బాబ్బాబు.. గెలవండి ప్లీజ్... ఆప్ఘన్లకు మద్దతుగా ఇండియన్స్
posted on Nov 7, 2021 @ 12:57PM
టీట్వంటీ వరల్డ్ కప్ లో భారత్ కు ఆపద్భందువుగా మారింది ఆప్ఘనీస్తాన్. న్యూజీలాండ్ తో ఆదివారం జరిగే లీగ్ మ్యాచ్ లో ఆప్ఘనీస్తాన్ గెలిస్తేనే టీమ్ ఇండియాకు సెమీస్ ఆశలు ఉంటాయి. అందుకే యావత్ భారత్ దేశం ఇప్పుడు ఆఫ్ఘన్ వెనుకే ఉంది. ప్రతి భారతీయుడూ ఆఫ్ఘనిస్థాన్ కు మద్దతుగా ఉంటున్నారు. మ్యాచ్ గెలవాలని ప్రార్ధనలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆప్ఘనీస్తాన్ మ్యాచ్ కు సంబంధించి సోషల్ మీడియాలో తెగ చర్చ జరగుతుంది. పెద్ద ఎత్తున మీమ్స్ వైరల్ అవుతున్నాయి.
బాబ్బాబు.. గెలవండి ప్లీజ్ అంటూ ఆఫ్ఘన్ మ్యాచ్ పై ఇండియన్ నెటిజన్లు మీమ్స్ చేస్తున్నారు. టాలీవుడ్, సినిమాల్లోని ఫైట్ సీన్లకు డైలాగులు జోడిస్తూ సెటైర్లు పేలుస్తున్నారు. పలువురు క్రికెటర్లూ వీడియోలు పోస్ట్ చేసి మీమ్స్ సృష్టిస్తున్నారు. ధోనీ, కోహ్లీ, రోహిత్ కలిసి రషీద్ ఖాన్ జుట్టు దువ్వుతున్న ఫొటోను పోస్ట్ చేశారు. అప్పట్లో ఒకే ఒక్క అభిమాని ఉంటే.. ఇప్పుడు కోట్లాది మంది అభిమానులున్నారంటూ పోస్టులు వైరల్ చేస్తున్నారు. మరికొందరు టామ్ అండ్ జెర్రీ ఫొటోలను షేర్ చేస్తున్నారు.
నిజానికి ఆదివారం మ్యాచ్ లో ఆఫ్ఘనిస్థాన్ గెలిచినా.. మన నెట్ రన్ రేట్ మెరుగ్గా ఉంటేనే మనం సెమీస్ చేరే అవకాశం ఉంది. ప్రస్తుతం మన రన్ రేట్.. ఆఫ్ఘన్ కన్నా మెరుగ్గానే ఉన్నా ఆ జట్టు గెలిస్తే మనకన్నా మెరుగయ్యే అవకాశం ఉంది. కాబట్టి నమీబియాపై మనం భారీగా గెలవాల్సి ఉంటుంది. అయితే పసికూన నమీబియాపై మ్యాచ్ గెలవడంతో పాటు నెట్ రన్ రేట్ పెంచుకోవడం కోహ్లీ సేనకు పెద్ద కష్టం కాదు. అందుకే న్యూజీలాండ్ పై ఆప్ఘనీస్తాన్ గెలవడమే ఇప్పుడు భారత్ అభిమానులకు అవసరం.