కేసీఆర్-కేవీపీ మిలాఖత్!.. రేవంత్‌రెడ్డి టార్గెట్‌గా కోవర్ట్ ఆపరేషన్!
posted on Nov 6, 2021 @ 5:53PM
టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ వైస్ ఛైర్మన్ పదవికి ఎంఎ ఖాన్ రాజీనామా. మంచి పదవే.. అయినా ఆయన ఎందుకు రాజీనామా చేయాల్సి వచ్చింది? ఎంఎ ఖాన్ అనే కాదు.. ఆదిలాబాద్‌కు చెందిన బలమైన నేత, మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్‌సాగర్‌రావు సైతం కాంగ్రెస్‌పై గుర్రుగా ఉన్నారు. హస్తానికి హ్యాండ్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారని టాక్. పైపైన చూస్తే.. ఈ రెండు ఘటనలు ఒకదానితో ఒకటి సంబంధం లేని విషయాలు. కానీ, వీరిద్దరూ రేవంత్‌రెడ్డి నాయకత్వానికి సవాల్ విసురుతున్నారు. కాంగ్రెస్ పార్టీ మంచి ఊపు మీదున్న ఈ సమయంలో.. వచ్చే ఎన్నికల్లో గెలిచే అవకాశాలు.. గెలిస్తే రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యే ఛాన్సెస్ ఉన్నట్టు ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో.. వీళ్లిద్దరూ ఇలాంటి ధిక్కార ధోరణి ఎందుకు ప్రదర్శించినట్టు? అనే అనుమానం కలగక మానదు. కోమటిరెడ్డి ఏదో అన్నారంటే అది వేరే విషయం. కానీ, ఎంఎ ఖాన్, ప్రేమ్‌సాగర్‌రావులాంటి వాళ్లు కూడా ఇలా చేస్తుండటం మామూలు అంశం కానేకాదు. వీరి వెనుక.. తాజా పరిణామాల వెనుక.. కీలక రాజకీయ మంత్రాంగం నడుస్తోందని అంటున్నారు. అందుకు నగర శివారులోని ఓ ప్రముఖుడి ఫాంహౌజ్ కేంద్రంగా మారిందని చెబుతున్నారు. ఇంతకీ టీకాంగ్రెస్‌లో ఏం జరుగుతోంది? వరుస లుకలుకలకు కారణం ఏంటి? వారి వెనుక ఎవరున్నారు?
ఔటర్ రింగ్ రోడ్డుకు 20–30 కి.మీ. దూరంలో.. మొయినాబాద్లో.. ఏపీకి చెందిన ఓ ప్రముఖ పారిశ్రామిక వేత్తకు ఫాంహౌస్ ఉంది. ఆ ఫాంహౌస్ కేంద్రంగానే ఇప్పుడు టీ కాంగ్రెస్ లో కొత్త కుట్రలకు తెర లేచిందని చెబుతున్నారు. ఆ ఫామ్‌హౌజ్ కేంద్రంగా.. ఒకప్పుడు కాంగ్రెస్‌కు కీలక నేతగా ఉన్న.. వైఎస్సార్ ఆత్మగా పేరుగాంచిన.. సోనియాగాంధీకి సన్నిహితుడని ప్రచారం ఉన్న.. కె.రామచంద్రరావు అలియాస్ కేవీపీ టీకాంగ్రెస్‌లో చక్రం తిప్పుతున్నారని అంటున్నారు. పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి టార్గెట్‌గా పొలిటికల్ ఆపరేషన్ చేపట్టారని.. అందులో భాగంగానే.. కేవీపీ అత్యంత సన్నిహితులైన ఎంఎ ఖాన్, ప్రేమ్‌సాగర్‌రావులు పీసీసీ నాయకత్వంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని తెలుస్తోంది. వైఎస్సార్ హయాంలో ఎంఎ ఖాన్‌కు రాజ్యసభ సభ్యత్వం ఇప్పించింది కేవీపీనే. వెలమ కమ్యూనిటీకి చెందిన ప్రేమ్‌సాగర్‌రావు సైతం వైఎస్సార్-కేవీపీ మనిషే. వీరిద్దరే ఇప్పుడు రేవంత్‌రెడ్డిపై ఇలా తిరుగుబాటు జెండా ఎగరేయడం కాకతాళీయం అస్సలు కాదని.. ఇదంతా వారి వెనుకుండి కేవీపీ ఆడిస్తున్న పొలిటికల్ డ్రామా అని అనుమానిస్తున్నారు.
ఎంఎ ఖాన్, ప్రేమ్‌సాగర్‌రావులనే కాదు.. జగ్గారెడ్డి సైతం పక్కా కేవీపీ మనిషే అంటారు. ఇటీవల జగ్గారెడ్డి సమైక్య రాష్ట్రం అంటూ సంచలన వ్యాఖ్యలు చేయడం కూడా కేవీపీ స్కెచ్‌లో భాగమేనంటున్నారు. ఆ ప్రకటన కాంగ్రెస్ పార్టీకి తీరని నష్టం చేస్తుందనే చెప్పాలి. ఇప్పటికిప్పుడు కాకపోయినా.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికైనా.. సమైక్యాంధ్రపై జగ్గారెడ్డి కామెంట్లను తనకు అనుకూలంగా మార్చుకొని.. మళ్లీ సెంటిమెంట్ రాజేసి.. ఆ మేరకు పొలిటికల్ మైలేజ్ పొందే అవకాశం లేకపోలేదు. ఓవైపు పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి సమైక్యాంధ్ర వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబట్టి.. కేసీఆర్‌ను కుమ్మేస్తుంటే.. పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సమైక్యాంధ్ర నినాదం ఎత్తుకోవడం.. కేవీపీ వ్యూహంలో భాగమే అని అనుమానిస్తున్నారు.
ఇక పీసీసీ టీమ్‌లో రేవంత్‌రెడ్డికి సన్నిహితంగా ఉంటున్న బీసీ నేత మధుయాష్కీగౌడ్‌ను సైతం ఆయన నుంచి దూరం చేసే కుట్రలు చేస్తున్నారని.. భవిష్యత్తులో పీసీసీ ప్రెసిడెంట్ పదవి ఇప్పిస్తామంటూ ఎర వేస్తున్నారని తెలుస్తోంది. ఇక అప్పటి వైఎస్సార్-కేవీపీల ప్రధాన అనుచరుడు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మొదటి నుంచీ బాహాటంగానే రేవంత్‌రెడ్డిని విమర్శిస్తున్నారు. వీరందరికీ మాజీ పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సైతం తెరవెనుక తనవంతు సహకారం అందిస్తున్నారని చెబుతున్నారు. ఇలా కేవీపీ డైరెక్షన్‌లో చిన్న చేపలన్నీ కలిసి.. కాంగ్రెస్ చెరువులో అలజడి క్రియేట్ చేసి.. రేవంత్‌రెడ్డిని బాగా డిస్ట్రర్బ్ చేసి.. అధిష్టానం దృష్టిలో పలుచన చేయడమే వారి ఎత్తుగడ అంటున్నారు. మరి, ఎవరి కోసం ఇదంతా? అంటే... ఇంకెవరి కోసం కేసీఆర్ కోసమే అంటున్నారు.
ఒకప్పుడు వైఎస్సార్ ఆత్మగా ఉన్న ఆయన.. ఇప్పుడు కేసీఆర్‌కు ముఖ్యుడిగా మారారని చెబుతున్నారు. కేవీపీ ఆపరేషన్ వెనుక కేసీఆర్ ప్రయోజనాలే ఇమిడి ఉన్నాయని అంటున్నారు. హుజూరాబాద్ ఓటమి తర్వాత టీఆర్ఎస్ పని అయిపోయిందని అంతా భావిస్తున్నారు. కేసీఆర్‌కు ఎంత డ్యామేజ్ జరిగితే.. కాంగ్రెస్-రేవంత్‌రెడ్డిలకి అంత అడ్వాంటేజ్. అలా జరగకూడదంటే.. కాంగ్రెస్‌ను కట్టడి చేయాలి. పార్టీ ఇమేజ్ సాధ్యమైనంత తగ్గించ గలగాలి. కాంగ్రెస్ పార్టీ ఎంత బలహీనపడితే.. కేసీఆర్ అంత బలపడతారు. రేవంత్‌రెడ్డిని దెబ్బ కొట్టగలిగితే.. హస్తం పార్టీని హస్తగతం చేసుకోవడం అంత సులభం అవుతుంది. అందుకే, కేవీపీ ద్వారా రేవంత్‌రెడ్డి టార్గెట్‌గా కేసీఆర్ ఆపరేషన్ కాంగ్రెస్‌కు తెరలేపారని అంటున్నారు. మరి, కేసీఆర్ కోసం కేవీపీ ఇదంతా ఎందుకు చేస్తున్నారనే అనుమానం రావొచ్చు. ఎందుకంటే.. "నువ్వు వెలమ.. నేను వెలమ.. మనం మనం వెలమలం".. అని అనుకుంటున్నారు.