుకోలేకపోయాడు. అక్టోబర్ 29న పునీత్ చనిపోయినప్పటి నుంచీ ఆహారం మానేశాడు. చామరాజనగర్ జిల్లా కొళ్లేగాల భీమానగర్‌కు చెందిన 31 ఏళ్ల శివమూర్తి ఫోటోగ్రాఫర్‌గా చేస్తున్నారు. పలుమార్లు పునీత్ రాజ్‌కుమార్‌ను కలిశారు. ఆయనతో ఫోటోలు దిగాడు. పునీత్ తరహాలోనే డ్యాన్సులు చేసేవారు. పునీత్‌ను విపరీతంగా అభిమానించేవారు. అలాంటి పునీత్.. ఇకలేరు అని తెలీగానే శివమూర్తి తీవ్ర విషాదంలో మునిగిపోయారు. మానసికంగా కృంగిపోయారు. ఆ రోజు నుంచీ అన్నం తినడం కూడా మానేయడంతో.. శరీరకంగా కృషించిపోయారు.
కుటుంబ సభ్యులు, మిత్రులు ఎంత చెప్పినా వినిపించుకోలేదు. ఆహారం తీసుకోమని ఎంత ఒత్తిడి చేసినా వినలేదు. దీంతో, శివమూర్తి ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతింది. తీవ్ర అస్వస్థతకు గురికావడంతో ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శివమూర్తి చనిపోయారు. తన ఆరాధ్య నటుడు పునీత్ రాజ్‌కుమార్ చెంతకు చేరారు.