పంట పొలాలు పాడు చేస్తారా? టీఆర్ఎస్ విజయోత్సవ వేడుకపై రచ్చ..
posted on Nov 7, 2021 @ 11:03AM
వినాయకుడి పెళ్లికి అన్నీ విఘ్నాలే అన్నట్లు టీఆర్ఎస్ విజయోత్సవ సభకు అడుగదుగునా విఘ్నాలే ఎదురవుతున్నాయి. నవంబర్ 15 సభ 29కి వాయిదా పడింది. ఆప్పుడైనా సభ జరుగుతుందా లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతుంటే, మరో వంక సభా ప్రాంగణం విషయంలో రైతులతో తలెత్తిన వివాదం, రాజకీయ రంగులు పులుముకుంటోంది. తెరాస, బీజేపీ మధ్య వివాదంగా మారుతోంది.
తెలంగాణ రాష్ట్ర సమితి పుట్టి 20 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా పార్టీ అక్టోబర్ 25న ఘనంగా ప్లీనరీ నిర్వహించుకుంది. ప్లీనరీకి కొనసాగింపుగా నవంబర్ 15న వరంగల్ లో విజయోత్సవ సభ నిర్వహించాలని, ఆ విధంగా భవిష్యత్ ప్రణాళికను ముందుకు తీసుకు పోవాలని తెరాస నాయకత్వం నిర్ణయించింది. అయితే ఈలోగా హుజూరాబాద్, ఉప ఎన్నికల్లో, కారు టైర్లు నాలుగూ ఒకేసారి పంక్చర్ కావడంతో, కారు బోల్తాకోట్టింది. సో ... నవంబర్ 29న దీక్షా దివస్ నాడు 10 లక్షల మందితో భారీ బహిరంగ సభను నిర్వహించాలని పెద్దలు నిర్ణయించారు. అందుకోసం హనుమకొండ జిల్లా హసన్‌పర్తి మండలం దేవన్నపేటలో పంట పొలాలను ఎంపిక చేశారు. అయితే ఆ సభా ప్రాంగణానికీ రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుండటం కలకలం రేపుతోంది.
సభా ప్రాంగణం విషయంలో తలెత్తిన వివాదం అధికార పార్టీకి లోప్పిగా మారింది. విజయ గర్జన సభ ఏర్పాట్లలో భాగంగా ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్, వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేశ్, మాజీ మంత్రి కడియం శ్రీహరి తదితరులు దేవన్నపేటలో సభా స్థలి పరిశీలన కోసం వెళ్లన సమయంలో రైతులకు నేతలకు మధ్య వివాదం రాజుకుంది. గ్రామ శివారులోని పంట పొలాలతో పాటు ఖాళీ ప్రదేశాన్ని చూస్తున్న ప్రజాప్రతినిధుల దగ్గరకు.. బీజేపీ నేతృత్వంలో స్థానిక రైతులు నిరసన తెలపడానికి వచ్చారు. పంట పండే తమ పొలాలను సభ కోసం ఇచ్చేది లేదంటూ ఆందోళనకు దిగారు. స్థానిక పోలీసులు, అధికారుల ఓవర్యాక్షన్ సమస్యను జటిలం చేసింది. భూమి మీ జాగీరా…మీ పై కేసులు పెడతాం ఇక్కడి నుండి వెళ్ళండి అంటూ సిఐ శ్రీధర్ రావు మహిళల పట్ల దురుసుగా మాట్లాడారు. అయినా సభ నిర్వహణకు స్థలం ఇవ్వబోమని రైతులు తేల్చి చెప్పారు.
అయితే తాజాగా తెరాస నాయకులు, అబ్బే అదేమ లేదని అంటున్నారు. అక్కడే పది లక్షల మందితో సభ జరుగుతుందని అంటున్నారు. పంట నష్టానికి రైతులకు పైసలు ఇస్తామని చెప్పిన తర్వాత రైతులు శాంతించారని, పార్టీ సీనియర్ నాయకుడు ఒకరు ‘తెలుగు వన్’కు తెలిపారు. బీజేపీ నాయకులు అనవసరంగా వివాదం సృషింటి సభను భగ్నం చేసే ప్రయత్నం చేస్తున్నారని తెరాస నాయకులు అటున్నారు. నిజానికి, నవంబర్ 29న అయినా సభ జరుగుతుందా లేక ఇంకొక శుభముహూర్తానికి వాయిదా పడుతుందా అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అదే రోజున ఆరు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ జరుగనుంది. ఆ కారణంగా సభ మరోమారు వాయిదా పడుతుందా అనే అనుమానాలున్నాయి. అయితే, ఆరుకు ఆరు సీట్లు అధికార పార్టీ ఏకగ్రీవంగా గెలుచుకునే అవకాశం ఉన్న దృష్ట్యా... ఎమ్మెల్సీ ఎన్నికలు అడ్డుకాకపోవచ్చని అంటున్నారు. అసలు పోలింగే ఉండక పోవచ్చని అంటున్నారు. అయితే, హుజూరాబాద్ దెబ్బకు కుదేలైన అధికార పార్టీ అబునున్న విధంగా పది లక్షల మందితో విజయోత్సవ సభ నిర్వహించగలదా అన్న అనపమానాలు అయితే పార్టీలో వినవస్తున్నాయి.