రాజధాని రైతుల పాదయాత్రలో జనసేన!
posted on Nov 25, 2021 @ 10:44AM
ఏపీ రాజధాని అమరావతి రైతుల మహాపాదయాత్రలో జనసేన పార్టీ పాల్గొంటుంది. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సూచనల మేరకు రాజధాని రైతుల పాదయాత్రలో పాల్గొనాలని జనసేన నిర్ణయించింది. పాదయాత్రలో పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ఆధ్వర్యంలో జనసేన జిల్లాల అధ్యక్షులు, రాష్ట్ర కమిటీ సభ్యులు, జిల్లా కమిటీల సభ్యులు, జనసైనికులు పాల్గొంటారు. అమరావతి రైతుల మహాపాదయాత్రలో ఈ నెల 26న జనసేన నేతలు, శ్రేణులు పాల్గొంటారని పార్టీ అధికారికంగా ప్రకటించింది. నెల్లూరు జిల్లా నార్త్ రాజుపాలెం వద్ద పాదయాత్రలో నాదెండ్ల మనోహర్ పాల్గొంటారు. జనసేన పార్టీ జిల్లాల అధ్యక్షులతో బుధవారం ఉదయం నాదెండ్ల మనోహర్ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాజధాని నిర్మాణానికి భూములిచ్చిన రైతులకు ముందు నుంచీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అండగా ఉంటున్న విషయం ప్రస్తావించారు.
ఆంధ్రప్రదేశ్లో వైసీపా పాలన మొదలైన తొలి ఏడాది కౌలు డబ్బులు సకాలంలో చెల్లించకపోవడంతో రాజధాని గ్రామాలకు వెళ్లి పవన్ కళ్యాణ్ రైతుల పక్షాన నిలిచారు. రాజధాని వికేంద్రీకరణ బిల్లు అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తర్వాత పవన్ కళ్యాణ్ రాజధాని ప్రాంతానికి వెళ్లినప్పుడు ప్రభుత్వం ఆటంకాలు కల్పించినా కాలి నడకన వెళ్లి మరీ రైతులకు ధైర్యం చెప్పారు.
ఆంధ్రప్రదేశ్కు రాజధాని ఒక్కటే ఉండాలని, అది అమరావతే కావాలనే డిమాండ్తో రైతులు 700 రోజులకు పైగా పెద్ద ఎత్తున ఉద్యమిస్తున్న విషయం తెలిసిందే. అమరావతినే రాజధానిగా కొనసాగించాలని రైతులు ‘న్యాయస్థానం టూ దేవస్థానం’ పేరిట గత 24 రోజులుగా మహాపాదయాత్ర చేస్తున్నారు. రైతుల మహాపాదయాత్రకు ఇప్పటికే ప్రతిపక్షాలు మద్దతు తెలిపాయి. బీజేపీ రాష్ట్ర అగ్రనేతలు కూడా ఇటీవలే పాదయాత్రలో పాల్గొన్నారు.